‘అవినీతి’ అనే మాట ఓ తేలిక పదం అయిపోయింది. ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. పరిమితంగా ఏ కొద్ది మందో కాస్త ఆందోళన చెందినా, దట్టంగా అల్లుకుపోయిన దుర్వవస్థలో ఏమీ చేయలేని అశక్తులుగా మిగులుతున్నారు. నిఘా, నియంత్రణ, దర్యాప్తులు, ప్రత్యేక సంస్థలు, శిక్షలు వీటన్నిటి ప్రభావం తగ్గి, అవినీతి జోలికి వెళ్లొద్దనే రీతిలో చట్టమంటే భయపడే పరిస్థితులు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. కొన్ని గంటల, రోజుల వ్యవధిలో జరిగి, వెలుగు చూసి, మీడియా ఎత్తిచూపిన పలు అవినీతి వ్యవహారాలు కథల్లా ఆసక్తి కలిగిస్తున్నంతగా జనంలో ఆలోచన రేకెత్తించడం లేదు. ‘ఎక్కడ లేదు చెప్పండి అవినీతి? అంతటా ఉంది. అది కూడా ఒక సమస్యేనా! అదొక చర్చనీయాంశమా?’ అని పెదవి విరిచి, అల్కటి భావంతో కొట్టిపడేసే వాళ్లు ఎక్కువయ్యారు! అవినీతి మాత్రం క్యాన్సర్లా వ్యాపించి, మన వ్యవస్థల్ని ఎంతగా కుళ్లిపోయేటట్టు చేస్తోందో పౌరసమాజం తెలుసుకుంటలేదు. దానివల్ల ధనవంతులు మరింత సంపన్నులౌతుంటే, పేదలు కటిక దారిద్ర్యంలోకి జారిపోతున్నారు. ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా మళ్లీ పేద, మధ్యతరగతి సమాజమే ఆ మేర నష్టాల్ని చవిచూస్తోంది. అవినీతి వల్లే వారికి రాజ్యాంగం నీడలో, న్యాయబద్ధంగా రావాల్సిన వాటా దక్కటం లేదు.
ఒక కేసులో నోటీసులు ఇచ్చేందుకు, ఓ వ్యక్తి వద్ద 6 వేల రూపాయలు లంచం పుచ్చుకుంటూ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ తెలంగాణ అవినీతి నిరోధక బృందాని(ఏసీబీ)కి పట్టుబడటం నుంచి, బెంగాల్లో ఒక మంత్రి సన్నిహితురాలి ఇంట్లో యాబైకోట్ల రూపాయల నగదు, వందల కోట్ల సంపద దొరకడం వరకు! తెలంగాణలో లక్ష కోట్ల రూపాలయలు వెచ్చించి కడితే, వర్షాలు–వరదలతో గోదారి పాలైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర మంత్రే పేర్కొనడం నుంచి, మా కంపెనీ మాత్రనే రోగులకు రాయండంటూ ఒక మందుల కంపెనీ వెయ్యికోట్ల రూపాయలు విలువ చేసే బహుమతులు లంచంగా డాక్టర్లకివ్వడమేమిటని సుప్రీంకోర్టే ఆశ్చర్యపోవడం వరకు అవినీతి సర్వాంతర్యామి అయింది. ఇంత చేస్తే ఇదంతా అట్టడుగు దాకా వేర్లు విస్తరించిన ‘అవినీతి’ విశ్వరూపపు ఆనవాళ్లు పట్టిచ్చే మచ్చుతునక మాత్రమే! జాడ్యం లోతుగా ఉంది.
