వడ్ల వేలంలో.. రూ.4 వేల కోట్ల అవినీతి : ధర్మపురి అర్వింద్

మోర్తాడ్, వెలుగు: వడ్ల అమ్మకానికి నిర్వహించే వేలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌‌గల్‌‌ మండలంలోని లింగాపూర్‌‌‌‌లో శనివారం శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బైక్ ర్యాలీలో కర్నాటక ఎమ్మెల్యే శశికళ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. 

ప్రతి 25 లక్షల టన్నుల వడ్ల అమ్మకంలో రూ.1,000 కోట్ల అవినీతి జరుగుతోందని, ఈ విక్రయాల ద్వారా మొత్తం రూ.4 వేల కోట్లు దోచుకునేందుకు బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్‌‌‌‌ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ 4 వేల కోట్లలో ఒక్కో నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్‌‌‌‌ చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు ఓటమి తప్పదన్నారు. 

బీజేపీ 70 స్థానాల్లో wగెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతిలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మాల్కాన్ గారి మోహన్, మండల అధ్యక్షుడు మహిపాల్, పట్టణ అధ్యక్షుడు యోగేశ్వర నర్సయ్య, నియోజకవర్గం బీజెవైఎం అధ్యక్షుడు కనికరం మధు తదితరులు పాల్గొన్నారు.