బ్లాక్​ మార్కెట్​లో పత్తి విత్తనాలు..ఒక్కో ప్యాకెట్ పై అదనంగా రూ.1200 వసూలు

  • సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులు 
  • తనిఖీలు చేస్తున్నా అధిక రేట్లకు అమ్మకాలు
  • ఆఫీసర్లకు తెలిసే సాగుతుందంటున్న రైతులు 

భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ, వెలుగు జిల్లాలో పత్తి విత్తనాలకు మార్కెట్​లో ఉన్న డిమాండ్​ను వ్యాపారులు క్యాచ్​చేసుకుంటున్నారు. పత్తి పంట సాగుకు జిల్లా అనుకూలం కావడంతో వ్యాపారులు రైతులను అధిక రేట్లతో దోచుకుంటున్నారు. అధిక దిగుబడి వచ్చే కొత్త రకం విత్తనాలంటూ రైతులను వ్యాపారులు బోల్తా కొట్టిస్తున్నారు. బీటీ పత్తి విత్తనాలను బ్లాక్​లో అమ్ముతున్నారు. ఎమ్మార్పీ మీద అదనంగా ఒక్కో ప్యాకెట్​ మీద రూ.1200 వసూలు చేస్తున్నారు. ఒక్కోటి రూ.850గా ఎమ్మార్పీ కాగా,. ఒక్కో ప్యాకెట్​ని రూ.2 వేలకు సేల్ చేస్తున్నారు. ఆఫీసర్ల కనుసన్నల్లోనే ఈ బ్లాక్ దందా సాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

బలవంతంగా అంటగడుతున్నారు..

జిల్లాలోని చాలా చోట్ల పత్తి విత్తనాలను బ్లాక్​లో అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో దాదాపు1.75లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. అందుకు దాదాపు 5లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. అధిక దిగుబడి వచ్చే విత్తనాల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. వారు గ్రామాల్లోని చిరు వ్యాపారులతో కలిసి అధిక దిగుబడినిచ్చే నాణ్యత కలిగిన కొత్త పత్తి విత్తనాలు వచ్చాయంటూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా యూఎస్ 7067, ఏబీసీ హెచ్-147, బీటీ బీజీ– 2 గీత, సూపర్ 971, బీజీ– 2 పత్తి విత్తనాలకు డిమాండ్ పెరిగింది. గ్రోమోర్​తోపాటు ఫెర్టిలైజర్ షాపుల్లో ఈ రకం విత్తనాలు కొనుగోలు చేసేవాళ్లకు మరో మూడు రకాల విత్తనాలను బలవంతంగా అంటగడుతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. 

కలెక్టర్​ ఆదేశాలను పట్టించుకోని ఆఫీసర్లు..

చండ్రుగొండ మండలంలో యూఎస్ 7067 రకం విత్తనాలను పెద్ద ఎత్తున బ్లాక్ లో విక్రయిస్తున్నారు. దీంతో సమీపంలోని ఖమ్మం జిల్లా ఏన్కూర్​మండలానికి వెళ్లి కొనుక్కొంటున్నారు. చండ్రుగొండ, భద్రాచలంతోపాటు టేకులపల్లి, ఇల్లెందు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, గుండాల, ఆళ్లపల్లి తదితర మండలాల్లో పత్తి విత్తనాలను బ్లాక్​లో అమ్ముతున్నా,  నాసిరకం విత్తనాలను విక్రయిస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లతో వ్యాపారులు కుమ్ముక్కై విత్తనాలను బ్లాక్​మార్కెట్​చేస్తున్నారనే విమర్శలున్నాయి. 

ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​అనుదీప్​ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆదేశించారు. నాసిరకం విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఫీసర్లు ఫెర్టిలైజర్స్​షాపుల్లో తనిఖీలు చేస్తూ అంతా బాగుందని రిపోర్టు ఇస్తున్నారు. వారు తనిఖీలు చేసిన షాపుల్లోనే బ్లాక్​లో అమ్మకాలు సాగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్​లో అధిక రేట్లకు విత్తనాలు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

కొన్ని షాపులపై విచారిస్తున్నాం...

చండ్రుగొండ, భద్రాచలం ప్రాంతాల్లో బ్లాక్​లో పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. మండల అగ్రికల్చర్ ఆఫీసర్లను విచారణకు ఆదేశించాం. విత్తనాలను బ్లాక్​మార్కెట్​చేసేవారిపై కేసులు నమోదు చేస్తాం. గ్రామాల్లో తెల్ల సంచుల్లో అమ్మే వాటిని రైతులు కొనొద్దు. అధిక రేట్లకు విక్రయించేవారితోపాటు, బీటీ విత్తనాలు కొనేవారికి నాసీరకం సీడ్ కూడా కొనాలని వ్యాపారులు ఒత్తిడి తీసుకువస్తే ఫిర్యాదు చేయాలి. 

లాల్​చంద్, ఏడీఏ, భద్రాద్రికొత్తగూడెం