- గతంలో, ప్రస్తుతం పనిచేసిన ఎస్‌ఐ, సీఐలపై ఆరోపణలు
- చిట్‌ఫండ్ కంపెనీ నుంచి రికవరీలో రూ.10.66 లక్షలు నొక్కేసిన సీఐ
- ఎంక్వైరీలో తేలడంతో సస్పెన్షన్
- ల్యాండ్ సెటిల్మెంట్లకు రూ.లక్షల్లో వసూళ్లు చేసిన ఎస్సై
- సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు పోలీసాఫీసర్ల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెండేళ్ల కింద ఓ చిట్‌ఫండ్ కంపెనీలో స్వాధీనం చేసుకున్న డబ్బుల్లో రూ.10.66 లక్షలు నొక్కేసిన సీఐ తాజాగా సస్పెండ్ కావడం ఆ శాఖలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో అప్పట్లో అధికార పార్టీ అండ, లీడర్ల దోస్తీతో అవినీతికి పాల్పడిన, కబ్జాలకు సహకరించిన పోలీసాఫీసర్లలో టెన్షన్ మొదలైంది.
రెండు, మూడేళ్ల క్రితం జరిగిన పోలీసాఫీసర్ల అవినీతి, వేధింపులపై కూడా సీపీ అభిషేక్ మహంతి ఫిర్యాదులు స్వీకరించడం, ఎంక్వైరీ చేస్తుండడంతో ఏ ఫిర్యాదు, ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని టెన్షన్ పడుతున్నారు. పాత ఫిర్యాదులపై ఎంక్వైరీ జరుగుతుండగానే.. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్సైలు, సీఐలపైనా ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది.
రూ.10.66 లక్షలు నొక్కేసిన సీఐ
2022 మార్చి 22న అప్పటి సీపీ ఆదేశాల మేరకు ఉజ్వల ఫైనాన్స్ సంస్థపై పోలీసులు దాడులు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లతోపాటు రూ.19,66,900 స్వాధీనం చేసుకుని అప్పటి టూ టౌన్ సీఐ లక్ష్మీబాబుకు అందజేశారు. అయితే నగదు విషయాన్ని సదరు సీఐ జప్తు పంచనామాలోగానీ, చార్జ్ షీట్‌లోగానీ పేర్కొనలేదు. స్వాధీనం చేసుకున్న 14 పేపర్లలో 8 మాత్రమే చూపారు. నగదు స్వాధీనం చేసుకున్నప్పుడు అనుసరించాల్సిన ప్రొసీజర్ ను నిర్లక్ష్యం చేశారు.
మార్చి 23న ఎఫ్ఐఆర్ కాగా.. ఆర్నెళ్ల తర్వాత చిట్ ఫండ్ కేసులో నిందితుడైన భీమనాథుడి సుధాకర్‌కు కేవలం రూ.9 లక్షలు ఇచ్చి.. మిగతా డబ్బులను సొంతానికి వాడుకున్నారు. 14 పేపర్లను కూడా తన వద్ద అనధికారికంగా పెట్టుకున్నాడు. ఈ వ్యవహారంపై సుధాకర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా విషయం బయటకు వచ్చింది. దీంతో కరీంనగర్ సీపీ ఇచ్చిన రిపోర్టు మేరకు మల్టీజోన్ - 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సీఐ లక్ష్మీబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిద్ధిపేట వన్ టౌన్ సీఐగా పని చేస్తున్న ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు.
జమ్మికుంట ఎస్సైపై ఫిర్యాదు..
ప్రస్తుతం జమ్మికుంట ఎస్సై గా పనిచేస్తున్న ఆరోగ్యంపై సీపీకి సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారు. పైసలివ్వనిదే ఆయన ఏ పని చేయరనే ఆరోపణలు ఉన్నాయి. నెల రోజుల క్రితమే ఆయన సైదాపూర్ నుంచి జమ్మికుంట స్టేషన్‌కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. సైదాపూర్ ఎస్సైగా పనిచేసిన సమయంలో భూవివాదాల్లో తలదూర్చి రూ.లక్షలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి ఊరిలో మధ్యవర్తులను పెట్టుకుని వసూళ్లు చేసేవాడని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సపోర్టు చేస్తూ బాధితులకు అన్యాయం చేశాడనే పేరుంది. ఆయన జమ్మికుంటకు ట్రాన్స్‌ఫర్ కావడం, తమ భూసమస్యలు పరిష్కారం కాకపోవడంతో డబ్బులు ఇచ్చిన బాధితులు.. కరీంనగర్ సీపీతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఆరోగ్యం ఏకంగా ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి బెదిరించిన సీసీ కెమెరా ఫుటేజీని కూడా సీపీకి అందజేశారు. దీంతో సీపీ.. ఎస్‌ఐ ఆరోగ్యం వ్యవహారంపై ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది.
సెటిల్మెంట్ అడ్డాలుగా ఠాణాలు..
సీపీ అభిషేక్ మహంతి తరుచూ పోలీస్ స్టేషన్లను విజిట్ చేస్తూ ఎస్సైలు, సీఐలు, సిబ్బందిని హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. స్టేషన్లలోనే ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా సైదాపూర్ లో వసూళ్లకు పాల్పడిన ఎస్సై ఆరోగ్యం వ్యవహారం.. ఆయన అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యాక వెలుగుచూసింది. సీపీ నజర్ ఉందని తెలిసినా కూడా కరీంనగర్ సిటీలోని పలు పోలీస్ స్టేషన్లతోపాటు రూరల్ స్టేషన్లలో ఎస్సైలు, సీఐల నెలవారీ స్టేషన్ మామూళ్లను వ్యాపార వర్గాల నుంచి వసూళ్లు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇసుక రవాణా జరిగే మానేరు తీర ప్రాంత పోలీస్ స్టేషన్లలోనూ ట్రాక్టర్లు, లారీల ఓనర్ల నుంచి మామూళ్లు మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. పోస్టింగ్‌లకు డబ్బులు ఇచ్చే పద్ధతి పోయినా.. ఇంకా కొందరు ఎస్సైలు, సీఐలు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, కొందరిపై వేటు వేస్తేనే ప్రజలకు పోలీస్ స్టేషన్లలో న్యాయం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.