రాజకీయపార్టీలు ఎటువంటి పథకాలు చెపితే ఓట్లు రాలుతాయని పరిశోధనలు చేసి అలాంటి పథకాలు తమ మేనిఫెస్టోలో చేరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను చూస్తే ఓటర్లను దృష్టిలో ఉంచుకొని విచ్చలవిడిగా డబ్బు వెదజల్లేలా ఉన్నాయే కానీ అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని చెప్పిన కార్యక్రమాలు చాలా తక్కువ. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల ఖర్చు రాష్ట్ర బడ్జెట్ కు రెండింతలు ఉంటుంది. ప్రజల పన్నులతో ప్రభుత్వం నడుస్తుంది. ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలకు అయ్యే ఖర్చు ప్రజలు పన్నుల రూపేణా కట్టిన డబ్బే. అంటే అది ప్రజల డబ్బు, అటువంటప్పుడు తమకు ఏమి కావాలో ప్రజలే చెప్పాలి. కానీ, రాజకీయ పార్టీలు ఆఫీసుల్లో కూర్చొని ఓటరును దృష్టిలో పెట్టుకొని పథకాలు ప్రకటించడం సరియైనది కాదు. అదీకాక ఏ రాజకీయపార్టీ కూడా తమ జేబులో నుంచి, పార్టీ డబ్బు నుంచి పైసా ఇవ్వదు. మన డబ్బును దేని దేనికి ఖర్చు చేయాలనేది మనమే చెప్పాలి. మధ్యలో రాజకీయపార్టీల పెత్తనం ఏమిటి ? ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఉంది.
రాష్ట్ర జనాభాలో సుమారు 20శాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. వీరిని అన్ని విధాల ఆదుకోవలసిన అవసరముంది. అలాగే విద్య, వైద్య రంగంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. ఈ రెండు రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు ముఖ్యంగా పేదలకు ప్రమాణాలతో కూడిన విద్య, అలాగే నాణ్యమైన వైద్యం అందించవలసిన ఆవశ్యకత ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో విద్య, వైద్యం, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలకు 50శాతం బడ్జెట్ కేటాయించాలి.
అప్పుల్లో కూరుకుపోతున్న తెలంగాణ
రాజ్యాంగ సవరణ 73, 74 ద్వారా గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలను పార్లమెంటు, శాసనసభ వలే రాజ్యాంగ సంస్థలుగా చేస్తూ వాటికి తగిన అధికారాలు, నిధులు ఇచ్చేవిధంగా నిర్ణయం జరిగింది. ఇందుకు కేంద్రం మాదిరిగా రాష్ట్రంలో ఆర్థికసంఘం ఉండాలని వారు పంచాయతీ, మునిసిపాలిటీల అవసరాలను గుర్తించి రాష్ట్ర బడ్జెట్ నుంచి తగిన నిధులు క్రమం తప్పకుండా విడుదల చేయాలని చట్టం చెపుతున్నా ప్రస్తుతం అలా జరగడం లేదు. గ్రామపంచాయతీలకు, మునిసిపాలిటీలకు తగిన విధులు, నిధులు ఇచ్చి వాటిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోతున్నది. నిధుల కోసం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై అత్యధికంగా పన్నులు వేసింది. ఇది రాష్ట్రంలో ధరలు పెరుగుదలకు కారణమవుతోంది. పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించాలి. ప్రభుత్వ పనితీరు, పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలి.
ప్రభుత్వ జీవోలు, అలాగే ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ప్రజలకు తెలపాలి. వివేకవంతమైన ప్రజానీకం ప్రజాస్వామ్యానికి వెన్నెముక అంటారు. ప్రతి కార్యాలయంలో ముఖ్యంగా, ప్రజలకు ఎక్కువగా అవసరపడే, రెవెన్యూ, మునిసిపల్ శాఖల్లో ఏ పని కూడా లంచం ఇవ్వనిదే పని కావడం లేదు. ఒక పౌరుడు తనకు ఒక హక్కుగా పొందవలసిన చిన్న సర్టిఫికెట్‌కు కూడా లంచం ఇవ్వవలసి వస్తుంది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టు పనుల్లో రాజకీయ నాయకులు, అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. దీనితో ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోవడం, పనిలో నాణ్యత లోపించడం వంటివి జరుగుతున్నాయి. ఇక విద్యాశాఖ, వైద్య శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉండడంతో విద్య, వైద్యసేవలపై దీని ప్రభావం పడుతోంది. ఆయా శాఖల్లో ఖాళీలు అన్నీ భర్తీ చేయాలి. పేద ప్రజలకు సర్కారు బడులు, ఆసుపత్రులపై నమ్మకం లేక ప్రైవేట్ బడులు, ఆసుపత్రులపై మొగ్గు చూపుతున్నారు.
పోలీసుశాఖపై నేతల పెత్తనం
ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగా శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రతి ఏటా తమ ఆస్తి వివరాలు శాసన సభాపతికి అందజేయాలి. ఆయన దానిని అసెంబ్లీలో ఉంచాలి. రాష్ట్రంలో పోలీసు శాఖ పని తీరు సరిగాలేదు, కొందరు సచ్చీలురు, నీతిమంతులను పక్కన పెడితే చాలామంది అవినీతిపరులే ఉన్నారు. పోలీసుశాఖలో సామాన్యులపై వేధింపులు అధికంగా ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులు అన్నదానిని పక్కన పెట్టి, అధికార పార్టీవారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. కింది స్థాయిలో పోలీసుశాఖపై శాసనసభ్యుని పెత్తనం పెరిగిపోయింది. ఒక ఇన్స్పెక్టర్ ట్రాన్స్‌ఫర్ కావాలంటే శాసనసభ్యుని అనుమతి కావాలి. అలాగే పై స్థాయిలో మంచి జాగాలో పోస్టింగు, పదవీ విరమణ తరువాత అడ్వైజర్‌గా లేదా ఏదో విధంగా ఒక పదవి దక్కడానికి ఉన్నతస్థాయి ఉద్యోగులు రాజకీయ నాయకులకు బందీ అవుతున్నారు.
