- ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైంది
- ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడ్తది
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలో చేరిన
- మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వట్లేదు
- బీఆర్ఎస్లోనే లిల్లీపుట్స్ ఉన్నరు
- పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని కామెంట్
నల్గొండ, వెలుగు: చెప్పుడు మాటలు విని కేసీఆర్ చెడిపోయారని బీఆర్ఎస్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ వెంట ఉన్నోళ్లే పార్టీ ఆగం కావడానికి కారణమని అన్నారు. శనివారం నల్గొండలో మీడియాతో గుత్తా మాట్లాడారు. ‘‘చెప్పుడు మాటలు వినే కేసీఆర్చెడ్డడు. అలాంటోళ్లను కేసీఆర్ ఇప్పటికైనా పక్కనపెట్టాలి. పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకోవాలి. ఆ దిశగా ఆలోచన చేస్తేనే పార్టీ బతుకతది. పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడం వల్లే బీఆర్ఎస్ కు ఈ దుస్థితి దాపురించింది.
పరిస్థితి ఇట్లనే ఉంటే దేశంలో బీఎస్పీకి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది” అని ఆయన అన్నారు. ‘‘తెలంగాణవాదిగా కేసీఆర్కు పేరుంది. ఆయన మంచి వ్యక్తి. డబ్బు మీద ఆశ లేదు. చెడు మాటలు చెప్పే వాళ్లతోనే కేసీఆర్కు ఈ దుస్థితికి వచ్చింది. నా కొడుకు అమిత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నది కూడా వాళ్లే. ఎంపీగా పోటీ చేయాలని పార్టీ చెప్పినా, జిల్లా నేతలు సహకరించరనే పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది” అని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తును అమితే ప్రకటిస్తారని, తాను మాత్రం రాజ్యాంగ బద్ధమైన పదవిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
నాపై జిల్లా నేతల కుట్ర..
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని గుత్తా అన్నారు. ‘‘రైతుబంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఎట్ల ఉండేదో.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లనే ఉంది. నేను రైతుబంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా కింద ఎవరూ లేరు. ఒక సిస్టమ్లేదు. ఏ పని చేయాలో కూడా ఎవరికీ తెల్వదు. అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారం ఉన్నది. ఎప్పుడైనా సరే పార్టీ నిర్మాణం ముఖ్యం. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు కేంద్రంగా రాజకీయాలు నడుస్తాయో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ఒకవేళ నేను తప్పు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను పిలిచి అడగొచ్చు.
జిల్లాలో పార్టీ పరిస్థితులు, నాపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే అపాయింట్ మెంట్ అడుగుతున్నాను. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. హైకోర్టు చీఫ్జస్టిస్ప్రమాణ స్వీకారం సందర్భంగా డైరెక్టుగా కేసీఆర్ నే అడిగిన. అప్పుడు ఆయన ‘మీ మేసేజ్ అందింది.. త్వరలో పిలుస్తా’ అని అన్నారు. కానీ ఇంతవరకు పిలుపు రాలేదు. నేను కేసీఆర్ ను కలవకుండా జిల్లా నేతలే అడ్డుకుంటున్నారు. నాపై కుట్రలు చేస్తున్నారు” అని ఆరోపించారు.
అప్పటి జిల్లా మంత్రుల అహంకారంతోనే ఓడిపోయినం..
బీఆర్ఎస్ పార్టీలోనే లిల్లీపుట్స్ ఉన్నారని గుత్తా అన్నారు. ‘‘రాష్ట్రంలో లిల్లీపుట్స్ రాజ్యమేలుతున్నారని కేసీఆర్ అంటున్నారు. కానీ బీఆర్ఎస్లోనే లిల్లీపుట్స్ఉన్నారు. వాళ్లను కేసీఆరే పెంచి పోషించిండు. అలాంటి వాళ్లతోనే నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. లిల్లీపుట్స్లాంటోళ్లు నల్గొండ జిల్లాలో కూడా ఉన్నారు. వాళ్ల కారణంగానే జిల్లాలోని 11 స్థానాల్లో పార్టీ అడ్రస్గల్లంతైంది. అప్పటి జిల్లా మంత్రుల అహంకారం వల్లనే పార్టీ ఓడిపోయింది” అని కామెంట్ చేశారు.
‘‘2019 ఎన్నికల్లో జిల్లాలో రెండు ఎంపీ సీట్లు ఓడిపోయాం. కానీ ఓటమిపై ఒక్కసారీ సమీక్ష చేయలేదు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత గెలుపోటములపై సమీక్ష చేసుకోవాలి. బీఆర్ఎస్పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడవడం లేదు’’ అని అన్నారు. కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తేనే బీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. ‘‘సిట్టింగ్ ఎంపీగా ఉన్న నన్ను బీఆర్ఎస్ లో చేరాలని ఆనాడు కేసీఆర్ కోరారు. ఏకంగా 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలో చేరిన. అప్పుడు నాకు 3 నెలల్లోనే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిండు. కానీ ఆరేడు నెలలైనా ఇవ్వకపోతే వెళ్లి కేసీఆర్ ను అడిగిన. మూడేండ్లు కాలయాపన చేసి రైతు బంధు సమితి అధ్యక్ష పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వడం కుదరకపోతే 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని చెప్పిన. దీంతో కేసీఆర్ నన్ను ఎమ్మెల్సీ చేశారు” అని చెప్పారు.
జగదీశ్ రెడ్డిపై విమర్శలు..
జిల్లా నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా కామెంట్లు చేశారు. ‘‘నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నేను ఎవరినీ హత్య చేయలేదు. కొందరు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించారు. పప్పు బఠానీలు, మంచినీళ్లు అమ్ముకునేటోళ్లు కోట్లకు పడగెలెత్తారు. ఉద్యమ సమయంలో ఐదొందలు, వెయ్యి అడుక్కున్నోళ్లకు ఇప్పుడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?” అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 2014 నాటి పరిస్థితులు..
రాష్ట్రంలో ఇప్పుడు 2014 నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని గుత్తా అన్నారు. ‘‘కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రమంతా అగమ్యగోచరంగా ఉంది. డబ్బు లేకనో, రాష్ట్రం కొత్తగా ఏర్పడడం వల్లనో పరిస్థితులు సరిగా లేవు. ఇప్పుడు రేవంత్రెడ్డి వచ్చాక కూడా అవే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖజానా ఖాళీగా ఉంది. ఇచ్చిన హామీలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ఏడాదిలో దాన్ని సరిదిద్దుకుని మంచిబాటలో పోతే ప్రభుత్వం నడుస్తది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఏ ప్రభుత్వానికైనా చెడ్ద పేరు తప్పదు” అని అన్నారు.