తెలంగాణలో ప్రస్తుతం మనకు మంచి వనరులు ఉన్నా మన పిల్లలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్య సేవలు అందక పోవడం, ఉద్యోగాలు దొరక్క పోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకుల అవినీతి. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భయంకరంగా అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్1 అధికారులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఆబ్కారీ, భూమి రిజిస్ట్రేషన్, ఇంజనీరింగ్ శాఖల అవినీతిలో ప్రజలు నలిగిపోతున్నారు. పరిపాలించే ప్రజా ప్రతినిధులు పూర్తిగా అవినీతిలో మునిగి తేలుతున్నారు కాబట్టి, వారు అధికారుల, ప్రభుత్వ ఉద్యోగుల, కింది స్థాయి ప్రజాప్రతినిధుల అవినీతిని పూర్తిగా పట్టించుకోవడం లేదు.
రాష్ట్రం ఎంత అవినీతిలో కూరుకుపోయిందంటే గత 9 ఏండ్లలో ఇంత అవినీతి జరిగినా, ఒక్క అధికారి, ప్రజాపతినిధి కానీ అవినీతికి సంబంధించి జైలుకు వెళ్లలేదు. శిక్షలు పడలేదు. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా అవినీతి చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అవినీతి దానికి వందరెట్లు పెరిగింది. అవినీతిని అరికట్టగల్గితే రాష్ట్రంలో పేదరికం ఉండదు, మధ్య తరగతి వాళ్లకు కష్టాలు ఉండవు, ప్రభుత్వ యంత్రాగం నీతివంతంగా పనిచేస్తుంది. తద్వారా 4 కోట్ల ప్రజలు అందరూ గౌరవ ప్రదమైన, సుఖ ప్రదమైన, సురక్షిత జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణను యూరోప్గా ఒక అభివృద్ధి చెందిన సమాజంగా తయారు చేసుకోవచ్చు.
ALSO READ :ముందస్తుకు పోతే బీజేపీ ఇంటికే : సీపీఐ నారాయణ
0.2 శాతం బడ్జెట్ కేటాయింపులు
తెలంగాణలో అవినీతిని ఆపేందుకు పరిష్కార మార్గాలే లేవా అంటే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చట్ట రూపంలో లోకాయుక్త స్థానంలో అవినీతి నిరోధక కమిషన్(ఏసీసీ)ను తీసుకురావాలి. ఏడుగురు సభ్యులతో ఈ కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. ఈ ఏడుగురు సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, శాసనసభ ప్రతిపక్ష నాయకుడితో ఉన్న ముగ్గురి కమిటీ ఎంపిక చేస్తుంది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కమిటీని నియమిస్తారు. వీరి పదవీకాలం ఐదేండ్లు. వీళ్లలో ఎవ్వరినీ రెండోసారి ఎంపిక చేయొద్దు. ఈ ఏడుగురిలో నిజాయతీ కలిగిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక రిటైర్డ్ ఐపీఎస్అధికారి, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఒక రిటైర్డ్ ఐఏఏఎస్(ఇండియన్ఆడిట్& అకౌంట్స్‌సర్వీస్)అధికారి, ఒక ప్రొఫెసర్ స్థాయి విద్యావేత్త, ఇద్దరు ప్రముఖ సామాజిక కార్యకర్తలు మాత్రమే అర్హులు అవుతారు.
జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ స్థాయివి ఉండాలి. ఏదైన కారణాల వల్ల ప్రభుత్వం వీరిని తీసేయాలంటే శాసనసభలో అభిశంసన పద్ధతి ద్వారా మాత్రమే తొలగించాలి. అవినీతి నిరోధక కమిషన్‌కు ప్రభుత్వం 0.2 శాతం తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించాలి. అంటే ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్ లో 0.2 శాతం అంటే రూ.586 కోట్లు కేటాయించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న ఏసీబీ, విజిలెన్స్‌కమిషన్ సంస్థలు రెండూ కూడా ఏసీసీ కింద పని చేస్తాయి. ఏసీబీ, విజిలెన్స్ సంస్థల్లో పనిచేసే సిబ్బందిని, అధికారులను ఏసీసీనే నియమిస్తుంది. అవసరమైతే కావాల్సిన సిబ్బందిని కన్సల్టెంట్లో కూడా నియమించుకునే స్వతంత్రత ఏసీసీకి ఉంటుంది.
పౌరుల ఫీడ్‌బ్యాక్ తో..
ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి, అందరు అధికారులు, ప్రజా ప్రతినిధులతో సహా ప్రతి సంవత్సరం జనవరి10 లోపు గత సంవత్సరం డిసెంబర్ 31 వరకు వారికి వారి జీవిత భాగస్వామి, కొడుకు, కూతుళ్లకు ఉన్న ఆస్తులు, బాంకుల్లో ఉన్న డిపాజిట్లు, షేర్లతో సహా ఆస్తుల వివరాల నివేదిక, హెఓడీ, జీఏడీ డిపార్ట్మెంట్కు ఆన్లైన్లో సమర్పించాలి. ఒక కాపీని ఏసీసీకి ఆన్లైన్ పద్ధతిలో సమర్పించాలి. ఈ సమాచారం మొత్తం కంప్యూటరైజ్ చేయడానికి, విశ్లేషించడానికి ఒక సమగ్ర సాఫ్ట్వేర్ తయారు చేయాలి. ప్రభుత్వం ఏసీసీతో కలిసి ప్రతి శాఖలో అవినీతి ప్రదేశాలు(ఏ శాఖలో ఏ స్థాయిలో జరుగుతుందనే), అవినీతి అంశాలు గుర్తించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో, ఎలాంటి సంస్కరణలు కావాలో ఆలోచించి వాటిని ప్రవేశపెట్టాలి. ఏసీసీ ఏటా ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించి పౌరుల నుంచి ఫీడ్బ్యాక్తీసుకోవాలి. ఆ ఫీడ్‌బ్యాక్ వివరాలను ప్రజలకు వెబ్సైట్ల ద్వారా, మీడియా ద్వారా అందుబాటులో ఉంచాలి.
ఎవరి పోస్టుల్లో వారినే ఉంచాలి
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ క్యాడర్ పోస్టుల్లో వారినే నియమించాలి. నాన్ కాడర్ అధికారులను, ఉద్యోగులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించకూడదు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికార్లను నాన్ క్యాడర్ పోస్టుల్లో నియమించకూడదు. ఈ విషయం అవినీతికి దారితీసే అంశం. కొంతమంది అవినీతి ముఖ్యమంత్రులు దీన్ని వాడుకొని ఆల్ఇండియా సర్వీస్అధికార్లను అవినీతిపరులుగా తయారు చేస్తున్నారు. కొంతమంది నీతివంతమైన అధికారులు మానసిక వ్యధతో డిమోటివేట్అవుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సాఫ్ట్వేర్ల ద్వారానే అన్ని లావాదేవీలు (ఆమోదాలతో సహా) జరగాలి. ఏ ఉద్యోగి దగ్గర, ఏ అధికారి దగ్గర కూడా ఫైలు ఏడురోజుల కంటే ఎక్కువ రోజులు తీసుకోకుండా ఒక సమీక్ష యంత్రాంగాన్ని పెట్టాలి. పరిపాలన పారదర్శకంగా ఉండకపోవడం అవినీతి పరిపాలనకు దారి తీస్తుంది. జారీ చేసిన అన్ని ప్రభుత్వ జీవోలు, ప్రభుత్వ మెమోలు, గెజిట్ నోటిఫికేషన్లు ప్రజల సమాచారం నిమిత్తం పారదర్శక పరిపాలనకు సూచికగా ప్రజలకు అందుబాటులో అధికార వెబ్సైట్లలో పెట్టాలి. ప్రతి ప్రభుత్వ శాఖకు అధికార వెబ్సైట్ ఉండాలి. ఆ శాఖకు సంబంధించిన సమస్త సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఆ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
అవినీతిని ఆపే పార్టీకే ఓటేద్దాం
ఇంజనీరింగ్ పనులు, ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఐఎఎస్ అధికారులు, ఇంజనీర్లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. 30 శాతం నుంచి 35 శాతం కమీషన్లు వీరందరూ కలిసి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ప్రైవేటు కంపెనీలు / సంస్థల్లో జరిగే లావాదేవీల్లో చాలా అవినీతి జరుగుతోంది. ఉదాహరణకు ప్రభుత్వ భూముల అమ్మకం, కార్పొరేట్ల విద్య, వైద్యం, భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి చాలా అవినీతి జరుగుతోంది.ఈ అవినీతి మీద ఏసీసీ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజాప్రతినిధుల అధికారుల ఆస్తులపై ఏసీసీ దృష్టి పెట్టడమే దీనికి పరిష్కార మార్గం. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు రెవెన్యూ ఇంటలిజెన్స్ ఉన్నట్టే ఏసీసీకి కూడా ఇంటిలిజెన్స్ వింగ్ ఉండాలి. ఉదాహరణకు ఒక యువ కలెక్టరు సర్వీసులోకి వచ్చిన 5 ఏండ్లలోనే హైదరాబాదులో రెండు కోట్ల ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొన్నాడు. ఇలాంటి సమాచారం, నిఘా వ్యవస్థ ఉంటే తెలుసుకోడానికి, చర్యలు తీసుకోవడానికి ఏసీసీకి అవకాశం ఉంటుంది. ఈ అన్ని అంశాలను అవినీతి నిరోధక కమిషన్ చట్టంలో పొందుపరచాలి. పై ప్రతిపాదనలను ఒప్పుకున్న రాజకీయ పార్టీకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నాం.
