స్పౌజ్​, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లలో కాసుల దందా!

స్పౌజ్​, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లలో కాసుల దందా!

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో టీచర్ల స్పౌజ్​, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ల వ్యవహారం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లలో రూ.లక్షల్లో చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. కోరుకున్న చోటుకు ట్రాన్స్​ ఫర్​ కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బేరసారాలు జరిగాయని విమర్శలున్నాయి.  ఆర్థికావసరాలు ఉన్న వారు మ్యూచువల్​ ఒప్పందంలో భాగంగా ఖమ్మం నగరానికి సమీపంలో బదిలీ కోరుకుంటున్నవారి నుంచి  లక్షలు తీసుకొని  దూరం వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. 

వారం రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు 36 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు రాగా, 45 మంది మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లలో ఖమ్మం జిల్లాకు వచ్చి డీఈఓ ఆఫీస్​ లో రిపోర్ట్ చేశారు. వారికి సోమవారం వరకు పోస్టింగ్ లు ఇవ్వలేదు. దీని వెనక  డబ్బు ఒప్పందాలే  కారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆయా ఉపాధ్యాయులు కొత్త విధుల్లో చేరగా, ఖమ్మం జిల్లాలో మాత్రం కలెక్టర్​ కు ఫైల్ పంపకుండా ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

 జిల్లాలో టీచర్ల ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్లు, పోస్టింగ్స్​పై   గతంలోనూ  ఫిర్యాదులు వచ్చాయి. గతంలో 16 మంది ఉపాధ్యాయులు తమకు ప్రమోషన్ వద్దని రివర్షన్ వచ్చిన వారికి, వారి హెచ్ఆర్ఏ స్థానాల్లో కాకుండా రాత్రికి రాత్రి 17 శాతం హెచ్ఆర్ఏ ప్లేసులు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. గత ప్రమోషన్లలో ఫిజికల్ సైన్స్ ప్రమోషన్స్ ఇవ్వకుండా నలుగురు ఉపాధ్యాయులకు అన్యాయం చేశారని,  వందలాదిమంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు పెట్టి 

నిబంధనలకు నీళ్లు వదిలారని ఫిర్యాదులు వచ్చాయి. గత బదిలీల్లో  నిబంధనలకు విరుద్ధంగా 24 మందికి స్పౌజ్​ కు దగ్గర కాకుండా,  ఇతర స్థానాల్లో   నియమించారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ ఫర్లలో సీనియార్టీ లిస్ట్ బయటపెట్టాలని, వేకెన్సీలను చెప్పి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.  అయితే డీఈవో సోమశేఖర శర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ట్రాన్స్ ఫర్లలో అందరూ రిపోర్ట్ చేసిన తర్వాతే ఫైల్​ మూవ్ చేయాల్సి ఉంటుందని, ములుగు జిల్లా నుంచి ఇద్దరు టీచర్లు శనివారం మధ్యాహ్నం రావడంతో అప్పుడు ఫైల్​ ప్రిపేర్​ చేసి జిల్లా కలెక్టర్​ కు పంపించానని తెలిపారు. బదిలీల్లో ఎలాంటి జాప్యం లేదని అంటున్నారు. 

అడిషనల్​ కలెక్టర్​కు ఫిర్యాదు

ఖమ్మం టౌన్ :  జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ చేస్తున్న అక్రమాలకు పాల్పడుతున్నట్టు  టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం  అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజకు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆ కమిటీజిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు తెలిపారు.  సోమవారం వారు మీడియాతో మాట్లాడారు.  డీఈఓ గత కొంతకాలంగా అక్రమాలకు పాల్పడుతూ బదిలీల కౌన్సెలింగ్ లో రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని    ఫిర్యాదు చేశామన్నారు.  కౌన్సెలింగ్ నిర్వహించకుండా   డీఈఓనే నేరుగా ప్లేస్ లను కేటాయించి ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.   దీనిపై అడిషనల్ కలెక్టర్ శ్రీజ   స్పందించి  వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, ఫిర్యాదు పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు టీపీ టీఎఫ్ నాయకులు తెలిపారు.