ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రూల్స్​కు విరుద్ధంగా 3.50 లక్షల పిల్లలు పంపిణీ

చిన్నవి సప్లై చేసిన  ఏజెన్సీ నిర్వాహకులు

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్ట్​ఏజెన్సీ నిబంధనలు తుంగలో తొక్కి 3.50 లక్షల క్వాలిటీలేని పిల్లలను సరఫరా చేసినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒప్పందానికి భిన్నంగా జరిగినా... ఆఫీసర్లు పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. 

కృష్ణా జిల్లా నుంచి...

జిల్లాలో మొత్తం 212 మత్స్య సహకార సొసైటీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 11 వేల మందికిపైగా మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఆయా జలవనరుల్లో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. ఈసారి చేపపిల్లల పంపిణీ కోసం నలుగురు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో కొన్ని ఏజెన్సీలు ఇప్పటి వరకు రెండు లక్షల పిల్లలు సప్లై చేశాయి. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన రుద్రరాజు రాజేశ్వరి కాంట్రాక్ట్​ఏజెన్సీ 3.50 లక్షల సరఫరా చేసింది. అయితే ఈ ఏజెన్సీ సప్లై చేసిన పిల్లలు చిన్నసైజు ఉన్నట్లు మత్స్యకారులు తేల్చారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇవి తొందరగా చనిపోయే అవకాశం ఉందని... జిల్లాలోని జలవనరుల్లో పెంచడానికి అనుకూలంగా లేవని తెలిపారు. స్పందించిన ఆఫీసర్లు చేపపిల్లల పంపిణీ నిలిపివేయాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. 

నిబంధనలు పాటించలె...

నిబంధనల ప్రకారం చేపపిల్లలను రిజర్వాయర్లు, చెరువుల్లో వదిలేటప్పుడు లోకల్​మత్స్య సహకార సంఘాల సమక్షంలో క్వాలిటీ నిర్ధారించాలి. కానీ.. చాలాచోట్ల ఇలా జరకపోవడంతో కాంట్రాక్టు ఏజెన్సీ ఇష్టానుసారంగా చేప పిల్లలు జిల్లాకు తరలించింది. ఏజెన్సీకి ఆఫీసర్లు, అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లోనే ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారని.. మిగతాచోట్ల ఇష్టమొచ్చినట్లు చేపపిల్లలను జలవనరుల్లో వదులుతున్నారని మత్స్యకారులు ఫైర్​అవుతున్నారు. 

రెండు లక్షల పిల్లలు పంపిణీ..

వర్షాకాలం దాదాపు ముగిసింది. ఇప్పటి వరకు మూడు ఏజెన్సీలనుంచి అందిన రెండు లక్షల చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో వదిలారు. ఇంకా చాలాచోట్ల పిల్లలు వదలాల్సి ఉంది. గత సంవత్సరం కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నాణ్యతలేని చేప పిల్లలను జిల్లాకు సరఫరా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  జిల్లాలోని ఐదు రిజర్వాయర్లు, 701 చెరువుల్లో ఏటా 4.89 కోట్ల చేపపిల్లలు వదలాల్సి ఉంది. ఈసారి టెండర్​ప్రక్రియ లేట్​కావడంతో పంపిణీ ఇంకా పూర్తికాలేదు.

నాణ్యత విషయంలో రాజీ లేదు...

చేప పిల్లల నాణ్యత విషయంలో రాజీపడేదిలేదు. మత్స్యకారుల ఉపాధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. జిల్లాకు సరఫరా అవుతున్న చేపపిల్లల నాణ్యత విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నాం. రుద్రరాజు రాజేశ్వరి ఏజెన్సీ సరఫరా చేసిన పిల్లలను తిరస్కరించాం. టెండర్​రద్దు చేశాం. నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లను బ్లాక్​లిస్టులో పెడుతాం. చేప పిల్లలను సరఫరా చేసేందుకు నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడంతోనే పంపిణీ ఆలస్యమవుతోంది. – నర్సింహరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్

పకడ్బందీగా పోడు భూముల సర్వే

ఆసిఫాబాద్,వెలుగు: పోడు భూముల సర్వే పకడ్బందీగా చేయాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​ఆదేశించారు. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం వావ్ దాం, గంటలగూడ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖల అధికారులు, ఎఫ్​ఆర్సీ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలన్నారు.

