కొర్రీలు.. కోతలు.. ఎదురుచూపులు!..భద్రాచలం ఏజెన్సీ పత్తి రైతులకు.. అడుగడుగునా అరిగోస

  •     దళారులు తెచ్చిన పత్తికి ప్రాధాన్యం!
  •      రోజుల కొద్దీ సీసీఐ కేంద్రం వద్దే రైతుల నిరీక్షణ
  •      వరుసగా మరో మూడు రోజులు సెలవు
  •      వెహికల్స్​ వెయిటింగ్​ చార్జీలు​భరించలేమని ఆందోళన  

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఏజెన్సీలోని పత్తి రైతులకు పాట్లు తప్పడం లేదు. పత్తి అమ్ముకోవాలంటే సీసీఐ కేంద్రం వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సిన వస్తోంది. పత్తి  కొనేందుకు కొర్రీలు.. కోతలు పెడుతూ తమను అధికారులు అరిగోస పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని  పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం నెల్లిపాక బంజరలోని శ్రీరామ కాటన్​ ఇండస్ట్రీస్​లో ఏర్పాటు చేసింది.

ఈ కేంద్రం భద్రాచలం మన్యంలోని గిరిజన రైతులకు చాలా దూరంగా ఉంటుంది. అయినా కాస్త మంచి ధర వస్తుందనే ఆశతో దూరభారమైనా, రవాణా చార్జీలు ఎక్కువైనా తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ కేవలం దళారులు తెచ్చిన పత్తిని కొంటూ రైతుల వాహనాలను ఆపేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం ఛత్తీస్​గఢ్​ సరిహద్దు నుంచి ఎక్కువగా ఆదివాసీలు పత్తిని ట్రాక్టర్లు, బొలేరో వాహనాల్లో తీసుకొచ్చారు. గిట్టుబాటు ధర కోసం చూస్తే కిరాయికి తెచ్చిన వాహనాల వెయిటింగ్ చార్జీల​భారం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

టోకెన్ల పేరిట టోకరా

సీసీఐ కొనుగోలు కేంద్రానికి గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో పత్తిని తీసుకొచ్చారు. రైతులు టోకెన్లు తీసుకుని తమ వాహనాలను పక్కనే ఉన్న మల్లెలమడుగు జడ్పీ హైస్కూల్​ గ్రౌండ్​లో పార్కింగ్​ చేస్తున్నారు.  దళారులు గ్రామాల్లో కొన్న పత్తిని నేరుగా కేంద్రంలోకి తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. దళారుల వాహనాలను రానిచ్చిన అధికారులు రైతులను వెయిట్​ చేస్తున్నారు.  ఒకే టోకెన్​పై దళారులు రెండు, మూడు లోడ్లు అమ్ముకుంటున్నారు. 

తరుగు పేరిట మోసం.. 

తరుగు పేరిట రైతులను కూడా మోసం చేస్తున్నారు. పాసింగ్​ సమయంలో ఒక్కో క్వింటాకు 5 కిలోల వరకు అదనంగా పత్తిని తీసుకుంటున్నారు. గిట్టుబాటు ధర రూ.6,920 ఉంటే తేమ, తాలు పేరుతో తక్కువ ధర చెల్లిస్తున్నారు. అయినా అమ్మిన తర్వాత రైతు ఖాతాలో డబ్బులు వేయడానికి కూడా కొర్రీలు పెడుతున్నారు. ఆధార్​, పట్టాదార్​ పాస్​బుక్​, బ్యాంకు బుక్​లు జిరాక్స్ కాపీలు తీసుకుంటున్నారు. టెక్నికల్​ ప్రాబ్లం సాకు చెప్పి ఆలస్యంగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. దళారులు అమ్మిన పత్తికి మాత్రం అధికారులు వెంటనే వారి అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. 

సౌకర్యాలు లేక తిప్పలు

దుమ్ముగూడెం మండలం నుంచి 23 మంది రైతులు రెండు రోజుల కింద సీసీఐ కొనుగోలు కేంద్రానికి   పత్తి తెచ్చారు.  టోకెన్లు ఇచ్చారు. కానీ వారి నుంచి పత్తిని కొనడం లేదు. కొనుగోలు కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోని మల్లెలమడుగు హైస్కూల్​ గ్రౌండ్​లో రైతుల వాహనాలకు పార్కింగ్​ఇచ్చారు. కానీ అక్కడ వారికి ఎలాంటి సౌకర్యాలు లేవు. నీడ, నీళ్లు, తిండి, టాయిలెట్స్​లేక ఇబ్బంది పడుతున్నారు. పత్తి తెచ్చిన వాహనాల కిందనే నిద్రపోతున్నారు. 

ఆ మూడు రోజులు సెలవులు.. 

ఈనెల 26న గణతంత్ర దినోత్సవం, 27న స్టాక్​ ఎక్కువ ఉందని, 28న ఆదివారం అని, పత్తి తీసుకురావొద్దంటూ సీసీఐ గోడపై నోటీసు అంటించింది. గురువారం 12 గంటల వరకు ఉన్న లోడ్​లు దించలేదు. మరో మూడు రోజులు ఇక్కడే ఉండాలా? అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మస్తు దూరం నుంచి వచ్చినం.. 

పత్తి అమ్మేందుకు50 కిలోమీటర్ల దూరం నుంచి 23 మందిమి వచ్చినం. రేటు వస్తదని ఆశపడితే ఇక్కడ మస్తు కష్టపెడుతున్నరు. రెండు రోజుల నుంచి పత్తిని తీసుకునేటోళ్లే లేరు. బయటోళ్లు ఒక టోకెన్​పై రెండు, మూడు లోడ్లు దించుతున్నరు. మా పత్తి మాత్రం కొంటలేరు.
-
  సలీం, చింతగుప్ప, దుమ్ముగూడెం

ఇబ్బంది లేకుండా చూస్తాం

రైతులు తెచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేశాం. కాస్త ఆలస్యమైనా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. టోకెన్లు విషయంలో రైతులకు జరుగుతున్న అవకతవకలపై దృష్టిసారిస్తాం. 
-
 ఎంఏ ఆలీ, డీఎం