తెలంగాణ మార్కెట్​కు పత్తి రాక షురూ .. ఇప్పుడిప్పుడే కాటన్​ తీసుకొస్తున్న రైతులు

తెలంగాణ మార్కెట్​కు పత్తి రాక షురూ .. ఇప్పుడిప్పుడే కాటన్​ తీసుకొస్తున్న రైతులు
  • కొత్త పత్తి క్వింటాల్ రూ.7 వేలకు పైనే ధర
  • రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్కెట్​కు పత్తి రావడం షురూ అయింది. మొదట వచ్చిన తెల్ల బంగారాన్ని అమ్ముకోవడానికి  రైతులు ఇప్పుడిప్పుడే మార్కెట్​కు తీసుకువస్తున్నారు. రాష్ట్రంలోని వరంగల్​ ఎనుమాముల మార్కెట్, ఖమ్మం మార్కెట్​కు పత్తి తరలివస్తోంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్​కు 3,078 బస్తాల కొత్త పత్తిని 302 మంది రైతులు తీసుకురాగా గరిష్ట ధర క్వింటాల్  రూ.7,111 పలికింది.  మోడల్‌‌‌‌  ధర రూ.6,500, కనిష్ట ధర రూ.4,500 వరకు పలికింది. అదే మార్కెట్​లో పాత కాటన్​ క్వింటాల్​ రూ.7550, మోడల్​ ధర రూ.6 వేలు ఉండగా, కనిష్టంగా రూ.4500 వరకు ఉందని మార్కెట్‌‌  వర్గాలు తెలిపాయి.

 వరంగల్​ మార్కెట్‌‌లో కాటన్‌‌  గరిష్ట ధర క్వింటాల్  రూ.7,600, మోడల్‌‌  ధర రూ.6,600, కనిష్ట  ధర రూ.5,500 వరకు పలికింది. కొత్త పత్తి క్వింటాల్ కు రూ.7600 పైనే పలుకుతోంది. ఇటీవల ఓ వ్యాపారి క్వింటాల్ ను రూ.7,800కి కొనుగోలు చేశాడు. ఈ సంవత్సరం ఇదే అత్యధిక ధర. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నాణ్యమైన పత్తి లభిస్తుండడంతో ధరలు ఊపందుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోనూ పత్తికి డిమాండ్  పెరిగింది. రానున్న రోజుల్లో క్వింటాలు పత్తికి భారీగా ధరలు పలికే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 

ఈసారి తగ్గిన పత్తి సాగు..

రాష్ట్రంలో ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా వేయగా 43.76 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది.  ఈ నేపథ్యంలో 3 కోట్ల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని మార్కెటింగ్​ శాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 376 జిన్నింగ్‌‌  మిల్లులు ఉండగా, సీసీఐ కొనుగోళ్లు లేక మిల్లుల యజమానులే పత్తిని కొంటున్నారు. ధరలు పెరుగుతుండడంతో కొందరు రైతులు పత్తిని ఇప్పుడే విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి దిగుబడులు సగానికి తగ్గినా చేతికి అందిన పంట మంచి క్వాలిటీతో ఉంది. 

పెట్టుబడులు, కౌలు, కూలి రేట్లు పెరగడంతో రైతులు అయోమయంలో పడినా మంచి ధరలు వస్తే తప్ప వారికి ఊరట కలిగే అవకాశం లేదు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో అధిక వర్షాల వల్ల ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా తగ్గింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల పత్తికి డిమాండ్  పెరగనుంది. గ్లోబల్ మార్కెట్‌‌లో భారతీయ నూలుకు అధిక డిమాండ్  ఉన్నందున ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ సీజన్‌‌లో తెల్ల బంగారం ధర క్వింటాల్‌‌కు సీసీఐ మీడియం మద్దతు ధర రూ.7121, లాంగ్​ పత్తి మద్దతు ధర రూ.7,521గా ఉంది.