హైడ్రా పేరుతో బెదిరింపులు

హైడ్రా పేరుతో బెదిరింపులు
  • రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌‌, అరెస్ట్ చేసిన పోలీసులు

రామచంద్రాపురం (అమీన్‌‌పూర్‌‌), వెలుగు : హైడ్రా పేరుతో బిల్డర్‌‌ను బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్‌‌ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్‌‌ గురువారం మీడియాకు వెల్లడిండారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా అమీన్‌‌పూర్‌‌ బీరంగూడ జయలక్ష్మీనగర్‌‌ కాలనీకి చెందిన జన్వాడె రవి సీబీఆర్‌‌ కాలనీలోని తన ప్లాట్‌‌లో నిర్మాణం ప్రారంభించాడు. 

రామచంద్రాపురం సాయినగర్‌‌ కాలనీకి చెందిన దగుడు రాము ఓ పత్రిక రిపోర్టర్‌‌గా చలామణి అవుతున్నాడు. రాము కొన్ని రోజులుగా రవి వద్దకు వెళ్తూ ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తున్నావని, తనకు హైడ్రా కమిషనర్‌‌ రంగనాథ్, ఆర్డీవో, తహసీల్దార్‌‌ తెలుసని, రూ. 5 లక్షలు ఇవ్వకపోతే తన పత్రికలో వార్త రాసి అక్రమ నిర్మాణమంటూ కూల్చివేయిస్తానని బెదిరిస్తున్నాడు. అలాగే తనకు పాతబస్తీకి చెందిన పహిల్వాన్లు తెలుసని

తాను అడిగినంత ఇవ్వకపోతే అంతు చూస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో రవి ఈ నెల 10న అమీన్‌‌పూర్‌‌ పోలీసులను కలిసి రాముపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం రాముని అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు. హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరిస్తే 87126 56777కు నేరుగా గానీ, వాట్సప్‌‌ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఇలా బెదిరించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.