ఘనంగా ప్రారంభమైన గంగ నీళ్ల జాతర

నిర్మల్,వెలుగు: ఆడెల్లి మహా పోచమ్మ గంగ నీళ్ల జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు అమ్మవారిని ఊరేగింపుగా దిలావర్​పూర్​మండలం సాంగ్వి వద్ద గల గోదావరి నదికి తీసుకెళ్లే ఘట్టంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరుసటి రోజు ఉదయం అమ్మవారి ఆభరణాలను పోచమ్మ ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. జాతరకు నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఆదివారం జరిగే జాతరకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కానున్నారు.

సపాయిల కాళ్లు కడిగిన ఎంపీ

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: సపాయి కార్మికుల కారణంగానే కరోనాను జయించగలిగామని, కాలుష్య రహిత వాతావరణానికి పారిశుద్ధ్య కార్మికులే కారణమని ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ బర్త్​డే వేడుకల సందర్భంగా శనివారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​తో కలిసి స్థానిక పార్టీ ఆఫీస్​లో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానం చేశారు. నిత్యం ప్రజలకు సేవచేసే వారికి సముచిత గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి, ఆకుల ప్రవీణ్, జోగు రవి, సోమ రవి, వేద వ్యాస్​ పాల్గొన్నారు.

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

కాగజ్ నగర్,వెలుగు: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని శనివారం బాబాసాగర్​లో ఆదివాసీలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక మెయిన్​రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏజెన్సీలో పెసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 

రక్తదానం ప్రాణదానంతో సమానం

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: రక్తదానం ప్రాణదానంతో సమానమని.. ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయొచ్చని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. శనివారం పట్టణంలోని షాదీఖానాలో సేవా ఫౌండేషన్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,  టీఆర్ఎస్​పట్టణ అధ్యక్షుడు అజయ్, కో ఆప్షన్ సభ్యులు సత్యనారాయణ, ఎజాజ్, సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఖాజా సిరాజొద్దీన్, సభ్యులు ఇమ్రాన్ ఖాన్, రాజు యాదవ్, కిరణ్ కుమార్, తబ్రేజ్ ఖాన్, ఇస్లాం ఖాన్ పాల్గొన్నారు.

గోవుల రక్షణకు చర్యలు తీసుకోవాలె

భైంసా,వెలుగు: గోవుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్ కోరారు. శనివారం కుంటాల మండలం ఓలా గ్రామంలో గోమాత రక్షణపై రూపొందించిన ఆడియోను ఆయన రిలీజ్​చేశారు. గోవుల రక్షణకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలన్నారు. అంతకు ముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు సాధుప్రభాకర్, ఎంపీటీసీ కట్ట రవి, లీడర్లు సాయికుమార్​, తాటి శివ, జక్కుల గజేందర్, రాజన్న యాదవ్, శ్రీకాంత్, శ్రీకాంత్​ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుల హక్కులను రక్షించాలి

నిర్మల్/ఆసిఫాబాద్,వెలుగు: వృద్ధుల హక్కులు రక్షించాలని నిర్మల్​ కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ, ఆసిఫాబాద్​ అడిషనల్​ కలెక్టర్​ చాహత్​ బాజ్​పేయి కోరారు. శనివారం నిర్మల్​, కాగజ్​నగర్​లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. వృద్ధులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నిర్మల్​ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, ఎంసీ లింగన్న, చందులాల్ శ్రీవాత్సవ, హనుమంత్ రెడ్డి, నిర్మల్ సీడీపీవో నాగమణి,  సూపర్​ వైజర్​ విజయ గౌరీ తదితరులు పాల్గొన్నారు. కాగజ్​నగర్​లో వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఆరె కులస్తులను ఓబీసీలో చేర్చాలి

కాగజ్ నగర్/దహెగాం,వెలుగు: ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆరె సంక్షేమ సంఘం లీడర్లు కోరారు. శనివారం కౌటాల, దహెగాం తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ శివాజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆరె సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాను పటేల్, జిల్లా ప్రచార కార్యదర్శి బాజీ రావు, కౌటాల మండల అధ్యక్షుడు ధనుర్కార్ వసంత్ రావు, జనరల్​సెక్రటరీ ఆనంద్ రావు, దహెగాం మండల అధ్యక్షుడు తుమ్మిడి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కరి దామోదర్, మండల ప్రధాన కార్యదర్శి బుడిపెల్లి వెంకన్న, ఉషాన్ నానాజీ, ఎంపీటీసీ గౌరె రాకేశ్, సర్పంచ్ ఎల్కరి సంజీవ్ పాల్గొన్నారు.

