
- సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి వద్ద ఘటన
నేరేడుచర్ల, వెలుగు: పత్తి లోడ్ లారీ దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. 80 లక్షల ఆస్తినష్టం జరిగింది. స్థానికులు, లారీ డ్రైవర్ రమేశ్ తెలిపిన ప్రకారం.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం చింతపల్లి లోని కవిత కాటన్ ఇండ్రస్ట్రీస్ మిల్లు నుంచి తమిళనాడుకు చెందిన(TN69, BU8329) లారీ పత్తి లోడ్ చేసుకుని కోవైపట్టిలోని మహావిష్ణు స్విన్నింగ్ మిల్లుకు బయలుదేరింది. ఆదివారం రాత్రి11.30 గంటలకు నేరేడుచర్ల మండలం చిల్లేపల్లికి రాగా.. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
లారీపై నుంచి మంటలు వస్తున్నాయని డ్రైవర్ కు స్థానికులు తెలుపగా పక్కకు ఆపాడు. వెంటనే పోలీసులకు, ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. మిర్యాలగూడ ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా అదుపులోకి రాకపోవడంతో జేసీబీతో పత్తిని తొలగించారు.
లారీపై పిడుగు పడి ప్రమాదం జరిగిందా..! లేక విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయిందా..? అనేది తెలియాల్సి ఉంది. సుమారు రూ.40లక్షల విలువైన 24 టన్నుల పత్తి, రూ.40 లక్షల విలువైన లారీ పూర్తిగా కాలిపోయాయి. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తన సిబ్బందితో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూశారు.