కరీంనగర్/ జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పత్తి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు డిసైడ్ చేస్తుండడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోయినేడాది పత్తికి బాగా ధర పలికిందని ఆశపడ్డ అన్నదాతలు 15 రోజుల నుంచి భారీగా తగ్గుతున్న ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు.
ధరలు తగ్గిస్తున్నరు..
నెల రోజులుగా జమ్మికుంట పత్తి మార్కెట్ కు వందల క్వింటాళ్ల పత్తి వస్తుండడంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) క్వింటాల్పత్తికి రూ.6,380 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇతర రాష్ర్టాలలో దిగుబడులు బాగా తగ్గడం, మన రాష్ర్టంలో పెరగడం.. జాతీయ మార్కెట్ లో బేళ్లకు, గింజలకు డిమాండ్ ఉండడంతో మొన్నటిదాకా మార్కెట్ లో వ్యాపారులు పోటీ పడి క్వింటాకు రూ.9,350 నుంచి రూ.9,150 వరకు కొనుగోలు చేశారు. గన్నీ బ్యాగుల కొరతతో ఇటీవల వరంగల్, పెద్దపల్లి మార్కెట్లలో నాలుగు రోజుల పాటు కొనుగోళ్లు బంద్ ఉండడంతో పత్తి వ్యాపారులు సిండికేట్ గా మారి రేట్లను తగ్గించేశారు. రూ.9,350 నుంచి నేరుగా రూ.600లు తగ్గించి కేవలం రూ.8,500 నుంచి రూ.8,600 కే కొనుగోలు చేస్తున్నారు.
నిలువు దోపిడీ..
మార్కెట్ లో ఆడ్తిదారులు, ఖరీదుదారులు ఒక్కరే కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు మిల్లు వద్దకు వెళ్లిన అనంతరం పత్తి సరిగా లేదంటూ కింటాల్ కు రూ.200 వరకు కోత విధిస్తున్నారు. సగం లోడు దించిన తరవాత విషయం చెబుతుండడంతో గత్యంతరం లేక వాళ్లు చెప్పిన రేటుకే అమ్ముతున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో పాలకవర్గం లేకపొవడం, అధికార పార్టీకి చెందిన లీడర్లు మార్కెట్ పై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడులు ఎల్తలేవు
జమ్మికుంట మార్కెట్ లో ధరలు మంచిగ ఇస్తరనుకుంటే ఇక్కడ కూడా అగ్గువకే కొంటున్నరు. రోజురోజుకు ధరలు తగ్గిస్తున్నరు. మంచి ధర వస్తదని ఆశపడితె క్వింటాలుకు రూ.8,600 ఇచ్చిన్రు. వెనక్కి తీసుకుపోలేక అమ్ముకొని పోతున్నం.- కుర్ర నరేష్, మల్హార్ మండలం
కటింగ్ పెడుతున్నరు
పోయినేడాది ఇదే టైమ్ లో రూ.12వేల నుంచి రూ.14వేలు ధర పలికింది. అట్లనే ఉంటదనే ఆశతో వస్తే సేట్లు చెప్పినట్లే ఇచ్చి పోవుడైతాంది. మార్కెట్ లో ఒక ధర రాస్తున్నరు.. మిల్లుకు పోయిన తరవాత పత్తి నల్లగా ఉంది.. గింజ సరిగా లేదంటూ క్వింటాల్ కు రూ.200 కట్చేస్తున్నరు.-
మూడెత్తుల రాకేష్, పత్తి రైతు