- ఒక్క కాంట్రాక్టర్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన ఆఫీసర్లు
- ఇష్టం వచ్చినట్లు కిరాణం రేట్ల పెంపు
- కూరగాయలు, పండ్ల రేట్లలో భారీగా కోతలు
- స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందడం అనుమానమే..
నల్గొండ, వెలుగు : ఒక్క కాంట్రాక్టర్‌కు ప్రయోజనం కలిగించేందుకు ఏకంగా రూల్స్‌నే మార్చడంతో ఓ వైపు సర్కార్ ఖజానాకు కన్నం పడుతుండగా, మరో వైపు స్టూడెంట్లు క్వాలిటీ ఫుడ్‌కు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కేజీబీవీలు, ఆదర్శ స్కూళ్లకు పండ్లు, కూరగాయలు, కిరాణం, పాలు, గుడ్లు, చికెన్, మటన్ సప్లై చేసేందుకు నల్గొండ విద్యాశాఖ ఆఫీసర్లు ఇటీవల టెండర్లు పిలిచారు. గతేడాది డివిజన్ల వారీగా టెండర్లు పిలిచిన ఆఫీసర్లు ఈ సారి జిల్లా కేంద్రంగా పిలవడంతోనే అసలు కథ మొదలైంది.
టర్నోవర్ రూ. 10 కోట్లు ఉండాలంటూ రూల్
నల్గొండ జిల్లాలోని 27 కేజీబీవీలు, 17 మోడల్ స్కూళ్లు, ఒక అర్బన్ స్కూల్‌కు కలిపి టెండర్లు పిలిచారు. ఇందులో కిరాణ సామాన్లకు సంబంధించిన టెండర్ అత్యంత విలువైనది. కిరాణం టెండర్ ఏడాది మొత్తం కలిపినా రూ. 2 కోట్లకు మించదు. కానీ ఒక కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు వార్షిక టర్నోవర్ రూ. 10 కోట్లు, మూడేళ్ల అనుభవంతో పాటు మరో 10 కోట్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన తెచ్చారు. అయితే దీన్ని కేవలం కిరాణం సామాన్లకే పరిమితం చేసిన ఆఫీసర్లు పాలు, పండ్లు, మటన్, చికెన్, కూరగాయలకు మాత్రం ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్, రూ. కోటి సాల్వెన్సీతో సరిపుచ్చారు. దీంతో కిరాణం టెండర్ ఒక్కరికే దక్కింది.
పొంతన లేని రేట్లు
కిరాణం సామాన్లలో కందిపప్పు కేజీ రూ.171లు, ఎండు మిర్చి రూ.195, జీలకర్ర రూ.440, ఇలాచీ రూ.2,950లు, మినపగుండ్లు రూ.138, గసగసాలు రూ.1,400 చొప్పున 79 రకాల వెరైటీలకు ఇష్టం వచ్చినట్లు రేట్లు ఫిక్స్ చేశారు. అదే కూరగాయల విషయంలో ఆలుగడ్డ, బెండకాయ, క్యాబేజీ, కందగడ్డ, సొరకాయ, దొండకాయ, టమాట, కాలిఫ్లవర్‌తో సహా అన్ని రకాల కూరగాయాల రేట్లు కలిపి కేజీ రూ.23.9లు మాత్రమే ఫిక్స్ చేశారు.
వంద నిమ్మకాయలు రూ.2, అల్లం, అల్లం పేస్ట్కేజీ రూ.5, ఉల్లిగడ్డలు కేజీ రూ.2.9 చొప్పున నిర్ణయించారు. ఇక విద్యార్థులకు అందించే పండ్ల రేట్లలో 125 గ్రాముల అరటిపండు రూ.29, మూడు కేజీల పుచ్చకాయ రూ.16లు, జామకాయ, ఆరెంజ్, మామిడి పండ్లు కేజీ ఒక్క రూపాయి చొప్పున ఖరారు చేశారు. ఇక కోడిగుడ్డుకు గవర్నమెంట్ ఇచ్చే రేట్ రూ. 5 మాత్రమే. ఇంత తక్కువ రేట్గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ రద్దు చేసుకున్నాడు. ఇక మటన్ రూ. 550, చికెన్ అయితే పేపర్ రేట్ మీద రూ.30 తక్కువకు సప్లై చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాల్లోనూ...
