
దుబ్బాక, వెలుగు: దుబ్బాక ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అవినీతి పరులను వెనుకేసుకొస్తున్నాడని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన దుబ్బాకలో మీడియాతో మాట్లాడారు. సహకార సంఘం చైర్మన్ దాదాపు రూ.కోటి అవినీతి చేశారని ఆరోపించారు. రైతుల సొమ్మును స్వాహా చేసి ఏడాది గడుస్తున్నా నేటికీ రికవరీ చేయలేదన్నారు.
ఎమ్మెల్యే అండతోనే చైర్మన్ అవినీతి చేశారన్నారు. అన్నిశాఖల్లో చేసిన అవినీతి చిట్టాను కాంగ్రెస్ప్రభుత్వం త్వరలోనే బయటపెడుతుందని చెప్పారు. అవినీతి, అక్రమాలకు దుబ్బాక అడ్డాగా మారిందని, ఇక నుంచి జరగనివ్వబోమని తెలిపారు. ఆయనతో నాయకులు అనంతుల శ్రీనివాస్, ఏసురెడ్డి, కొంగరి రవి, గాంధారి నరేందర్ రెడ్డి, ఇస్తారిగల్ల మల్లేశం, అక్కం స్వామి తదితరులు పాల్గొన్నారు.