- ఆర్వోఇంట్లో కోట్ల నగదు స్వాధీనం..
- బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసేందుకు ఏసీబీ ప్రయత్నం
- కార్పొరేషన్ ఆర్వోగా నసీర్.. ఆరు నెలల తర్వాత చార్జ్ దక్కిన వైనం
నిజామాబాద్, వెలుగు: పాతికేళ్ల నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ లో పాతుకుపోయిన ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్వో) దాసరి నరేందర్ సాగించిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడికి పై స్థాయి అధికారులు అందించిన సహకారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నగర కార్పొరేషన్‌కు ఆర్వోగా నసీర్ ఆరు నెలల కిందే కామారెడ్డి నుంచి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చినా ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఆర్వోగా వ్యవహరిస్తున్న నరేందర్‌నే సదరు పోస్టులో కొనసాగించడానికి పైఆఫీసర్లు మొగ్గుచూశారు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరేందర్ జైలుకు వెళ్లాక సోమవారం నసీర్‌కు ఆర్వో బాధ్యతలను అప్పగించారు.
కార్పొరేషన్ ఇన్‌కం దెబ్బతీసి
నగరంలోని నరేందర్ ఇంట్లో ఈ నెల 9 న ఏసీబీ నిర్వహించిన రైడ్‌లో రూ.2.93 కోట్ల నెట్‌క్యాష్, 51 తులాల బంగారం, తల్లి నర్సుబాయి, భార్య కిరణ్మయి పేరిట బ్యాంకు అకౌంట్లో రూ.1.10 కోట్ల బ్యాలెన్స్, 17 రకాల స్థిరాస్తి పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూను పరిగణలోకి తీసుకొని స్థిరాస్తుల విలువను ఏసీబీ ఆఫీసర్లు రూ.1.98 కోట్లుగా లెక్కించారు. కానీ మార్కెట్లో వాటి విలువ సుమారు రూ.20 కోట్ల దాకా ఉంటుంది. బినామీల పేరుతో నరేందర్ ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు.
ఒక ప్రైవేట్విద్యాసంస్థ, మరో ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహణలో ఆయన పెట్టుబడులు రూ. కోట్లలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ స్థాయిలో వసూళ్లకు ఏయే అంశాలు దోహదపడ్డాయనే విషయంలో నగరంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సిటీలోని కమర్షియల్ బిల్డింగ్స్‌ను రెసిడెన్షియల్ ఇండ్లుగా రికార్డులో నమోదు చేసి భారీగా లాభం పొందినట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణాల పర్మిషన్లకు రూ.2 లక్షలు, కమర్షియల్ బిల్డింగ్స్‌కు అంతకు డబుల్, ప్రతి మ్యూటేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.లక్ష తీసుకునేవారని చెబుతున్నారు.
తైబజార్ వేలం ఎప్పుడు జరిగినా వ్యక్తుల మధ్య సిండికేట్ కుదుర్చడంలో కీ రోల్ పోషించేవారు. గవర్నమెంట్‌కు డబ్బుకడితే ఏమొస్తది? తలా ఇంత లాభపడదామని ఓపెన్‌గా చెప్పిన ఆధారాలు ఏసీబీ సంపాదించింది. అన్‌అసెస్డ్, అండర్అసెస్డ్ బిల్డింగ్స్నుంచి భారీ వసూళ్లు ఉండేవి. కార్పొరేషన్ ఇన్‌కంను దెబ్బతీసిన ఈ నష్టాన్ని లెక్కించే పనిలో ఆఫీసర్లు తలమునకలయ్యారు.
సబ్ రిజిస్ట్రార్ అండతో
కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది శివారు గ్రామ పంచాయతీలను 2018లో కార్పొరేషన్లో విలీనం చేశాక సూపరింటెండెంట్ హోదాలోని నరేందర్ఇన్ఛార్జ్ఆర్వో బాధ్యతలు చేపట్టారు. ఈ విలీన గ్రామాలన్నీ నగరంలోనే ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్లు లేని ఇండ్లకు రికార్డులు సృష్టించి వాటి అమ్మకాలు జరిగేలా ఓ సబ్ రిజిస్ట్రార్సహకారంతో ఒక్కో కేసు నుంచి రూ.5 లక్షలకు తక్కువ కాకుండా రూ.కోట్లు ఆర్జించినట్లు సమాచారం.
ఓనర్‌కు పంపాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ నోటీసులను తనకు అనుకూలమైన వ్యక్తుల పేర్లపై పంపి సెటిల్మెంట్కు పురమాయించేవారు. ఈ రకంగా ఓ డాక్టర్ నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని ఏసీబీ ఆఫీసర్లు సేకరించారు. రిమాండ్‌లో ఉన్న నరేందర్‌ను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవడానికి ఏసీబీ అధికారులు రెడీ అయ్యారు. ఈలోపు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.