రాష్ట్రంలో పత్తి రైతులు దగా పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముదామని మార్కెట్‌కు తీసుకెళితే.. రోజురోజుకు ధర తగ్గిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్‌లో 15 రోజుల్లోనే పత్తి ధర క్వింటాల్‌కు రూ. వెయ్యి వరకు పతనమైంది. ఖమ్మం మార్కెట్లోనూ సగటున క్వింటాల్‌కు రూ. 5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పలు జిల్లాల్లో వారం రోజులుగా పత్తి ఏరడం జోరందుకుంది. కానీ ధర మాత్రం పతనమవుతున్నది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 15 రోజుల క్రితం క్వింటాలు పత్తి రూ. 8,300 పలికింది. శనివారం నాటికి వెయ్యి రూపాయల వరకు తగ్గి రూ. 7,330కి చేరింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రెండు రోజుల క్రితం వరకు పత్తి క్వింటాల్రూ.7 వేలకుపైగా పలికింది. కానీ వ్యాపారులు తేమ శాతం ఎక్కువగా ఉందని రూ. 5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.60 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. దాదాపు 22 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. వారం రోజులుగా పత్తి ఏరడం జోరందుకుంది. కానీ ధర మాత్రం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 14న ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ ధర క్వింటాలుకు రూ. 6,380 ఉండగా ప్రైవేట్ ట్రేడర్స్ వేలం పాట పాడి రూ. 8,300 మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే రోజురోజుకు పత్తి ధర తగ్గిస్తున్నారు. 15 రోజుల్లోనే రూ.970 వరకు తగ్గింది. శనివారం ధర రూ. 7,330కి చేరింది. ధరలు పడిపోతుండడంతో చేతికొచ్చిన పంట అమ్ముకోలేక.. మరోవైపు అప్పుల బాధతో రైతులు సతమతమవుతున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది దీపావళికి రైతులు మార్కెట్ యార్డుకు పంట తీసుకురావడం సెంటిమెంట్ గా భావిస్తారు. కానీ ఈ ఏడాది 70 శాతం మంది రైతులు పంటను మార్కెట్ కు తీసుకురాలేదు. ధర మరీ తక్కువగా ఉండటంతోనే అమ్మడం లేదని రైతులు చెబుతున్నారు. మరోపక్క జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోతుండటంతో పత్తిలో తేమ శాతం పెరుగుతోంది. ఇటు మద్దతు ధర కూడా లేకపోవడంతో పంటను ఇండ్లలోనే నిల్వ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 2.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 16.6 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో 13 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇంకా అక్కడ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు మార్కెట్ కు పత్తిని తరలిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి క్వింటాల్ రూ.7 వేలకు పైగా రేటు పలుకుతోంది. కానీ వ్యాపారులు తేమ శాతం ఎక్కువగా ఉందని చెబుతూ రూ. 5 వేల ధర మాత్రమే చెల్లిస్తున్నారు.
మందకొడిగా కొనుగోళ్లు
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, బోథ్, జైనథ్, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్రతి ఏడాది పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్లోనే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ధర లేక ఇక్కడ పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో మార్కెట్ యార్డు వెలవెలబోతోంది. ఇప్పటి వరకు కేవలం 2,182 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక్కరోజు మాత్రమే వేలం వేసి పత్తి కొనుగోలు చేయగా రెండో రోజు నుంచి ధర తగ్గించుకుంటూ వస్తున్నారు. దాంతో రైతులు పంటను ఇండ్లలో ఉంచుకొని ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. గతేడాది పత్తి కొనుగోళ్లు దాదాపు ముగింపు దశకు వచ్చిన తర్వాత క్వింటాలుకు రూ. 10 వేల వరకు ధర పలికింది. అటు అంతర్జాతీయంగా బేళ్ల ధరలు పెరిగితే ఇక్కడ పత్తి ధర పెంచాల్సి ఉన్నప్పటికీ అదేమి పట్టనట్టుగా వ్యాపారులు సిండికేట్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు 9,250 బస్తాల పత్తి వచ్చింది. జెండా పాట ధర క్వింటాకు రూ.8,019 పలకగా, కనిష్ఠ ధర రూ.4 వేలు చెల్లించారు. సగటున క్వింటాకు రూ.5 వేలు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. మాయిశ్చరైజర్ మెషిన్ లేకుండా వ్యాపారులు చేతులతో పత్తిని పట్టుకొని ధర నిర్ణయిస్తున్నారని అంటున్నారు.
మహారాష్ట్రలో అమ్మేందుకు మొగ్గు
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో మహారాష్ట్ర బార్డర్లో ఉన్న తలమడుగు, బేల, బోథ్, తాంసి, బింపూర్ మండలాల రైతులతో పాటు ఆదిలాబాద్ మండలానికి చెందిన కొందరు రైతులు పత్తిని మహారాష్ట్రకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బోరి, పాండ్రకవడలో ఇక్కడి కంటే రూ. వెయ్యి వరకు ధర ఎక్కువగా చెల్లించడంతో పాటు, ఎలాంటి కోతలు ఉండవనే ఉద్దేశంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు మహారాష్ట్ర దళారులు ఇక్కడి రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దీపావళికి ముందే రైతుల వద్దకు వచ్చిన వ్యాపారులు పత్తి తమకు విక్రయించాలని, ధర విషయంలో తగ్గేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ధర లేకపోవడంతో చేసేదేం లేక రైతులు మహారాష్ట్ర వ్యాపారులకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది సైతం దాదాపు 30 శాతం మంది రైతులు మహారాష్ట్ర కు పత్తి తరలించారు. దీంతో 20 లక్షల క్వింటాళ్లు మార్కెట్ కు వస్తాయనుకుంటే కేవలం 9 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇప్పటికైన వ్యాపారులు ధర పెంచితే పంటను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెబుతున్నారు.