- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- ఉద్యమకారులను ఆదుకోవాలి: కోదండరామ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ కార్యక్రమాలకు శాసన మండలి సభ్యులను ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. అయితే.. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించడం లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇకపై ప్రభుత్వ ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపన, ఇతర కార్యక్రమాలకు తప్పనిసరిగా కౌన్సిల్ సభ్యులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆయన ఆదేశించారు.
అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్) పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, నిధులు మొత్తం విడుదల చేయాలని కోరారు. శనివారం శాసన మండలిలో మూడు బిల్లులతో పాటు స్పెషల్ మెన్షన్స్పై సభ్యులు అగిడిన ప్రశ్నలకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం సమాధానం చెప్పారు. సభ్యుడు కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఓపీఎస్ అమలు చేయాలి: నరోత్తంరెడ్డి
పాత పెన్షన్ స్కీమ్ విధానం అమలుచేసి ఉద్యోగులను ఆదుకోవాలని టీచర్ ఎమ్మెల్సీ కూర నరోత్తం రెడ్డి కోరారు. ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దశలవారీగా 2003 నాటి పెన్షన్ విధానం అమలు చేస్తే రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని, మూడువేల మందికి న్యాయంజరుగుతుందని తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ జరపాలి: తీన్మార్ మల్లన్న
రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు జరిపిన క్లినికల్ ట్రయల్స్‌తో ఓ వ్యక్తికి అన్ని అవయవాలు దెబ్బతిన్నాయని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. దీన్ని విచారిస్తే అమెరికా వరకు షేక్ అవుతుందని పేర్కొన్నారు. నిమ్స్‌లో ఇప్పటికీ ఆంధ్రా వాళ్లనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని వాపోయారు. తెలంగాణలో పారామెడికల్ చేసిన నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని కోరారు.