అవినీతి చేయడమూ.. ఓ కళే! : బూర నర్సయ్య గౌడ్

ఇందుకలడు, అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు అని గతంలో దేవుడి గురించి అనుకునేది, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతికి అది వర్తిస్తది. అధికారం అవినీతిపరుణ్ణి చేస్తుంది, సంపూర్ణ అధికారం అత్యంత అవినీతి పరుణ్ణి చేస్తుంది. ఇక జాతీయ పార్టీలు ఒక రాష్ట్రం కాకుంటే, ఇంకో రాష్ట్రంలో అధికారంలో ఉంటాయి కనుక, అవినీతి విషయంలో ఒక జాతీయత కాకుండా, వ్యక్తుల తప్పిదమే ఎక్కువ ఉంటది. కానీ ప్రాంతీయ కుటుంబ పార్టీలకు అధికారం అనేది ఒక ప్రాణ వాయువు లాగ ఉంటది కనుక, అధికారంలో ఉండటానికి ఎన్నికల్లో ఎన్ని కళలు అయినా ప్రదర్శిస్తారు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని ఓట్లు అడుక్కొని, ఒక్క ఛాన్స్ వస్తే వందేండ్లు, తర తరాలు వాళ్లే పాలించాలని, అది తమ జన్మ హక్కు అని భావించి ఎంతటి ఘోరాలు, నేరాలకు అయినా వెనుకాడరు.

ప్రధానంగా ‘ధనం మూలం ఇధం జగత్తు’ అని మనసా వాచా నమ్మి అమలు చేస్తారు. కుల బలం అతి తక్కువున్న  నాయకులు, పార్టీలు జనాన్ని నమ్మక, ధనాన్ని నమ్ముకుంటారు. వారే ఆర్ట్ అఫ్ కరప్షన్​లో పట్టభద్రులు, పీజీలు లేదా పీహెచ్డీలు చేస్తూ ఉంటారు. లేదా యూనివర్సిటీ స్థాపిస్తారు.

అవినీతికి 7 మార్గాలు

అవినీతి మార్గాలు – అధికారం, అది కూడా అపరిమితమైన అధికారం చేతుల్లో ఉంటే అవినీతికి ఆకాశం కూడా హద్దుకాదు. ఇక అవినీతి పోర్ట్​ఫోలియోను విశ్లేషిస్తే 7 గుడ్ విల్ అనే సప్త స్వాహా పోర్ట్ ఫోలియో ద్వారా అవినీతి మార్గాలు ఉంటవి. 1) కమిషన్ కిక్ బ్యాక్​– ఇది అతిపురాతనమైన పద్ధతి. ఒక ప్రాజెక్ట్ లేదా పని కావాలన్నా అందులో ప్రాజెక్ట్ వ్యాల్యూ బట్టి 1% నుంచి 30% వరకు తీసుకునే అవకాశం ఉంటది. ఉదాహరణకు, ఒక భారీ ప్రాజెక్టుకు లక్ష కోట్లు అయితే అందులో 10% అయినా కాలు మీద కాలు ఏసుకొని కూర్చున్నా 10,000 కోట్లు వస్తాయి. చాల సందర్భాలలో కమిషన్ ఎక్కువ కావలనప్పుడు అంచనా పెంచుతారు, గుత్తేదారుకు ఇబ్బంది కలగకుండా. సీసీ రోడ్డు, కాల్వలు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జిలు, ఆనకట్టలు, చెరువులు , రిజర్వాయర్లు, మిషన్లు, మందుల సేకరణ, ఇతర వస్తూ సేకరణ, ఇలా గుండు సూది నుంచి మెగా ప్రాజెక్టు వరకు కమిషన్ ఒక ప్రధాన మార్గం.

