ఊపందుకుంటున్న సాగు.. ఇప్పటి దాకా 38లక్షల ఎకరాల్లో విత్తనాలు

ఊపందుకుంటున్న సాగు.. ఇప్పటి దాకా 38లక్షల ఎకరాల్లో విత్తనాలు

 

  •     వానాకాలం సీజన్​లో 1.31 కోట్ల ఎకరాలు టార్గెట్
  •     28లక్షల ఎకరాల్లో సాగైన పత్తి
  •     సోయా 2లక్షలు, కంది 1.75 లక్షల ఎకరాల్లో సాగు
  •     ఇప్పుడిప్పుడే షురూ అవుతున్న నాట్లు

హైదరాబాద్, వెలుగు: వర్షాలు కురుస్తుండటంతో పంటల సాగు క్రమంగా ఊపందుకుంటున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 38.06 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ప్రధానంగా పత్తితో పాటు పునాస పంటల సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. నీటి వసతి ఉండి ముందస్తుగా నార్లు పోసిన ప్రాంతాల్లో నాట్లు షురూ అవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఐదు జిల్లాల్లో వర్షాలు బాగానే పడటంతో పంటల సాగుకు కొంతమేర అడ్డంకులు తొలగుతున్నాయి. రుతుపవనాలు ఇన్ యాక్టివ్ కావడంతో వానల్లేక మొన్నటిదాకా ముందుకు సాగని సాగు.. ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నది. దీంతో రైతులు విత్తనాలు వేయడం షురూ చేశారు.

ఇప్పటి వరకు 29శాతం కల్టివేషన్

ఈ వానాకాలం సీజన్​లో 1.31 కోట్ల ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా, పెట్టుకున్న టార్గెట్​లో ఇప్పటి దాకా 29శాతం పంటల సాగు మాత్రమే జరిగింది. జులై ప్రారంభం నుంచి వానాకాలం సీజన్ సాగు జోరందుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. 66 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు 28.58 లక్షల ఎకరాల్లో కాటన్ సీడ్స్ వేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో 2లక్షల ఎకరాల్లో సోయా సాగు జరిగింది. వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల రైతులు కంది విత్తనాలు వేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 1.71 లక్షల ఎకరాల్లో కంది సాగు జరిగింది.

 ఆ తర్వాత మక్కల సాగు కొంత ఎక్కువగానే జరిగిందని అగ్రికల్చర్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, మొదక్, సిద్ధిపేట, జనగామా తదితర జిల్లాల్లో మక్కల సాగు పెరిగింది. ఇప్పటికే 1.25 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేశారని అధికారుల నిర్ధారించారు. పెసలు 23వేల ఎకరాల్లో, జొన్నలు 17వేల ఎకరాల్లో.. ఇలా అన్ని పంటలు కలిపి 38.06 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు తేలింది. అయినప్పటికీ.. పోయినేడాది ఈటైమ్​తో పోలిస్తే మూడు లక్షల ఎకరాలు తక్కువే సాగైంది.

ఆదిలాబాద్​లో అత్యధిక సాగు

వానాకాలం సీజన్​లో ఇప్పటి వరకు సాగులో ఆదిలాబాద్ జిల్లా టాప్​లో నిలిచింది. ఇప్పటికే ఆ జిల్లాలో 5.41 లక్షల ఎకరాలకు పైగా సాగు జరిగింది. సాధారణ సాగులో 96శాతం పంటల సాగు నమోదైంది. ఈ జిల్లాలో పత్తి విత్తనాలు 4.33 లక్షల ఎకరాల్లో వేయగా, 31వేల ఎకరాల్లో సోయా బీన్, 45వేల ఎకరాల్లో పునాస పంటల సాగు జరిగింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 3.33 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో, నల్గొండ జిల్లాలో 2.53 లక్షల ఎకరాల్లో, నిర్మల్ జిల్లాలో 2.28 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు.

షురూ అవుతున్న వరి నాట్లు

వర్షాలు కొంత లేట్ కావడంతో వరి నాట్లు పెద్దగా ముందుకు సాగలేదు. బోర్లు ఉండి ముందస్తు వరి నార్లు పోసిన రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు షురూ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 72వేల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 42,974 ఎకరాల్లో వరినాట్లు వేశారు. తర్వాత కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతున్నాయి.