
- మామూళ్లు ఇవ్వకపోతే ఎంప్లాయ్ ఐడీలు, ప్రాన్నంబర్లు కేటాయించట్లే
- జగిత్యాల ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో కొందరు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు
జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు అన్ని ట్రెజరీ ద్వారానే జరుగుతాయి. అలాంటి ప్రధానమైన విభాగంపై నిఘా కరువైంది. కలెక్టరేట్‌లోనే జిల్లా ట్రెజరీ ఆఫీస్ ఉన్న పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సప్లమెంటరీ జీతాలు, ఇంక్రిమెంట్లు, ఏరియర్స్, సరెండర్ పీఎఫ్ లు, జీపీఎఫ్‌లు, ఇతర చెక్కులు వంటి అన్ని రకాల చెల్లింపులకు పర్సంటేజీ ముట్టచెప్పాల్సిన పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి.
పైసలు ఇవ్వకపోతే జీతాల నుంచి మొదలుకొని ఇంక్రిమెంట్లు, ఎంప్లాయ్ ఐడీలు, ప్రాన్ నంబర్లు కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం తెలిసినవారు ముందుగానే ముట్టజెప్పి పనులు చేయించుకుంటుండగా.. తెలియని వారు ట్రెజరీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.
ఎంప్లాయ్ ఐడీలు, ప్రాన్ నంబర్లకు వసూళ్లు
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ బల్దియాల్లో డిసెంబర్‌లో కొత్తగా 76 మందిని వార్డు ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. వీరిలో 60 మందికి పైగా జాయిన్ అయ్యారు. వీరికి రావాల్సిన జీతభత్యాల కోసం సంబంధిత బల్దియాలోని ఎస్టాబ్లిష్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఎంప్లాయ్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంప్లాయ్ ఐడీతోపాటు ప్రాన్ నంబర్ కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సిబ్బంది డిమాండ్ చేశారు. కొందరు ఈ మామూళ్లు సమర్పించగా వారికి ఎంప్లాయ్ ఐడీలు, ప్రాన్ నంబర్లు కేటాయించారు. మిగతా వారికి ఆలస్యంగా కేటాయించడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీతాలు మంజూరయ్యాయి.
కానీ రెండు, మూడు నెలలకు సంబంధించి సప్లమెంటరీ జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు బల్దియాల్లోని ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, ట్రెజరీ ఆఫీసర్ల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. కొత్తగా చేరిన ఉద్యోగుల నుంచి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వసూల్ చేశారు. విషయం బయటకు రావడంతో ఆ డబ్బులు రీఫండ్ చేసి వాట్సప్ గ్రూప్‌ల్లో పోస్ట్ చేశారు. తాజాగా సప్లిమెంటరీ జీతాల కోసం ట్రెజరీ ఆఫీసర్లకు 5శాతం వాటా పేరిట వసూళ్లకు తెరతీశారన్న ప్రచారం జరుగుతోంది.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రెజరీ ఉద్యోగి
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కానిస్టేబుల్ సీపీఎస్ ఫండ్ నుంచి రూ. లక్ష లోన్ కోసం అప్లై చేసుకున్నారు. తన సీపీఎస్ అకౌంట్ నుంచి లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం కోసం ట్రెజరీ ఆఫీస్‌లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ రఘు రూ.7 వేలు ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నాడు. లోన్ శాంక్షన్ కావడంతో ఒప్పందం ప్రకారం రూ. 7 వేలు ఇవ్వాలని వేధించడంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ప్లాన్ ప్రకారం డబ్బు చెల్లిస్తుండగా జూనియర్ అసిస్టెంట్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
ఎంప్లాయిమెంట్ ఐడీలు, ప్రాన్ నంబర్లు, సప్లమెంటరీ జీతాల కోసం వసూళ్లు చేస్తున్న అంశం మా దృష్టికి రాలేదు. ఎవరైనా ట్రెజరీ ఆఫీసర్ల పేరుతో వసూల్ చేస్తే బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. ట్రెజరీ ఆఫీసర్ల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. - సోఫియా, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ జగిత్యాల