వరంగల్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కబ్జాలు, అవినీతి సొమ్మును బయటకు తీసి ప్రజల కోసం ఖర్చు చేస్తామని రెవెన్యూ, పౌర సరఫరాల, సమాచార శాఖ, ఉమ్మడి వరంగల్ ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‍లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖతో కలిసి ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై పొంగులేటి రివ్యూ నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టులను రీడిజైన్ చేసిందన్నారు.
బీఆర్ఎస్ లీడర్లు 59 జీఓ అడ్డుపెట్టుకుని హైదరాబాద్, వరంగల్ వంటి అన్ని సిటీలు, పట్టణాల్లో ఎక్కడపడితే అక్కడ భూములు ఆక్రమించారని మండిపడ్డారు. అక్రమార్కుల నుంచి ఒక్క గజం స్థలాన్ని కూడా వదలబోమన్నారు. గత ప్రభుత్వం వరంగల్ మాస్టర్ ప్లాన్‍ను తమకు అనుకూలంగా తయారు చేసుకుందని, దానిని ప్రజాభీష్టం మేరకు మార్చుతామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను ఉండడానికి వేల కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్నారు తప్పితే.. కాళోజీ కళాక్షేత్రం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ ప్రపంచానికి రోల్ మోడల్ అని చెప్పుకున్నారని.. తీరా చూస్తే పనులన్నీ మధ్యలో ఆపారన్నారు.
తాము చేపట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఏ ఒక్క జిల్లాలోనూ కాలువలు సైతం సరిగ్గా లేవన్నారు. వివిధ శాఖల్లో ఇప్పటికే వేలాది కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం తమ నెత్తిన రూ.7 లక్షల కోట్ల అప్పు పెట్టిందని మండిపడ్డారు. ప్రజాపాలనలో కోటి 35 లక్షల అప్లికేషన్లు రాగా కంప్యూటరీకరణ పూర్తవుతోందని.. ప్రజలు మెచ్చే పాలన అందిస్తామని పేర్కొన్నారు.
ఆలోచన లేకుండా 24 అంతస్తుల హాస్పిటల్
కేసీఆర్ తన స్వార్థం కోసమే వరంగల్ సెంట్రల్ జైల్‍ను కూలగొట్టి ఆ స్థలంలో 24 అంతస్తుల హాస్పిటల్ కడుతున్నారని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భూములు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పుతో కడుతున్నారని, భవిష్యత్తులో ఖర్చు ఎలా భరిస్తారో అన్న ఆలోచన లేకుండా నిర్మాణం చేపడుతున్నారని విమర్శించారు. కొత్త హాస్పిటల్ పేరుతో ఎంజీఎం ఆసుపత్రిని ఆగం చేశారన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వరంగల్ నియోజకవర్గంలో రూ.300 కోట్ల చొప్పున పనులకు ఉత్తుత్తి శిలాఫలకాలు వేశారన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.