‘కంటి వెలుగు’ ఖర్చు కాంట్రాక్టర్లు, సర్పంచ్‌‌‌‌‌‌‌‌లపైనే!

ఖమ్మం, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో సర్పంచులు, కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. రోజుకు రూ.1,500 ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఖర్చులు మీరే పెట్టుకోవాలంటూ గ్రామాల్లో సర్పంచులకు అధికారులు ఆర్డర్​ వేస్తుండగా, మున్సిపాలిటీల్లో మాత్రం కాంట్రాక్టర్ల నెత్తిన భారం మోపుతున్నారు. ముందు ఖర్చు చేసి, తర్వాత బిల్లులు పెట్టుకోవాలంటూ సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే పెట్టిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు రాక, 9 నెలల నుంచి 15వ ఫైనాన్స్ నిధులు పూర్తి స్థాయిలో రాక కష్టాలు పడుతుంటే.. మళ్లీ ఈ తిప్పలేంటంటూ సర్పంచులు వాపోతున్నారు. ఇక మున్సిపాలిటీల్లో ఏఈలు, డీఈలు రోజుకో కాంట్రాక్టర్​కు ఫోన్​ చేసి ఇవాళ్టి ఖర్చులు మీరే పెట్టుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లతోనే టెంట్లు వేయించడం, టిఫిన్లు, మధ్యాహ్న భోజన ఖర్చులు పెట్టిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. 

గ్రామాల్లో సర్పంచులపై..

జిల్లాలో 55 టీమ్​లను ఏర్పాటు చేసి, 100 రోజుల పాటు కంటి వెలుగును నిర్వహించాలని ఆఫీసర్లు ప్లాన్​ చేశారు. 589 గ్రామ పంచాయతీలు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని 125 ప్రాంతాల్లో 714 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కనీసం 10 నుంచి 13 రోజుల పాటు శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, రైతు వేదికల్లో ఈ ప్రోగ్రామ్​లు నిర్వహిస్తున్నా, ప్రతి చోట టెంట్, సిబ్బందికి టిఫిన్లు, భోజనాల ఖర్చు ఉంటోంది. 15 నుంచి 20 మంది సిబ్బందికి టిఫిన్లు, భోజనాలు, ఇతర ఖర్చులు కలిపి యావరేజీగా రోజుకు రూ.3 వేల వరకు ఖర్చు వస్తుందని అంటున్నారు. కనీసం ఒక సర్పంచ్​ రూ.30 వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. వీటిని పంచాయతీ నిధుల నుంచి అడ్జస్ట్ చేసుకోవాలని ఆఫీసర్లు చెబుతున్నారని, రెగ్యులర్​ ఫండ్స్​ రాక మల్టీపర్పస్​ వర్కర్లకు సకాలంలో శాలరీలు ఇవ్వలేక ఇబ్బంది పడుతుంటే మళ్లీ ఇదేం బాదుడు అంటూ వాపోతున్నారు. 

బిల్లులు ఆపుతారనే భయంతో..

మున్సిపాలిటీల్లో చోటా, మోటా కాంట్రాక్టర్ల బాధ మరోలా ఉంది. ప్రతి రోజూ తమలో ఎవరికో ఒకరికి ఆఫీసర్లు ఫోన్​ చేసి ఇవాళ్టి ఖర్చులు పెట్టుకోవాలంటూ ఆర్డర్లు వేస్తున్నారని, కాదంటే ఎక్కడ బిల్లుల మంజూరీలో ఇబ్బంది పెడుతారోనన్న భయంతో తప్పడం లేదని అంటున్నారు. ఈ ఖర్చులను కూడా తర్వాత ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామంటూ ఆఫీసర్లు నోటి మాటగా చెబుతున్నారు తప్ప, అవి నిజంగా వస్తాయన్న నమ్మకం లేదని వాపోతున్నారు. ఒక్కో కాంట్రాక్టర్​ కనీసం రూ.10 వేల వరకు ఖర్చుపెట్టుకుంటున్నట్టు సమాచారం. అయితే గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు రోజుకు రూ.1500 చొప్పున ప్రభుత్వం నిధులను తర్వాత విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతకు రెట్టింపు ఖర్చు అవుతుండడం ఇబ్బంది అయితే, కాంట్రాక్టర్లతో పెట్టించిన ఖర్చులు మాత్రం వారికి తిరిగి ఇవ్వడం ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే.  

రూ.35 వేలు ఖర్చు పెట్టిన

మా ఊర్లో 10 రోజుల పాటు కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. భోజనాలు, టిఫిన్లు, టీలు, టెంట్ల ఖర్చు నేనే పెట్టాను. టెంట్లకు రూ.5 వేలు కలిపి రూ.35 వేలు ఖర్చు చేశాను. బిల్లులు పెట్టుకోండి, తర్వాత వస్తాయని అధికారులు అంటున్నారు, తప్ప క్లారిటీ లేదు.

- బట్టా పెద భద్రయ్య, సర్పంచ్, తాటిపూడి