కేబీబీవీ, మోడల్ స్కూల్‌లో కిరాణం టెండర్ దక్కిన కాంట్రాక్టర్‌కే ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం జరుగుతోంది. గతేడాది వరకు అన్ని శాఖలు వేర్వేరుగానే టెండర్లు పిలిచాయి. కానీ ఇప్పుడు అన్ని గురుకులాలకు కలిపి మంగళవారం ఒకటే టెండర్ పిలిచారు. కూరగాయలు, పాలు, గుడ్లు, చికెన్, మటన్‌కు మాత్రమే టెండర్‌ను పిలిచిన ఆఫీసర్లు కిరాణ సామానుకు మాత్రం పిలవలేదు. ఈ విషయంపై ఆఫీసర్ల వివరణ కోరగా పైఆఫీసర్లు చెప్పడం వల్లే కిరాణం టెండర్ పిలవలేదని, అన్నింటికీ కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారని అన్నారు. ఈ మూడు డిపార్ట్‌మెంట్లలో కలిపి ఏడాది మొత్తం టెండర్ విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. అన్నింటితో పాటే కిరాణం సామాన్లకు టెండరు పిలిస్తే ప్రభుత్వానికి నష్టం జరిగేది కాదు. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందేది. కానీ ఆఫీసర్ల నిర్వాహకం వల్ల ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
సర్కార్‌కు నెలకు రూ.3.24 లక్షలు లాస్
ఆఫీసర్ల నిర్వాకం కారణంగా ఒక్కో గురుకులం పేరున ప్రభుత్వానికి నెలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల నష్టం కలుగుతోంది. కేజీబీవీ, మోడల్ స్కూల్ టెండర్లలో కందిపప్పు కేజీ రూ.171గా డిసైడ్ చేశారు. కానీ గతేడాది అన్ని గురుకులాల్లో కందిపప్పు కేజీ రూ.132కే సప్లై చేశారు. అంటే ఒక్క కిలో కందిపప్పు పైనే రూ.39లు అదనపు భారం పడుతోంది. 700 మంది ఉండే గురుకులంలో నెలకు ఐదు నుంచి ఆరు వందల కిలోల కందిపప్పు వాడుతారు. గతేడాది కంటే ఈ సారి రూ. 39 పెంచడంతో కాంట్రాక్టర్‌కు నెలకు రూ.27 వేలు మిగులుతుంది. జిల్లాలో 12 ఎస్సీ గురుకులాలు ఉండగా ఒక్క కందిపప్పు మీదనే రూ. 3.24 లక్షలు కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తుంది.
హోల్‌సేల్‌లో రూ.152కే కేజీ కందిపప్పు దొరుకుతున్నప్పటికీ ఆఫీసర్లు రూ.39 అదనంగా ఇవ్వడం వల్ల ఈ ప్రభావం గుడ్లు, కూరగాయల మీద పడింది. కిరాణం రేట్లను భారీగా పెంచిన ఆఫీసర్లు గుడ్లకు మాత్రం రూ.5కు మించి ఇవ్వలేమని ఖరాఖండిగా చెప్పారు. దీంతో కాంట్రాక్టర్లు వెనక్కి వెళ్లిపోయారు. ఇకపోతే మటన్ ప్రతి నెల రెండు సార్లు పెడ్తారు. గతేడాది రేట్లు గిట్టుబాటు కాలేదంటూ నెలకు ఒకసారి మాత్రమే సప్లై చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ గతేడాది రేట్‌నే ఫైనల్ చేశారు. దీంతో ఒక్కసారైనా పెడ్తారన్న నమ్మకం లేదు.
మినపగుండ్లు గతేడాది కేజీ రూ. 120కి సప్లై చేయగా ఈ సారి రూ.138గా డిసైడ్చేశారు. ఎండుకారం ఎంఆర్‌పీ మీద 8 శాతం డిస్కౌంట్‌తో సప్లై చేయాలని నిర్ణయించారు. మార్కెట్‌లో ఎండుకారం కేజీ రూ.220కి కొంటే ఆఫర్ రూపంలో మరో ప్యాకెట్ వస్తోంది. ఇలాంటి రేట్ల వల్ల కాంట్రాక్టర్‌కు లాభం జరగడమే తప్ప ప్రభుత్వానికి, స్టూడెంట్లకు ఒరిగేదేమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కూరగాయలు, పండ్ల సప్లై కష్టమే...
కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల స్టూడెంట్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,225 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. క్లాస్‌లో 40 మంది స్టూడెంట్లు ఉంటే నెలకు రూ.49 వేలు మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ ఆఫీసర్లు డిసైడ్ చేసిన రేట్లు చూస్తే బడ్జెట్ రూ. 49 వేలు దాటిపోతోంది. కిరాణ సామాన్లకు ఎక్కువ రేట్లు ఫిక్స్ చేయడంతో కూరగాయలు, పండ్లు సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడింది. కిరాణం రేట్లు గతేడాది మాదిరిగానే ఉంటే స్టూడెంట్లకు గుడ్లతో పాటు అన్ని రకాల కూరగాయాలు అందేవి. కానీ ఇప్పుడు కొన్ని ఐటమ్స్‌లో కోత పెట్టి మొత్తం బడ్జెట్ కిరాణం సామాన్లకే చెల్లించాల్సి వస్తోంది.
పైఆఫీసర్ల ఆదేశాల మేరకే..
పైఆఫీసర్ల ఆదేశాలనే మేం పాటించాం. గతేడాది కాంట్రాక్టర్లు నాసిరకంగా సప్లై చేశారనే ఈ ఏడాది జిల్లా కేంద్రంలో టెండర్లు పిలిచాం. రేట్లు, టెండర్లు ఫైనల్ చేసింది కూడా పైఆఫీసర్లే. నోటిఫికేషన్ మార్పులో మా ప్రమేయం లేదు.
– భిక్షపతి, డీఈవో, నల్గొండ