
ఇటీవలే హార్టికల్చర్ లో మొక్కల కుంభకోణం
శానిటేషన్ కార్మికుల పోస్టులనూ అమ్ముకున్నరు
తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో రోజురోజుకు కరప్షన్ పెరుగుతోంది. ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, అర్బన్ మలేరియా, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్.. ఇలా ప్రతి డిపార్ట్ మెంట్లలో రెగ్యులర్‍గా అవినీతి బయట పడుతోంది. గతంలో అవినీతి జరిగితే కమిషనర్‍తో పాటు 13 మందిపై చర్యలకు తీసుకున్నారు. అయినా కార్పొరేషన్ అధికారుల తీరు మారట్లేదు. గడిచిన మూడు నెలల్లో హార్టికల్చర్, శానిటేషన్ డిపార్టుమెంట్లో అవినీతిపై పెద్ద ఎత్తున దుమారం రేగగా.. బుధవారం రెవెన్యూ విభాగంలో ఏకంగా ఇద్దరు ఆఫీసర్లు లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు చిక్కారు. జీడబ్ల్యూఎంసీలో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయడంలో అటు పాలకవర్గం ఇటు కమిషనర్ ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
హార్టికల్చర్‍లో.. కోట్ల రూపాయల ఛీటింగ్
హరితహారం పేరుతో కార్పొరేషన్‍కు చెందిన హార్టికల్చర్ డిపార్టుమెంట్లో ఓ లేడీ ఆఫీసర్ దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. బల్దియా పరిధిలోని 66 డివిజన్లలో హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు, నర్సరీలు, ట్రీ గార్డులు, క్రీడా ప్రాంగణాలను అవసరానికి మించి చూపుతూ కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్లు తెలిసింది. పలు ఆధారాలతో దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో సదరు ఆఫీసర్ ఓ ప్రజాప్రతినిధి సాయంతో కార్పొరేషన్ నుంచి వేరే ప్రాంతానికి ఉద్యోగ బదిలీ చేయించుకున్నారు.
సఫాయి పోస్టులను అమ్ముకున్రు
గ్రేటర్ కార్పొరేషన్‍లో ఔట్‍సోర్సింగ్ పద్ధతిన రెండేండ్లుగా నియామకాలు చేపడుతున్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా మొత్తం 452 పోస్టులను ఎంపిక చేసేలా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. కార్పొరేటర్ నుంచి కాంట్రాక్టర్, మేయర్, మొదలు ఎమ్మెల్యే, మంత్రుల వరకు తమకు నచ్చినవారికి ఈ పోస్టులు కట్టబెట్టారు. ఇందుకోసం ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. కాగా, ఉద్యోగాలకుమించి ఎక్కువ మంది దగ్గర డబ్బులు వసూలు చేయడంతో అసలు విషయం బయటకు పొక్కింది. లక్షల రూపాయలు లంచం ఇచ్చి.. ఏడాదిన్నరగా రోడ్లు, మోరీలు క్లీన్ చేస్తున్న 52 మందిని ఆఫీసర్లు పక్కనపెట్టారు. దీంతో ఆధారాలతో సహా సఫాయి పోస్టుల దందా బయటపడింది. ఇందులో ఎమ్మెల్యేల హస్తం ఉందనే ఆడియోలు, ఇతర ఆధారాలను బాధితులు మీడియా ముందు ఉంచారు. ప్రతిపక్ష పార్టీలు సైతం సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు.
ఎన్ని కంప్లయింట్స్ వచ్చినా.. డోంట్ కేర్
గతేడాది మే నెలలో వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు స్వీకరించారు.కొద్దిరోజులకే కమిషనర్‍గా ప్రావీణ్య డ్యూటీలో చేరారు. గడిచిన 17 నెలల కాలంలో..అవినీతి, అక్రమాలపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. పాత ఇష్యూలపైనా కంప్లయింట్లు అందాయి. పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్లో సుమారు 150 మంది కార్మికులు ఏడాది నుంచి పని చేయకుండానే జీతాల రూపంలో రూ.2.16 కోట్ల అవినీతికి పాల్పడినా.. కమిషనర్, మేయర్ స్పందించలేదు. నాణ్యత లేని ఫాగింగ్ మెషిన్ల కొనుగోలు చేసినా, కాంట్రాక్టర్లు జనాల నుంచి డబ్బులు వసూలు చేసినా పట్టించుకోలేదనే అపవాదు ఉంది. ప్రభుత్వ పెద్దల జోక్యం వల్లే వారు స్పందించడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.
లంచంతో.. రెడ్ హ్యాండెడ్‍గా దొరికిన్రు..
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని కాశిబుగ్గ సర్కిల్ ఆఫీస్‍లో బుధవారం ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రబ్బాని, బిల్ కలెక్టర్ రంజిత్ ఇందులో ఉన్నారు. నిజాంపురకు చెందిన ఓ వ్యక్తి ఇంటి పర్మిషన్ కోసం అప్లై చేసుకోగా రూ.40 వేలు డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో రూ.15 వేలను బాధితుని నుంచి బల్దియా సిబ్బంది తీసుకుంటుండగా ఏసీబీ టీం వారిని అదుపులోకి తీసుకుంది.