ముసురుతో ‘పత్తి’కి జీవం .. సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు 

  • విత్తనాలకే రెండుసార్లు పెట్టుబడి
  • జిల్లాలో 1.01 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

యాదాద్రి, వెలుగు : అల్పపీడనం కారణంగా యాదాద్రి జిల్లాలో కురుస్తున్న ముసురుతో పత్తి పంటకు జీవం పోసినట్లయింది. జిల్లాలో భారీ వానలు కాకుండా ముసురు కురిసి రైతులకు మేలు చేసింది. వానలు కురవక ఎండిపోయే స్థితికి చేరుకున్న పత్తి సహా ఇతర ఆరుతడి పంటలకు ముసురు జీవం పోసింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. గండం తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

వానలు పడక రెండుమార్లు విత్తనాలు..

యాదాద్రి జిల్లాలో ఈ సీజన్​లో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​అంచనా వేసింది. అయితే వానలు సరిగా కురవకపోవడంతో చివరకు 1.01 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. కందులు 3,162 ఎకరాల్లో, పెసర్లు 75, ఉలవలు 12, వేరుశనగ 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. విత్తనాలు విత్తిన తర్వాత ఈ సీజన్​లో ఒక్క భారీ వాన కూడా పడలేదు. దీంతో కొందరు రైతులు రెండుమార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. జూలైలో కురిసిన ముసురు కారణంగా ఆరుతడి పంటలకు కొంత మేలు జరిగింది. ఆ తర్వాత మళ్లీ వానలు పడలేదు. దీంతో పత్తి సహా ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతుల్లో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా..? అన్న  ఆందోళన మొదలైంది. 

ఐదు రోజుల ముసురు..

తాజాగా అల్ప పీడనం వల్ల భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సూర్యాపేట సహా ఇతర ప్రాంతాల్లో భారీ వానలు కురిశాయి. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. జనజీవనం స్థంభించిపోయింది. కానీ యాదాద్రి జిల్లాలో మాత్రం గడిచిన ఐదు రోజులు ముసురు కురిసింది. ఎండిపోయే స్థితిని చేరుకున్న పంటలను చూస్తూ రైతులు చినుకు కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో కురిసిన ముసురే పత్తి సహా ఆరుతడి పంటలకు జీవం పోసింది. యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేసినట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొందవచ్చని అగ్రికల్చర్​ఆఫీసర్లు చెబుతున్నారు. 

పోచంపల్లిలోనే ఎక్కువ..

ఈ సీజన్​లో యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో పోచంలపల్లిలోనే ఎక్కువగా 661 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వలిగొండలో 612, అడ్డగూడూరులో 599, భువనగిరిలో 587 మిల్లీ మీటర్లు నమోదైంది. అతితక్కువగా నారాయణపురం, గుండాల, చౌటుప్పల్ మండలాల్లో 384 నుంచి 406 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.