అడ్డుకునే వ్యవస్థల్లేవు
అవినీతి నిర్వచనం నుంచి దాని రకాల వరకు జనాల్లో అవగాహన లేదు. వ్యాప్తికి అదే బలమైన కారణం. ‘ఎవడో అవినీతి చేస్తే నాకేంటి?’ అనుకునే పట్టింపులేనితనం తప్పే! అవినీతి అంటే అక్రమంగా డబ్బు గడించడమొకటే అనుకుంటారు సామాన్యులు. ప్రైవేటు ప్రయోజనాలకు ప్రజా వ్యవస్థల్ని, వనరుల్ని, సంపదని, అధికారాన్ని, హోదాను ఏ రూపంలో వాడినా అవినీతే! నిజానికి పదవి, అధికారం, హోదాల నుంచి పుట్టే ఇలాంటి వృత్తిపరమైన అవినీతే కాక నైతికతపరమైన అవినీతీ ఉంటుంది. ఇవన్నీ సమాజమ్మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఎప్పుడో 1980 లలో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ, ‘జనం కోసం రూపాయి ఖర్చుపెడితే, 15 పైసలు మాత్రమే వారికి చేరుతోంది, 85 పైసలు దారి మళ్లి అవినీతిపరుల పాలవుతోంది’ అన్న నాటి నుంచి అవినీతి వేర్లు, ఊడలు విస్తరించి ఇంకా పెరిగిందే తప్ప తరగలేదు. పరిమిత యంత్రాంగం ఉన్న ఏసీబీకి లభించిన సమాచారం ఆధారంగానే, వారు ఒడుపుగా వల(ట్రాప్) పన్నితే నిన్నటికి నిన్న3 గంటల వ్యవధిలో నలుగురు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీకి అందే సమాచారమే అరకొర! అది కూడా రాజ్యాంగం ఆదేశించిందనో, సమాజహితంలోనో కన్నా సదరు అధికారి–బాధితుని మధ్య ఒక తప్పుడు వ్యవహారంలో డీల్ కుదరక జరిగే ఘర్షణ నుంచి వచ్చేదే! అలా పొక్కి కేసులయ్యేది పిసరంత. ట్రాప్ అయినా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అయినా దొరికినపుడే హడావుడి! తర్వాత, నిందితులు తమ పలుకుబడి ఉపయోగించో, ప్రభుత్వ జోక్యాలతోనో, ఏసీబీ యంత్రాంగానికి లంచాలిచ్చో కేసులు వీగిపోయేలా చేసుకునే సందర్భాలే ఎక్కువ! నిర్ణయాధికారం సర్కారుది కనుక, ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండేటట్టు చూసుకొని, చివరకు మధ్యేమార్గంగా న్యాయవిచారణ(ప్రాసిక్యూషన్) అక్కర్లేదు– శాఖాపరమైన దర్యాప్తు చాలనే ఉత్తర్వులు తెప్పించుకుంటారు. తర్వాతి కథ మామూలే! కాలాయాపనతో సాక్షాధారాలు బలహీనమౌతాయి. 2016 నుంచి నమోదైన 350 కేసుల్లో 65 శాతం కేసులకు సర్కారు నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి లభించలేదు. పౌర సమాజం ఎంతో పోరాడి సాధించుకున్నప్పటికీ, జాతీయ స్థాయిలో జనలోక్‌పాల్, రాష్ట్రస్థాయిలో లోకాయుక్త సంస్థలు అవినీతిని అరికట్టడంలో ఆశించినంత ప్రభావం చూపట్లేదు.
బలహీనపరిస్తే ఎలా?