శిక్షలు పడేదాకా వదలొద్దు
ఏడుగురు సభ్యుల అవినీతి నిరోధక కమిషన్(ఏసీసీ)లో అందరు సభ్యులు కలిసి సమష్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఏడుగురు సభ్యులలో తప్పనిసరిగా ఒక ఎస్సీ, ఎస్టీ, ఇద్దరు బీసీ, ఒక మైనారిటీలను నియమించాలి. ఇందులో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. కమిషన్‌కు ఒక సర్వీస్ ఉన్న ఐఏఎస్ ఆఫీసరును అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించాలి. ఏసీసీ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వంలో ఉన్న అందరూ పబ్లిక్ సర్వెంట్స్(ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా)కు సంబంధించిన అవినీతి మీద ఎంక్వైరీలు చేయడం, అవినీతికి పాల్పడినట్లు రుజువైతే ఉద్యోగం నుంచి, ప్రజా ప్రాతినిధ్యం నుంచి తొలగించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అలాంటి అధికారులకు ఐపీసీ ప్రకారం సరైన శిక్షలు పడేంతవరకు కమిషన్ కోర్టుల్లో తమ సొంత న్యాయవాదుల ద్వారా కేసులను ముందుకు తీసుకువెళ్లాలి. ఒక్క ముఖ్యమంత్రి, గవర్నర్ తప్ప ప్రభుత్వ జీతం తీసుకునే అందరూ ఏసీసీ కిందకు రావాలి. ప్రతి అవినీతి కేసును ఏడాదిలోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి. ప్రభుత్వం తగినన్ని అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి.
ఈపీసీ పద్ధతిని రద్దు చేయాలి
సాధ్యమైనంతవరకు ప్రభుత్వ కార్యాలయాలతో పనిపడే ప్రజలకు, ప్రభుత్వ కార్యాలయాలకు పోకుండానే పని జరిగేటట్లు ఆన్లైన్లోనే జరిగేటట్లు పాలన ఉండాలి. సామాన్య ప్రజలు రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా మీ-సేవ కేంద్రాల ద్వారా కానీ, సొంత కంప్యూటర్ ద్వారా కానీ దరఖాస్తులు చేసుకునే సౌకర్యం కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు వారి జీవితకాలంలో ఒకటి రెండుసార్లు కూడా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే వారు ప్రభుత్వ శాఖల నుంచి కావాల్సిన సేవలు పొందుతూ నాణ్యమైన ఆత్మగౌరవ జీవనం సాగిస్తున్నారు. మీసేవ కేంద్రాలను ఎప్పటికప్పుడు సమీక్షించే యంత్రాంగాన్ని పెట్టాలి. అక్కడ అవినీతి జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి అవినీతికి అవకాశం ఉన్న ఈపీసీ(ఇంజనీరింగ్ప్రొక్యూర్మెంట్అండ్కన్స్ట్రక్షన్) పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలి. ఈపీసీ అంటే కాంట్రాక్టరు డిజైన్ ఇస్తాడు, డబ్బులు ఎంత అవుతుందో కొటేషన్ ఇస్తాడు, ఆయనే కట్టిస్తాడు. అంటే ఉదాహరణకు డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కాంక్రీట్‌తో గోడని నిర్మించాలి అంటే కాంట్రాక్టరు మట్టితో నిర్మిస్తే సరిపోతుందంటాడు. ఇంజనీరింగ్ శాఖ డిజైన్ చేసిన నమూనా ప్రకారమే అంచనాలు తయారు చేయాలి, టెండర్లు పిలవాలి, కట్టడాలు నిర్మించాలి.
- ఆకునూరి మురళి, సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్