- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లేబర్ ఆఫీస్ కేంద్రంగా దందా
- దళారులతో కలిసి కోట్లు కొల్లగొట్టిన అసిస్టెంట్ లేబర్ఆఫీసర్
- ఫోర్జరీ డెత్ సర్టిఫికెట్లు, ఆధార్‌లో ఏజ్ ట్యాంపరింగ్
- ఆర్టీఐతో గుట్టు బయటకు... అంతకుముందే ఏసీబీకి చిక్కిన ఆఫీసర్
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని కార్మిక శాఖలో పని చేస్తున్న ఓ లేడీ ఆఫీసర్ సర్కారును నిండా ముంచింది. ఎప్పుడో చనిపోయిన వారు తాజాగా చనిపోయినట్టు, బతికున్న వారిని రికార్డుల్లో మరణించినట్టు చూపించి రూ.కోట్ల క్లెయిమ్స్ కొల్లగొట్టింది. మండలాల వారీగా బ్రోకర్లను పెట్టుకుని వారి సహకారంతో ఎప్పుడో చనిపోయిన వారి పేరిట కార్మిక సంక్షేమ బోర్డు ఐడీ కార్డులను సృష్టించింది. కొద్ది నెలల తర్వాత వారు సహజంగానే మరణించారంటూ ఫేక్ డెత్‌సర్టిఫికెట్లు చూపించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షా ముప్పై వేల చొప్పున ఇన్స్యూరెన్స్ డబ్బులు కాజేసింది. బతికున్న వాళ్లనూ వదల్లేదు. పదేండ్ల నుంచి ఒకే చోట పనిచేస్తూ డబ్బులు ఇవ్వనిదే ఏ పని చెయ్యదన్న పేరు సంపాదించుకుంది. జూన్8న ఓ కార్మికుడి డెత్క్లెయిమ్కు సంబంధించి రూ.30 వేలు లంచం డిమాండ్ చేయడంతో అతడి కొడుకు నరేశ్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ఆధ్వర్యంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె తొర్రూరు అసిస్టెంట్ లేబర్ఆఫీసర్ పి.సుమతి. ఈమె సంపాదనపై అనుమానం వచ్చిన కొందరు సమాచార హక్కు చట్టం కింద 2019 నుంచి 2023 సంవత్సరం వరకు తొర్రూరు డివిజన్ పరిధిలో భవన నిర్మాణ కార్మికుల డెత్ క్లెయిమ్స్ వివరాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని పరిశీలించి చూడగా సుమతి చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
రూల్స్ ను అనుకూలంగా మల్చుకుని..
కార్మిక శాఖ రూల్స్ ప్రకారం...కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షలు, సహజ మరణమైతే రూ.లక్షా 30 వేలు అందజేస్తారు. ఎవరైనా కార్మికుడు ప్రమాదంలో మరణించిన తర్వాత పోస్టుమార్టమ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఇతర వివరాలు సమర్పిస్తే రూ. 6 లక్షలు అందజేస్తారు. కానీ, సహజ మరణమైతే కేవలం డెత్‌సర్టిఫికెట్, నామినీ బ్యాంకు ఎకౌంట్ డిటెయిల్స్‌తో పాటు కార్మిక శాఖ అసిస్టెంట్లేబర్ ఆఫీసర్ ధ్రువీకరణ సర్టిఫికెట్సరిపోతుంది. ఈ నిబంధనను ఎట్లా తనకు అనుకూలంగా మలుచుకోవాలా అని తన మెదడుకు పని పెట్టిన సుమతికి ఓ దారి దొరికింది.
ఎలా ఇంప్లిమెంట్చేసిందంటే..
తొర్రూరు డివిజన్‌పరిధిలో ఏడు మండలాలకు సుమతి ఇన్చార్జి. ఏ డెత్ క్లెయిమ్ అప్రూవ్ చేయాలన్నా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఆమె సంతకం తప్పనిసరి. దీంతో ఎవరూ తనను అనుమానించరనిఅనుకుంది. కార్మిక శాఖ రూల్స్ప్రకారం 18 నుంచి 60 ఏండ్లలోపు కార్మికులకు మాత్రమే కార్మిక సంక్షేమ బోర్డు ఐడీ కార్డులు ఇస్తారు. అయితే, తొర్రూరు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో నియమించుకున్న బ్రోకర్ల ద్వారా ఎక్కువ వయస్సున్న వృద్ధుల డేటా సంపాదించింది. కొందరి ఆధార్ కార్డుల్లో 60 ఏండ్లకు మించి వయస్సు ఉండడంతో అందులో ఏజ్ ట్యాంపరింగ్ చేయించి 60 ఏండ్లలోపు ఉన్నట్టు మార్చింది. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డుల పేరిట కార్డులను అందజేసింది. భవన నిర్మాణ పనులతో సంబంధం లేని వారికి కూడా ఈ ఐడీ కార్డులు వచ్చేలా చేసింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే కొంత మంది చనిపోయిన వారి పేరిట కూడా కార్డులను సృష్టించింది. ఇలా తెలంగాణ భవన, ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డుల ఇన్స్యూరెన్స్డబ్బులను కొల్లగొట్టింది. పదేండ్లలో ఈ అవినీతి ఆఫీసర్ రూ. 2 కోట్లకు పైగా కాజేసినట్లు సమాచారం.
వీళ్లే రికార్డుల్లో చనిపోయింది..
తొర్రూరు మండలంలోని సోమారపు కుంట తండాలో బతికి ఉన్న ముగ్గురి పేరిట ఇన్స్యూరెన్స్డబ్బులు క్లెయిమ్ చేసింది. వీరిలో బానోతు కళ్యా చనిపోయినట్టు చూపించి ఈమె భర్త బిక్షాను నామినీగా పెట్టి డబ్బులు తీసుకున్నారు. అలాగే బానోతు సక్రి మరణించిందని చెప్పి ఆమె భర్త బోడ్యా ను నామినీగా చూపి రూ.లక్షా 30 వేలు దండుకున్నారు. బానోతు సత్తెమ్మ @ సక్రుకు ఆమె కొడుకును నామినీగా చేసి పైసలు తీసుకున్నారు. కళ్యా ఆగస్టు 5, 2019లో చనిపోయిందని చెప్పి క్లెయిమ్‌కోసం అక్టోబర్ 2019లో దరఖాస్తు చేశారు. కళ్యా డబ్బులను తర్వాత నెలలో అంటే నవంబర్ లో అప్రూవల్ చేసి తీసుకున్నారు. ఇక సక్రి ఫిబ్రవరి 2019లో చనిపోయినట్టుగా చూపించి జూన్ 2019లో అప్రూవల్ ఇచ్చి డబ్బులు పంచుకున్నారు. బానోత్ సత్తెమ్మ నవంబర్ 2020లో మరణించినట్టు చూపించి డిసెంబర్ 2021లో క్లెయిమ్ చేసుకున్నారు. వీరే కాకుండా తొర్రూరు డివిజన్లోని ఏడు మండలాల్లో ఎంతోమంది రికార్డులు మార్చి రూ.కోట్లు కొట్టేసినట్టు తెలుస్తోంది. విచిత్రమైన విషయం ఏమిటంటే వచ్చిన సొమ్ములో ఎవరైతే రికార్డుల్లో చనిపోయారని చెబుతున్నారో వారికీ వాటా ఇచ్చారు. డబ్బులు వారికి సంబంధించిన వారి నామినీల ఎకౌంట్లలో పడతాయి కాబట్టి ఆఫీసర్సుమతి డైరెక్ట్ తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వారిని ఒప్పించి ఈ తతంగం నడిపించినట్టు సమాచారం. వచ్చిన డబ్బులో లబ్ధిదారులు, ఏజెంట్లు, తొర్రూరు అసిస్టెంట్ లేబర్ఆఫీసర్ సుమతి వాటాలుగా పంచుకున్నారు.
జీపీ నుంచిడెత్ సర్టిఫికెట్స్ ఇయ్యలే
తొర్రూరు మండలం సోమారపుకుంటతండా జీపీ సెక్రటరీగా 2019 నుంచి పని చేస్తున్నా..తండాకు చెందిన బానోతు కళ్యా భర్త బిక్షా, బానోతు సక్రి భర్త బోడ్యా, బానోతు సత్తెమ్మ @సక్రు చనిపోయారని డెత్సర్టిఫికెట్కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ తండాలో వీరు మరణించినట్లు నేను ఎలాంటి సర్టిఫికెట్ఇవ్వలేదు. వాళ్లంతా బతికే ఉన్నారు.
- గుగులోతు రాజు, జీపీ సెక్రటరీ, సోమారపు కుంట తండా