 2) పాలసీ మాయాజాలం – ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కేవలం ఒక జిఓ తో వేల కోట్లు సంపాదించొచ్చు. ఉదాహరణకు జీపీ లేఔట్ బాన్​తో పెద్ద కంపనీలకు లాభం, ధరణితో కరప్షన్ కేంద్రీకృతం, 111 జిఓతో వేల ఎకరాల హస్తగతం, మొదలే భూమి కొని తదుపరి అక్కడ ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయడం, ప్రైవేట్ సంస్థల్లో  ఫీజులు ఇష్టానుసారం పెంచే అవకాశం, తమ అనుబంధ కంపెనీలకు లాభాలు పెంచటానికి చేసే పాలసీలు(ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, ఎలైట్ వైన్ షాప్ పాలసీ, వైన్ షాప్స్ అప్లికేషన్స్ రుసుము పెంచే పాలసీ) తమ బంధువు లేదా బినామీ కంపెనీలకు లాభం చేకూరేలా పాలసీలు ఇలా ఎన్నో.  3) పర్మిషన్ పాలసీ మాయాజాలం – వ్యాపారం ఏర్పాటు, ల్యాండ్ కన్వర్షన్, జోన్ చేంజ్, బిల్డింగ్ పర్మిషన్, లే అవుట్ పర్మిషన్, రేగులరైజేషన్, లిటిగేషన్, సెటిల్మెంట్, ఫైర్, ఎన్​ఓసి, లీజ్ పర్మిషన్ బిల్ బోర్డ్స్ ఇలా ఎన్నెన్నో

4) పంచభూతాలు – భూమి – ఇసుక, మొరం, మట్టి, గ్రానైట్, సున్నం రాయి, బొగ్గు, ఇనుము, కంకర ఇలా ఎన్నో. నీరు – నీటి ప్రాజెక్టులు, తాగునీరు ప్రాజెక్టులు. అగ్ని – పవర్ మాయాజాలం. కొనుగోలులో అక్రమాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణం, సోలార్  ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు.  వాయు – విండ్ పవర్, ఆకాశం – విమాన రంగం, డ్రోన్స్, హెలికాప్టర్స్ తయారీలో పెట్టుబడులు ఇలా ఎన్నో. 5) వ్యాపారం – అక్రమంగా వచ్చిన సంపదను ఇంట్లో పెట్టుకోలేరు గనుక వివిధ సంస్థల్లో పెట్టుబడులు బినామీగా పెడతారు. అధికారంలో ఉంటారు కనుక ఇతరుల కంటే బాగా కలిసి వస్తాయి.

విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫార్మా, కాంట్రాక్టర్ర్, డీలర్షిప్, వైన్ & మైన్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ , రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్,  రైస్ మిల్స్ ఇలా కలసి వచ్చే ప్రతి వ్యాపారంలో పెట్టుబడులు ఉంటాయి. 6) బంధు ప్రీతి / వర్గ ప్రీతి – కీలక పోస్టుల్లో నియామకాలు, న్యాయమూర్తులు, కార్పొరేషన్స్, రాజకీయ పదవులు ఇలా ఆదాయ వనరులు ఉన్న ప్రతి స్థానంలో తమవాళ్లను నియమించుకుంటారు. అలానే కీలకపదవుల్లో ఉన్న తమవర్గానికి చెందిన వారిని పదవీ విరమణ తరువాత కూడా కొనసాగిస్తారు. 7) గుడ్ విల్ – అధికారంలో ఉన్నప్పుడు చాల మంది వ్యాపారాలు, రాజకీయ అవకాశాల కొరకు వెతికే వారు, నజరానాగా లేదా గుడ్ విల్ అనేక రూపాల్లో సమర్పించుకుంటారు.

తప్పించుకునే బినామీ మార్గాలు

ఇలా అవినీతి పరుడికి అధికారం అప్పగిస్తే అవినీతికి అంతు ఉండదు. ఇక చట్టం నుంచి తప్పించుకోవడానికి అనేక వినూత్న పద్ధతుల ఆవిష్కరణలతో ‘ఆర్ట్ అఫ్ కరప్షన్’  అనే  యూనివర్సిటీని స్థాపిస్తారు. వారు చేయడమే కాకుండా ఆ విద్యను ఇతర ప్రాంతాల రాజకీయ అవినీతిపరులకు బోధిస్తారు. వినూత్న పద్ధతులు 1) బోగస్ టెండర్ విధానం – పారదర్శకతను పాటిస్తున్నట్లు నటించి టెండర్లను తమ వారికే వచ్చేటట్లు నయాన్నో, భయాన్నో చేజిక్కించు కొంటారు.  2) సింగల్ విండో విధానం – ఒక ప్రభుత్వం - ఒక కాంట్రాక్ట్​ విధానంతో ముందుకు సాగుతారు. 3) హోల్ సేల్ కరప్షన్ – ఎక్కువ మంది లేకుండా, మొత్తం వ్యవహారం ఒకే ఏజెన్సీకి అప్పచెప్పుతారు.

 4) అవినీతి అధికారులకు అందలం – చాలావరకు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారులను కలెక్షన్ ఏజెంట్స్​గా మార్చుతారు. వారికి పదవీ విరమణ తర్వాత కూడా పదవులు ఇస్తారు. 5) బినామీ ఆస్తులు, పెట్టుబడులు, వ్యాపారం – మొత్తం ఒక అవినీతి సిండికేట్​గా ఏర్పడి నడుస్తున్న వ్యాపారాల్లో స్లీపింగ్ పార్ట్​నర్స్​గానే ఉంటారు. 6) స్లీపర్ సెల్స్ -– సన్నిహితులకు కూడా ఆర్థిక లావా దేవీలు తెల్వకుండా ఏర్పాటు చేసుకుంటారు. ఒక బ్యాక్ ఎండ్  ఆఫీసు (చార్టెడ్ అకౌంట్స్, అడ్వొకేట్, సిండికేట్ సభ్యులు) ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు.

గెలిపించామంటే..అజమాయిషీ ఇవ్వడమే 

తెలంగాణ రాష్ట్రంలో సంపద ఎంత? ఎంత అవినీతి చేయవచ్చు? తెలంగాణ జీడీపీ12 లక్షల కోట్లు, అంటే 5 ఏండ్లలో అది 60 లక్షల కోట్లు. అది కాకా ఏడాదికి సగటున 2 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 5 ఏండ్లలో 10 లక్షల కోట్లు, మొత్తం కలిపి70 లక్షల కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో  70 లక్షల కోట్ల సంపద ఎవరికి చెందాలో, పొందాలో, ఉపయోగించాలో నియంత్రణ చేసే అధికారం తెలంగాణ ప్రజలు ఓట్లతో  ముఖ్య మంత్రికి కట్టపెడతారు. ఉదాహరణకు ఒక లక్ష కోట్ల అవినీతి అంటే వారి దృష్టిలో 0.7% మాత్రమే. అందుకే అవినీతిపరులు దాన్ని హక్కుగా భావిస్తారు. అవినీతి చేయడం ఎలా? హత్య నిరూపించడానికి శవం, ఆయుధం, కారణం ఎలా అవసరమో, అవినీతి నిరూపింపబడటానికి  ఆస్తి, పద్దతి,  కారణం (మోటివ్) కూడా అవసరం.

అందుకొరకు తెలివైన రాజకీయ అవినీతి పరులు ‘సొమ్ము (ఆస్తి, భూమి, సంపద ఏ రూపంలో అయినా)’ తమ పేరుమీద లేకుండా జాగ్రత్త పడతారు (శవం దొరకకుండా). ఇక పద్ధతి పారదర్శకంగా కనిపియ్యడానికి, భీష్ముణ్ణి చంపటానికి, శికండిని ఉపయోగించినట్లు వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇక మోటివ్ (అసలు లక్ష్యం) తెలియకుండా  ప్రజాకర్ష అనే ముసుగును తెలివిగా వాడతారు. అదే కాకుండా అధికారంలో లేనప్పుడు అవినీతి, అవినీతి అనే అరిచేవారే, అధికారం వచ్చిన తర్వాత రాజకీయ అవినీతి హక్కుగా భావిస్తారు. ఒక రకంగా అవినీతి జబ్బుగా మారుతుంది. - డా.బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు