కామారెడ్డి, వెలుగు: యాసంగిలో పత్తి సాగుకు కసరత్తు జరుగుతోంది. ప్రయోగాత్మకంగా ఈసారి రాష్ట్రంలోని విత్తన క్షేత్రాల్లో 200 ఎకరాల్లో పత్తి వేయాలని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయా జిల్లాల విత్తన క్షేత్ర ఆఫీసర్లు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లకు సూచనలు చేశారు. క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసి వాటిని రైతులకు డెమోగా ప్రదర్శించడంతో పాటు దిగుబడులు ఏ మేర వస్తాయనేది పరిశీలిస్తారు. వచ్చిన ఫలితాలను బట్టి వచ్చే సారి ఆయా జిల్లాల్లో యాసంగిలో రైతులు పత్తి సాగు చేసుకునేలా ప్రోత్సహిస్తారు.
కామారెడ్డి జిల్లాలో 110 ఎకరాలు...
పత్తి సాగు ప్రధానంగా వానకాలంలోనే సాగు చేస్తారు. యాసంగిలో వరి, ఇతర పంటలకు బదులుగా పత్తి సాగు చేయించే దిశగా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ కసరత్తు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో యాసంగిలో కొందరు రైతులు పత్తి సాగు చేసి ఎకరాకు 10 క్వింటాళ్లకు పైగా దిగుబడులు సాధిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడి రైతులు సాగు చేసినట్లుగా మిగతా ఏరియాల్లో కూడా యాసంగిలో పత్తి సాగు చేయించేలా ప్లాన్ చేయాలని సంబంధిత శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇటీవల ఆయా జిల్లాల అగ్రికల్చర్ ఆఫీసర్లతో జరిగిన మీటింగ్‌లో పత్తి సాగుపై చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో గవర్నమెంట్‌కు సంబంధించి 10 విత్తన క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని క్షేత్రాల్లో పత్తి సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 200 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసి దిగుబడి, సాగు పరిస్థితులపై తదితర ఆంశాలపై పరిశీలన చేస్తారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లిలో 60 ఎకరాలు, నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెద విత్తన క్షేత్రంలో 50 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లా దిండి విత్తన క్షేత్రంతో పాటు మరో చోట 90 ఎకరాల్లో చేయనున్నారు. జనవరి నేలలో విత్తనాలు వేయనున్నారు.
దిగుబడులు బాగా వస్తే...
యాసంగిలో పత్తి పంట సాగు చేస్తే దిగుడులు ఏ విధంగా ఉంటాయనేదానిపై పరిశీలన చేస్తారు. ఎకరాలకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే సత్ఫలితం వచ్చినట్లేనని ఆఫీసర్లు చెబుతున్నారు. డెమో ప్రదర్శన సాగు తర్వాత రైతులకు ఇక్కడి సాగు విధానాన్ని చూపెట్టనున్నారు. యాసంగిలో సాగు విధానాలు, నీటి తడులు అందించడం, దిగుబడులపై తెలియజేస్తారు.
సైంటిస్టుల పరిశీలన
అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టుల సూచనలకు అనుగుణంగా విత్తన క్షేత్రాల్లో పత్తి సాగు చేయనున్నారు. యాసంగి సీజన్‌లో ఆయా క్షేత్రాల పరిసరాల్లో వాతవరణ పరిస్థితులు, నేలల స్వభావం, సాగు నీటి లభ్యత వంటి ఆంశాలను పరిశీలించేం దుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత సాగుకు అనుగుణంగా స్థానిక ఆఫీసర్లు చర్యలు చేపట్టనున్నారు.