- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తాడని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. భవనగిరి, నల్గొండలో ఏదో ఓ స్థానం నుంచి బరిలో ఉండాడని స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రభుత్వం వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ స్కీమ్‌లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు త్వరగా పేమెంట్లు చెల్లించాలని సూచించారు.
ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని వాపోయారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఏఎంఆర్పీకి నీళ్లు రావడంలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని అంటున్నారని, అది అయ్యే పని కాదన్నారు.
సీఎం శాసనమండలిపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనైనా చులకనగా చూడవద్దని సూచించారు. ఏపీ, తమిళనాడు లాంటి రాజకీయాలు తెలంగాణలోకి రావద్దని తాను కోరుకుంటున్నాని, ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు సరికావున్నారు. రేవంత్ రెడ్డి నెల పరిపాలనపై ఇప్పుడే మాట్లాడలేమని, మంచి చేస్తే స్వాగతిస్తామని చెప్పారు.