దీనిపై సుప్రీంకోర్టు కొన్ని సూచనలు, సలహాలు చేసింది. అందులో ముఖ్యంగా రాష్ట్ర భద్రతా కమిషన్. దీంతో పోలీసుశాఖపై రాజకీయ ఒత్తిడి తగ్గించడం, అలాగే సరియైన మార్గదర్శకాలు ఇవ్వడం ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది పోలీసుశాఖపై విచారణ సంస్థ నియామకం. పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులను వీరు త్వరితగతిన విచారించి ఆరోపణలున్న పోలీసులపై తగిన చర్యలకు సిఫారసు చేస్తారు. ఈ రెండు సంస్థలు ఏర్పాటు చేస్తే పోలీసుశాఖలో అవినీతి తగ్గి సామాన్యులకు న్యాయం జరుగుతుంది. పాలనలో రాజకీయ నాయకుల అవినీతికి అడ్డు, అదుపు లేకుండా పోతుంది. వీరిని అదుపులో ఉంచడానికి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్టు ఒక పటిష్ట లోకాయుక్త చట్టం ఉన్నట్టయితే రాజకీయ నాయకుల అవినీతి తగ్గుతుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిపై అభియోగాలు రాగా లోకాయుక్త విచారణ జరిపి ముఖ్యమంత్రి దోషి అని తేల్చింది. దాంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.
ప్రాజెక్టుల నిర్మాణాలు, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై దర్యాప్తు జరపాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత లక్షల కోట్లు ఖర్చుచేసి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అధికార పార్టీ వారు ఈ ప్రాజెక్టులు తెలంగాణకు వరదాయిని అంటే, ప్రతిపక్షాలు ఈ పనిలో నాణ్యత లోపించిందని పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో జనాలలో అనుమానాలు ఏర్పడుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ వేసి ప్రజలకు కలిగిన అనుమానాలు దూరం చేయవలసిన అవసరం ఉంది. అలాగే విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్భయినా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్‌శాఖపై విచారణ జరిపించాలి.
మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదు
తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తమై చాలామంది పేదలు వలస వెళుతున్నారు. కొందరు బాగానే ఉన్నా ఇంకా కొందరు దళారుల చేతిలో మోసపోయి జైళ్ల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో గల్ఫ్ కార్మికుడు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఈ సమస్యను అధిగమించడానికి కేరళ రాష్ట్రం మాదిరిగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రాజకీయ పార్టీలు పోటా పోటీగా విడుదల చేసే మేనిఫెస్టోలకు ఎటువంటి చట్టబద్ధత లేదు.
ఇవి ఒక చిత్తు కాగితంతో సమానం. రాష్ట్రంలో జిల్లా జిల్లాకు సమస్యలు వేరువేరుగా ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని సమస్యలకు పరిష్కారం కనుగొనక రాజకీయపార్టీలు ప్రజలకు డబ్బును వెదజల్లుతూ వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటరు తన ఓటు వేసేటప్పుడు రాజకీయపార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోను పక్కన పెట్టి మంచివారికి, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన పనులు చేయించే వ్యక్తికే ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో యువత చొరవ చూపి ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం మద్యపానానికి ప్రోత్సాహం ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆబ్కారీ ఆదాయం ఎనిమిది వేల కోట్లయితే నేడు అది ఐదు రెట్లు పెరిగి 40 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పుడు గ్రామ గ్రామాన రెండు మూడు బెల్టుషాపుల ద్వారా మద్యం విచ్చల విడిగా అమ్మకం జరుపుతున్నారు. గత పది ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రంగా మారింది. ప్రస్తుతం మద్యంపై వచ్చే ఆదాయం ఆగిపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితిలో లేదు.
ఒక్క మద్యమే కాక గ్రామాల్లో యువకులు గంజాయికి కూడా అలవాటు పడుతున్నారు. మద్యాన్ని దశల వారీగా తగ్గించడం, అలాగే మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరమెంతైనా ఉంది. భారతదేశంలో ఎన్నికలపై ఖర్చుచేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఆ నియోజ కవర్గాన్ని బట్టి 25 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ప్రజాసేవ కోసం ఇంతగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
ALSO READ : నాన్చి.. నాన్చి ఎటూ తేల్చలే ! .. ఏండ్లుగా కొత్త రేషన్ కార్డులు పెండింగ్
ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే పెట్టిన ఖర్చుకు పదింతలు సంపాదిస్తున్నారు. ఐదు ఏండ్లలోనే వందల కోట్ల రూపాయలకు అధిపతి అవు తున్నారు. రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేసే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడంతో నేరచరిత్రులు, కోటీశ్వరులు మాత్రమే ఎన్నికల బరిలోకి వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో 30శాతం మంది సభ్యులు నేర చరిత్ర కలవారే. రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్నవారికి టికెట్టు ఇవ్వకూడదు.
- యం. పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్