పెట్టుబడుల వ్యాపార ప్రక్రియను సులభం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చేయడమనే లక్ష్యంతో ఇప్పుడున్న చట్టాలనో, నిఘానో, నియంత్రణనో, చివరకు శిక్షలనో సవరించి తేలిక చేస్తున్నారు. అడవి, పర్యావరణం నుంచి కార్మిక, విద్య–వైద్య సేవల హక్కుల రక్షణ వరకు వివిధ చట్టాల్ని ఏకపక్షంగా సవరించి, బలహీనపరుస్తున్నారు. ‘ఎవరో చెప్పారు చట్టాలు, మార్గదర్శకాలు ఇలా, ఇంత కఠినంగా, పెట్టుబడి పెట్టేవారిని బయపెట్టేలా ఉంటే ఎలా?’ అని ఓ సాకు చూపి సవరణలు తెస్తున్నారు. మారుతున్న పరిస్థితుల్లో ఆధునికీకరణ అనే మిషతో అవినీతి కట్టడి ప్రక్రియల్ని, ఉపకరణాల్ని, వ్యవస్థల్ని పలుచన చేస్తున్నారు. ఫలితంగా నిఘా, నియంత్రణ ఢీలా పడిపోతోంది. నియంత్రణ వ్యవస్థల్లో సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించకపోవడం, ఎప్పుడూ పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉంచడంతో ప్రభావం లేకుండా పోతోంది. పైగా, మన వ్యవస్థల్లో నియంత్రణను పాటించడం కన్నా, లంచాలిచ్చి నియంత్రించే వారి చేయి తడిపి, నోరు మూయడమే తేలిక,పైగా ఛౌక అనే భావన బయట బలంగా వ్యాప్తిలో ఉంది. పకడ్బందీ నిఘా, నియంత్రణ, పటిష్ట చట్టాలు రావాలి. వాటి అమలు సజావుగా ఉండాలి. న్యాయాధికారాలతో ఉండే లోక్‌పాల్, లోకాయుక్త వంటి సంస్థలు మరింత క్రియాశీలం కావాలి. వాటిని పౌరసమాజం ఉపయోగంలో పెట్టాలి. ‘ఆవులు పొలంలో మేస్తే దూడలు గట్టున మేయవు!’ కనుక పాలకులు, ముఖ్యంగా రాజకీయ అవినీతి ముందు కట్టడైతేనే అధికారిక, వృత్తుల్లో అవినీతి అరికట్టడం సాధ్యమౌతుంది. చివరగా మనమంతా కలిసి అవినీతిని అరికట్టకుంటే, దానికి నువ్వూ నేనూ బలి కావాల్సిందే!.
వైద్య వృత్తికే కళంకం!
జ్వరానికి డోలో–650 మాత్రల్నే రాయాలని డాక్టర్లను ప్రభావితం చేస్తూ, వారికి వెయ్యి కోట్ల రూపాయల మేర బహుమతులిచ్చారని పిటిషనర్ఇచ్చిన సమాచారం సుప్రీం ధర్మాసనాన్ని విస్మయానికి గురి చేసింది. కానీ, ఇదే రకంగా జరిగే ఎన్నో అన్యాయాలు వైద్య రంగంలో ఎప్పటి నుంచో వేళ్లూనుకొని ఉన్నాయి. గ్రామీణ–పట్టణ ప్రాంతాల నుంచి పేషెంట్లను పంపించే చిన్న డాక్టర్లకు నగరాల్లోని కార్పొరేట్ దవాఖానలిచ్చే తాయిలాలొక లంచం! అవసరం ఉన్నా, లేకున్నా ఇబ్బడిముబ్బడిగా రకరకాల టెస్టులు రాసే వైద్యులకు క్లినికల్– పాథాలజీ ల్యాబ్‌లు, డయాగ్నిస్టిక్ సెంటర్లిచ్చే నజరానాలు మరో లంచం! జనరల్, స్పెషలిస్ట్ వైద్యులకు ‘మా మందులు, పరికరాలే వాడండి–సిఫారసు చేయండ’ని ఫార్మసీలు, ఇతర కంపెనీలు స్పాన్సర్ చేసే వినోద–విహార యాత్రలు, హాలిడే–సమ్మర్ ట్రిప్‌లు మరో రకం లంచం! ఇదంతా ఓ పెద్ద దోపిడీ విషవలయం! సర్కారు వైద్యం దొరక్క అప్పో, సప్పో చేసి వచ్చే సామాన్య రోగులే ఇక్కడ సమిధలు. 2600 ఏండ్ల కింద డాక్టర్ హిప్పొక్రాట్ నిర్వచించి,‘ వైద్య ప్రమాణం’గా నిలిచిన నైతిక విలువల్ని అడుగడుగునా మంటగలు పుతున్నారు. వీటిని నియంత్రించే వ్యవస్థలన్నీ నిర్వీర్యమై ఉన్నాయి.
- దిలీప్ రెడ్డి.
dileepreddy.r@v6velugu.com