హైదరాబాద్, వెలుగు: నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు అధికారులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పోలీస్ శాఖలు ఉన్నాయి. అవినీతి అధికారుల తీరును కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలోనూ ఎక్కువగా ఈ నాలుగు శాఖల ఆఫీసర్లే ఉన్నారు. కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది.
పోలీసు శాఖలో అక్రమ దందాలు..
పోలీసు శాఖలోనూ అవినీతి, అక్రమ దందాలు ఎక్కువైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోలీసు స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిసింది. అంతే కాకుండా ఏదైనా కంప్లయింట్తీసుకుంటే.. దాంట్లో ప్రోగ్రెస్ జరగాలన్నా, యాక్షన్ తీసుకోవాలన్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయలన్నా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. కొన్నిచోట్ల ఐపీఎస్‌లు సెటిల్మెంట్లు చేస్తున్నట్టు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు సీఎం దృష్టికి వచ్చింది.
Also Read :- ఖమ్మం పోలీసుల సూపర్ ఐడియా
నల్గొండ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ వ్యవహారంపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ఐపీఎస్‌లతో పాటు కింది స్థాయి పోలీసు అధికారుల వ్యవహార శైలిపై నిఘా పెంచారు. నేరుగా ప్రజలతో లింక్ ఉన్న ఈ నాలుగు శాఖల్లో అవినీతి, అక్రమాలు ఎక్కువగా ఉండటంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని సీఎంవో అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది.