మంచిర్యాల, వెలుగు: గొల్ల కురుమల డెవలప్మెంట్ కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ స్కీం బ్రోకర్లకు, ఆఫీసర్లకు వరంగా మారింది. లబ్ధిదారులకు బక్కచిక్కిన గొర్రెలు అంటగట్టి భారీగా దండుకుంటున్నారు. యూనిట్‌కు 21 జీవాలు ఇవ్వాల్సి ఉండగా 10 నుంచి 15 మాత్రమే ఇస్తున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరగడంతో స్కీం అభాసుపాలైంది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్‌లో అంతకంటే ఎక్కువ దోపిడీ జరుగుతోంది. యానిమల్హజ్బెండరీ డిపార్ట్మెంట్కు చెందిన ప్రజాప్రతినిధితోపాటు పెద్దసార్ల కనుసన్నల్లోనే అక్రమ దందా నడుస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గొల్ల కురుమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండేళ్లలో 7 లక్షల 28 వేల యూనిట్లకు కోటి 53 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పింది. లిస్ట్–ఏలో 3.67లక్షలు, లిస్ట్– బీలో మరో 3.61లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. లిస్ట్– ఏలోని లబ్ధిదారులకు 70 లక్షల 10 వేల గొర్రెలను పంపిణీ చేసింది. 2019లో లిస్ట్–బీలోని లబ్ధిదారులకు 75 లక్షల 98 వేల గొర్రెలు ఇస్తామంటూ వారి వాటా కింద రూ.32,500 చొప్పున డీడీలు కట్టించుకుంది. ఆ తర్వాత వరుసగా ఎలక్షన్లు రావడంతో గొర్రెల పంపిణీ ఆగిపోయింది. వీరికి 75 లక్షల 98 వేల జీవాలు ఇవ్వాల్సి ఉండగా ఐదు లక్షలకు పైగా అందజేశారు. మూడేండ్ల తర్వాత ఫేజ్–2మొదలైంది.
పెరిగిన యూనిట్‌కాస్ట్
గతంలో యూనిట్ కాస్ట్రూ. లక్షా 25 వేలు ఉండేది. ఇందులో 25 శాతం లబ్ధిదారు వాటా రూ.32,500 కాగా, మిగతా మొత్తం సర్కారు సబ్సిడీ. మూడేండ్లలో గొర్రెల రేట్లు పెరగడంతో యూనిట్ కాస్ట్‌ను మరో రూ.50వేలు పెంచి రూ.లక్షా 75 వేలు చేసింది. లబ్ధిదారులపై రూ.12,500 అదనంగా భారం వేసింది. యూనిట్లో ఇరవై గొర్రెలు, ఒక పొట్టేలు మొత్తం 21 ఇస్తుండగా, లబ్ధిదారులు రూ.45 వేలు చెల్లించాలి. ఫస్ట్‌ఫేజ్‌లో వెటర్నరీ డాక్టర్లు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన ప్రభుత్వం సెకండ్‌ఫేజ్‌లో వాళ్లను పక్కన పెట్టింది. జిల్లాలకు మహారాష్ర్ట, ఏపీలో పాయింట్లను కేటాయించింది. అక్కడ జాయింట్ డైరెక్టర్ స్థాయి ఆఫీసర్లను ఇన్చార్జిలుగా నియమించింది. లబ్ధిదారులు వారికి కేటాయించిన పాయింట్‌కు వెళ్లి సంబంధిత ఆఫీసర్లను కలిస్తే వాళ్లు బ్రోకర్లకు అప్పజెప్తున్నారు. ఆపై దందా అంతా బ్రోకర్లే నడిపిస్తున్నారు.
బక్కచిక్కిన గొర్రెలు.. లేదంటే పైసలు
మంచిర్యాల జిల్లాకు మహారాష్ట్రలోని చంద్రాపూర్, ఏపీలోని అనంతపూర్ జిల్లాల్లో పాయింట్లు కేటాయించారు. అక్కడికి వెళ్లిన లబ్ధిదారులను బ్రోకర్లు నాలుగైదు రోజులు అటూ ఇటూ తిప్పి పరేషాన్ చేస్తున్నారు. చివరకు బక్కచిక్కిన, బాగాలేని గొర్రెలను చూపిస్తున్నారు. అవి వద్దంటే రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తున్నారు. విధిలేక చాలామంది ఇచ్చినంత తీసుకొని ఇంటిబాట పడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న పెద్ద గొర్రెలు కావాలంటే పది, చిన్నవైతే పదిహేను ఇస్తున్నారు. ఆఫీసర్లు గొర్రెలను వ్యాన్లలో ఎక్కించి ఫొటోలు తీసి, ట్యాగ్ నంబర్లు ఆన్లైన్ చేసుకున్న వెంటనే బ్రోకర్లు వాటిని దించుకుంటున్నారు. లేదా వ్యాన్లతో పాటు ఇక్కడికి రాగానే మళ్లా తీసుకెళ్తున్నారు. ఇలా రీసైక్లింగ్ దందా సైతం జోరుగా సాగుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని లబ్ధిదారులు 15 రోజుల కిందట మహారాష్ట్రలోని చంద్రాపూర్ పాయింట్‌కు వెళ్లారు. బ్రోకర్లు బక్కచిక్కిన గొర్రెలు చూపించి అవి వద్దంటే రూ.80 వేల నుంచి రూ.లక్ష ఇస్తామన్నారు. ఆ జీవాలను ఇక్కడికి తెచ్చినా బతికేట్టు లేకపోవడంతో పైసలు తీసుకొని వచ్చేశారు. మందమర్రి మండలంలోని ఓ ఊర్లో ఆరు యూనిట్లు మంజూరు కాగా, లబ్ధిదారులు గొర్రెల కోసం చంద్రాపూర్ వెళ్లారు. ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు ఇస్తే సాదుకుంటామని చెప్పగా.. పెద్దవి, చిన్నవి కలిపి 15 మాత్రమే ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి.