చత్తీస్​గడ్ లో వింత వ్యాధి.. ఒకే గ్రామంలో మూడు రోజుల్లో 13 మంది మృతి

చత్తీస్​గడ్ లో వింత వ్యాధి..  ఒకే గ్రామంలో మూడు రోజుల్లో 13 మంది మృతి

   

  • చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా దనికొడతలో ఘటన

భద్రాచలం,వెలుగు : చత్తీస్​గడ్  సుక్మా జిల్లాలోని ఒకే గ్రామానికి చెందిన 13 మంది మూడు రోజుల్లో చనిపోయారు. దనికొడత గ్రామానికి చెందిన మృతులు దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతూ చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత మారుమూల అటవీ ప్రాంతం కావడంతో అక్కడ వైద్య సేవలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. సమాచారం అందిన వెంటనే సుక్మా కలెక్టర్​ దేవేశ్​కుమార్​ధృవ్​ వైద్య బృందాలను దనికొడత గ్రామానికి  పంపించారు. 

మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు అందించారు.  620 మంది ఉండే గ్రామంలో మరో 80 మందికి అనారోగ్య లక్షణాలు బయటపడగా చికిత్స చేస్తున్నారు. మరణాలకు కారణాలేంటనేది విశ్లేషించాలని కలెక్టర్​ వైద్యాధికారులను ఆదేశించారు.