పాలమూరులో పత్తి రైతుకు కష్టకాలం

పాలమూరులో పత్తి రైతుకు కష్టకాలం
  • పాలమూరులో పది రోజులుగా జాడలేని వానలు
  • ఎండిపోయే దశలో పత్తి మొలకలు
  • ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలు
  • భీమా, కోయిల్​సాగర్​ కెనాల్స్​ నుంచి నీటి విడుదల

మహబూబ్​నగర్, వెలుగు: పత్తి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా వానలు ముఖం చాటేస్తున్నాయి. ఇప్పటికే పొలాల్లో విత్తనాలు విత్తుకోగా, మొలకలు వచ్చాయి. అయితే పది రోజులుగా వర్షాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో వానలు పడకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ఇదిలాఉంటే పంటలను కాపాడేందుకు ప్రత్యామ్నాయంగా భీమా, కోయిల్​సాగర్ నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. 

పది రోజులుగా వానల్లేవ్​..

ఏటా వానాకాలం సీజన్​లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రైతులు పత్తినే ఎక్కువగా సాగు చేస్తారు. ఈ సీజన్​లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 9.85 లక్షల ఎకరాల్లో పంట సాగువుతుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. మృగశిర కార్తెలో దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు విత్తనాలు విత్తుకున్నారు. కార్తెకు ఒకటి, రెండు రోజులు అటు ఇటుగా జల్లులు పడడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. నైరుతి రావడంతో ఈ నెల మొదటి వారం అడపాదడపా వర్షాలు పడడంతో విత్తుకున్న విత్తనాలు మొలకెత్తాయి. ఆ తర్వాత వర్షాల జాడ లేదు. మబ్బులు కమ్ముకుంటున్నా వానలు పడడం లేదు. చాలా చోట్ల పత్తి చేలల్లో రెండు ఇంచుల నుంచి మూడు ఇంచుల లోపు మొక్కలు వచ్చాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు పడకుంటే ఈ చేలు ఎండిపోయే ప్రమాదం ఉంది.

నిరుడు ఇదే పరిస్థితి..

నిరుడు వానాకాలం సీజన్​లోనూ పత్తి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో 10.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉండగా.. జూన్, జులై వరకు వర్షాలు లేకపోవడంతో కేవలం 8 లక్షల ఎకరాలకే పంట పరిమితమైంది. జూన్​లో విత్తనాలు విత్తుకున్నా.. వర్షాలు, నీళ్లు అందక మొలకెత్తలేదు. దీంతో గత ఏడాది చాలా మంది రైతులు మళ్లీ పొలాలను దుక్కి దున్ని ఆగస్టులో రెండోసారి పత్తి విత్తనాలు విత్తుకున్నారు.

ఆ టైంలో కూడా వాతావరణం అనుకూలించక పత్తి చేలన్నీ దెబ్బతిన్నాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో 70 వేల ఎకరాల్లో పంటకు ఆకుమాడు తెగులు, ఎండు తెగులు, సుక్ష్మాధాత్రి లోపం, రసం పీల్చే పురుగు ఆశించి పంటను దెబ్బతీశాయి. మొక్కలు రెండు ఫీట్లకు మించి పెరగకపోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. నారాయణపేట జిల్లాలో 30 శాతం పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి జిల్లాలో పత్తి అత్యధికంగా సాగయ్యే నాగర్​కర్నూల్​ జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడులు సగానికి పడిపోయాయి. 

ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల..

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని ధన్వాడ, మరికల్, నర్వ, చిన్నచింతకుంట, దేవరకద్ర ప్రాంతాల్లో అత్యధికంగా పత్తి సాగవుతోంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, బోర్లు ఎండిపోవడంతో పత్తి పంటలను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. దీంతో పత్తి చేలకు సాగునీటిని అందించేందుకు దేవరకద్ర, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు జి.మధుసూదన్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికా రెడ్డి భీమా, కోయిల్​సాగర్​ ప్రాజెక్టుల పరిధిలోని లిఫ్ట్​ల నుంచి కెనాల్స్​కు నీటిని విడుదల చేయించారు.

ఇప్పటికే కొత్తకోట ఉమ్మడి మండలంలోని భీమా ఫేస్–1 నుంచి ఎమ్మెల్యే ఇటీవల కెనాల్స్​కు నీటిని విడుదల చేయగా, వారం కిందట కోయిల్​సాగర్​ ప్రాజెక్టు పరిధిలోని ఉంద్యాల స్టేజ్–1 వద్ద ఎమ్మెల్యేలు నీటిని రిలీజ్​ చేశారు. మూడు రోజుల కింద తీలేరు స్టేజ్–-2 నుంచి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సాగునీటిని కెనాల్స్​కు విడుదల చేశారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఊరట లభించింది.

మొక్కలు ఎండుతున్నయ్..​

ఈ ఏడాది ఆరెకరాల్లో పత్తి ఏసిన. ఈసారి వర్షాలు బాగా పడతాయని ముందు నుంచి చెప్పడంతో రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు విత్తుకున్నా. ఈ నెల మొదట్లో వర్షాలు పడడంతో మొలకలు వచ్చాయి. కానీ, పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నయ్.

ఎస్​.జనార్దన్, అమ్మాపూర్, చిన్నచింతకుంట మండలం

వర్షాలు పడితేనే..

నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. ఈసారి మంచి రేట్​ వస్తుందని మొత్తం పత్తి పెట్టిన. మొలకలు వచ్చాయి. కానీ ఇంత వరకు వర్షాలు పడడం లేదు. రెండు, మూడు రోజుల్లో వర్షం పడకుంటే చేనంతా ఎండిపోతుంది. 

 రాములు, మరికల్​ మండలం