ఢిల్లీలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్లే తాము సకాలంలో పార్లమెంట్ కు చేరుకోలేక మహిళా బిల్లుపై ఓటు వేయలేకపోయామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, స్వయంగా పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రకటించారని అన్నారు. మహిళా బిల్లు పాస్ అయ్యేటప్పుడు 66 మంది బీజేపీ ఎంపీలు కూడా సభలో లేరని, వాళ్లెందుకు ఆబ్సెంట్ అయ్యారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకే తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అన్నారు. కేవలం ఎన్నికల కోసమే మహిళా బిల్లు అంటూ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను బీజేపీ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు. ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి అని విమర్శించారు. కిషన్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.