ఆదిలాబాద్, వెలుగు తెల్లబంగారానికి ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతులకు నష్టాలే మిగిలాయి. ఊహించని విధంగా ధర పడిపోవడం.. నెలల తరబడి నిల్వ ఉంచిన ధర పెరగక పోవడంతో నిరాశే మిగిలింది. పత్తి కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నా.. వ్యాపారులు ధరలు పెంచకపోవడంతో తక్కువ ధరకే పత్తి అమ్ముకోవాల్సి వస్తుంది. వ్యాపారుల సిండికేట్ గా మారి ధరలు పెరగకుండా చేస్తున్నారని, దీంతో గతేడాదితో పోలిస్తే రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.జిల్లాలో ఆదిలాబాద్, జైనాథ్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 3 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు కురిసి చాలావరకు పంట నేలపాలై, దిగుబడి తగ్గింది. అక్టోబర్ లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 9 లక్షల క్వింటాళ్లు మాత్రమే మార్కెట్ కు వచ్చింది. అటు జిల్లాలో వ్యాపారులు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పత్తి మహారాష్ట్రకు తరలిపోయినట్లు సమాచారం. అక్కడ క్వింటాల్‌కు రూ. 9 వేల ధర పలకడంతో సరిహద్దు గ్రామాల్లన్నీ అక్కడి మార్కెట్లకే పంటను తరలించారు. ప్రస్తుతం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మరో 50 వేల క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తి మార్కెట్ కు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నష్టాలే మిగిలాయి..
గతేడాది పత్తి ధర క్వింటాల్‌కు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలికింది. దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పంటను గతేడాది కొనుగోలు చేశారు. ఈ ఏడాది రైతులు రూ.7,500కు మించి ధర పలకలేదు. దీంతో ప్రతీ రైతు క్వింటాల్‌కు రూ. 2 వేల వరకు నష్టపోయాడు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ ఏడు రూ.180 కోట్ల నష్టం వచ్చింది. గతేడాది చివరలో దాదాపు రూ. 12 వేల ధర కూడా పలికింది. దీంతో ఈ ఏడాది కూడా అదే రీతిలో ధరలు వస్తాయని రైతులు ఆశించారు. మొదట్లో రూ. 9 వేలు పలికిన ధర కొన్ని రోజులు మాత్రమే నిలకడగా ఉంది. ఆ తర్వాత రోజురోజుకు పడిపోతూ వచ్చింది. దాదాపు రెండు నెలలు రూ. 7 వేలు కూడా దాటని ధర వారం రోజుల నుంచి రూ. 7650 పలుకుతుంది. ఇప్పటికే 90 శాతం మంది రైతులు రూ. 7 వేల ధరకే పత్తిని అమ్ముకున్నారు. ఇటు వర్షాలు, చీడపీడల పురుగులతో దిగుబడి ఎకరానికి 5 క్వింటాళ్లు కూడా రాలేదు.
రూ.30 పెంచుడు.. రూ.50 తగ్గించుడు
ప్రతీ ఏడాది వ్యాపారులు పత్తి కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. మార్కెట్ కు వచ్చిన పంటలో తేమ శాతం ఎక్కువగా ఉందని కోతలు విధిస్తూనే.. మరో వైపు గిట్టుబాటు ధర రాకుండా సిండికేట్ గా మారి రైతులకు నష్టం కలిగిస్తున్నారు. ఈ ఏడాది ధర పెంపు విషయంలో వ్యాపారులు అడుగు ముందుకేయడం లేదు. ఒకరోజు రూ.30 పెంచితే మరుసటి రోజు రూ. 50 తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో రైతులు వడ్డీలు కట్టలేక దళారులకు అమ్ముకొని అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.