అరుదైన రికార్డు సాధించిన నిర్మల్ స్టూడెంట్

నిర్మల్,వెలుగు: నిర్మల్​లోని  వెంకటాద్రి పేటకు చెందిన మున్సిపల్  కౌన్సిలర్ లక్కాకుల నరహరి కూతురు లక్కాకుల వినూష్ణ అరుదైన రికార్డు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్​ఫోర్త్​సెమిస్టర్​చదువుతున్న ఆమె కాలేజీ తరఫున సెర్బియా దేశంలో జరిగిన రాకెట్ ప్రయోగ పోటీకి హాజరై ప్రతిభ కబర్చి స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకున్నారు. ఆమె తోటి స్టూడెంట్స్ తో కలిసి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. విద్యార్థినికి స్థానికులు అభినందించారు.

సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ

ఆసిఫాబాద్,వెలుగు: ఆపదలో సీఎం రిలీఫ్​ఫండ్​ఎంతో మంది పేదలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు చెప్పారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​చిలువేరి వెంకన్న, నార్నూర్ ఎంపీటీసీ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు.

ఘనంగా అమ్మవారికి అన్న నైవేద్యం 

నిర్మల్,వెలుగు: దేవీ నవరాత్రులను పురస్కరించుకొని శనివారం స్థానిక నందిగుండం దుర్గామాత ఆలయంలో ఘనంగా అన్న నైవేద్యం సమర్పించారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు కొండాజీ వెంకటాచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, ఆలయ ధర్మకర్త ముత్యం సంతోష్ గుప్తా, పూదరి నరహరి, విలాస్, రాజన్న, ప్రభుమూర్తి, నవయుగమూర్తి, చారి, చంద్రయ్య పాల్గొన్నారు.

రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలి

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: హైదరాబాద్​ గోషామహాల్​ఎమ్మెల్యే రాజాసింగ్​ను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి డిమాండ్​చేశారు. శనివారం రాత్రి స్థానిక వినాయక్​ చౌక్​లో డైనమిక్​ యూత్​ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రాజాసింగ్​పై కేసు పెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో యూత్​అధ్యక్షుడు పద్మావార్ రాకేశ్, మనోజ్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలె

భైంసా,వెలుగు: కేజీబీవీ వర్కర్స్ ను పర్మినెంట్ చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎన్. దాసు డిమాండ్ చేశారు. శనివారం ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఎం.హరిత  అధ్యక్షతన  భైంసాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని  కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. గుర్తింపు కార్డులు అందజేయాలని కోరారు. ఏఎన్ఎంలకు నెలలో మూడు రోజులు నైట్  డ్యూటీలు రద్దుచేసి సీఆర్టీలతో సమానంగా డ్యూటీలు వేయాలన్నారు. పార్ట్ టైం వర్కర్స్ కు తగిన గుర్తింపు లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, కాలేజీలు అప్ గ్రేడ్ చేసి సిబ్బంది పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.రాజు, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు సునీత, గంగామణి,  భూలక్మి, కవిత, లక్ష్మి, పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
==============
ప్రజాసంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ పై కసరత్తు
నేడు బాసరలో సమావేశం
నిర్మల్,వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 15న భైంసా నుంచి ప్రారంభించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్​ కోసం బీజేపీ లీడర్లు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30 వరకు జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. భైంసాలో ప్రారంభమయ్యే యాత్ర నిర్మల్, ఖానాపూర్ మీదుగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్​వరకు సాగనుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్  రూపొందించేందుకు బీజేపీ స్టేట్​లీడర్లు ఆదివారం బాసరలో సమావేశం కానున్నారు. 

బొగ్గు ఉత్పత్తి టార్గెట్​ను చేరుకోవాలి

మందమర్రి/నస్పూర్​,వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం ఆయా ఏరియాలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి టార్గెట్​లను చేరుకోవడానికి అవసరమైన  ప్లానింగ్​తో  ముందకు సాగాలని సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్​(ఆపరేషన్స్​), ఎన్​. బలరాంనాయక్​(ఫైనాన్స్, పీపీ​), సత్యనారాయణ(ఈఎం) ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కు మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు చింతల శ్రీనివాస్, సంజీవరెడ్డి, దేవేందర్ హాజరయ్యారు. వినియోగదారులకు డిమాండ్ ప్రకారం బొగ్గు రవాణా చేయాలని ఆదేశించారు. ఏరియాల ఎస్​వోటు జీఎంలు కృష్ణారావు, త్యాగరాజు, ఏజెంట్ రాజేందర్, ఆర్కేపీ, కేకే, ఎస్సార్పీ, ఇందారం, ఖైరీగుడా ఓసీపీల పీవోలు రమేశ్, మధుసూదన్, పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్ రాందాస్, డీజీఎం ఐఈడీలు రాజన్న, చిరంజీవులు, ఉజ్వల్ కుమార్ బెహరా తదితరులు పాల్గొన్నారు.