- రాయచూర్ మార్కెట్కు వెళ్తున్న పాలమూరు రైతులు
- సీసీఐ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టని ఆఫీసర్లు
- గ్రామాల్లో పత్తి కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న దళారులు
వనపర్తి, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతులు సరైన మార్కెట్ లేక తిప్పలు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక ఈ ఏడాది దిగుబడి తగ్గిందని ఓ వైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పత్తిని అమ్ముకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కర్నాటక లోని రాయచూరు మార్కెట్ కు పత్తిని తరలించి అమ్ముకోవాల్సి రావడంతో, ఖర్చులు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వానాకాలం సీజన్ లో రెండున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
వర్షాధారంగా కొందరు పత్తి సాగు చేస్తే, మరికొందరు నీటి వసతి చూసుకుని సాగు చేశారు. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ సారి 4 క్వింటాళ్లు మించదని అంటున్నారు. వర్షాలు సరిగా కురవకపోవడం, ఎండలు ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడిపై ప్రభావం పడిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వైరస్, తెగుళ్లు, గూడు రాలడంతో దిగుబడి
తగ్గిపోయింది.
బయటి మార్కెట్లో పత్తికి డిమాండ్..
సీజన్ ప్రారంభంలోనే పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువగా ఉంది. నాణ్యమైన పత్తికి బయటి మార్కెట్లో క్వింటాలుకు రూ.8 వేల వరకు ధర పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణ పేట, గద్వాల, వనపర్తి జిల్లాల రైతులు సమీపంలోని కర్నాటక రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి అమ్ము తున్నారు. అక్కడి వ్యాపారులు వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ఊరట చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాలేవి?
పత్తి కొనుగోలుకు ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు పత్తి ఏరుతుండగా, చిన్న, సన్నకారు రైతుల నుంచి దళారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.6,380కు దళారులు కొని, పది రోజుల తరువాత డబ్బులు ఇస్తున్నారు. వారు కర్నాటకకు పత్తిని తరలించి సొమ్ము చేసుకుంటుండగా, తూకం, ధర విషయంలో రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దళారుల చేతుల్లో మోస పోతున్నామని, వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కౌంటర్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే పత్తికి డిమాండ్ ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోలు సెంటర్లు ప్రారంభించక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకోవచ్చు
రైతులు దగ్గరలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి అమ్ముకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రపోజల్స్ ఉన్నాయి. బయటి మార్కెట్ లో ధర ఎక్కువగా ఉండడంతో రైతులు నేరుగా కాటన్ మిల్లుల్లో పత్తి అమ్ముకుంటున్నారు. తూకంలో మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
- తిరుపతి రావు, అడిషనల్ కలెక్టర్, వనపర్తి