కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. అందరూ కలసి ఏకమై తక్కువ ధరకే కాటన్ కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీజన్ కు ముందు 12 వేల దాక ధరపలికిన పత్తికి ఇప్పుడు రూ.8వేలకు మించి పలకడం లేదు. ఇవాళ గరిష్టంగా ఒకరిద్దరు రైతులకు రూ.8 వేల 200లు ధర చెల్లించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యాపారులకు అధికారుల అండదండలుండడంతో పత్తి మార్కెట్ లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
మార్కెట్ రేటు కంటే తక్కువకు పత్తిని కొంటూ తమను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది సీజన్ మొదట్లో క్వింటాలు పత్తికి 9 వేలు రేటు పలికింది. అయితే సరిగ్గా మార్కెట్ కు పెద్ద ఎత్తున పత్తి వస్తున్న టైమ్ లో వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జమ్మికుంట మార్కెట్ యార్డుకు రోజూ సుమారు రెండు వేల క్వింటాళ్ల పత్తి వస్తోంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తికి గరిష్టంగా 8 వేల 200 రేటు చెల్లించారు. అది కూడా ఒకరిద్దరు రైతులకు మాత్రమే. మిగిలిన వారికి యావరేజ్ అంటూ 6వేలు, 7వేలకు మించి ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. అంతే కాదు దిగుమతి కోసం మిల్లు దగ్గరకు వెళ్లిన తర్వాత పత్తి సరిగా లేదంటూ క్వింటాలుకు రూ. 200 వరకు ధరలో కోత పెడుతున్నారని చెబుతున్నారు. సగం పత్తి దించిన తరవాత విషయం చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో వ్యాపారులు చెప్పిన రేటుకే అమ్మాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో పాలకవర్గం లేకపొవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 4లక్షల ఎకరాల్లో పత్తి సాగు
ఈ ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల పైగా ఎకరాల్లో పత్తి పంట సాగయింది. అయితే భారీ వర్షాల వల్ల పత్తి ఎదగకుండా మొక్క దశలోనే రోగాల బారిన పడింది. అటు తర్వాత వర్షాకాలం సీజన్ అంతా వానలు పడుతూనే ఉండటంతో పూత, పిందెలు రాలిపోయి పత్తి దిగుబడి తగ్గింది. అష్ట కష్టాలు పడి పండించిన పంటను మార్కెట్ కు తీసుకొస్తే వ్యాపారులు.. ఏదో ఒక సాకు చెప్పి దోచుకుంటున్నారని రైతలు మండిపడుతున్నారు.
సీసీఐ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందంటున్నారు. గత ఏడాది సీజన్ చివరలో పలికిన ధరతో చూస్తే ఈసారి నాలుగు వేల వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ఇలా జరుగుతోందని చెబుతున్నారు.