- గరంగరంగా గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్
- వరదలు వచ్చినా నిధులు ఇవ్వరా అని నిలదీసిన బీజేపీ కార్పొరేటర్లు
- ఆందోళనకు దిగిన కార్పొరేటర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
- సగం మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా
హనుమకొండ/వరంగల్ సిటీ, వెలుగు : ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన కౌన్సిల్ మీటింగ్ ఆందోళనలు, ధర్నాలు, అరెస్ట్‌లతో దద్దరిల్లింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ రణరంగంగా మారింది. వివిధ సమస్యలను లేవనెత్తిన బీజేపీ కార్పొరేటర్లను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఎలాంటి చర్చ లేకుండా, కేవలం అరగంటలోనే మీటింగ్ ముగిసింది. గ్రేటర్ వరంగల్‌లో 66 మంది కార్పొరేటర్లు ఉంటే సగం మంది మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. చివరికి కో ఆప్షన్ మెంబర్స్, నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీకూడా మీటింగ్‌కు హాజరుకాలేదు. మధ్యాహ్నం 12 గంటలకు మీటింగ్ ప్రారంభం కాగానే ముందుగా మలేరియా డిపార్ట్‌మెంట్ కార్మికుడు ఎర్ర రాజు, శానిటేషన్ కార్మికుడు మైదం జనార్దన్ మృతికి సంతాపం తెలిపి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎజెండా అంశాలను చదివి వినిపించారు.
సమస్యలు, నిధుల కేటాయింపుపై బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన
మీటింగ్‌లో నాలాల అంశం ప్రస్తావనకు రావడంతో బీజేపీ కార్పొరేటర్ చాడ స్వాతిరెడ్డి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు, మేయర్ మధ్య వాగ్వాదం మొదలైంది. డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ‘గెలిచి రెండున్నరేండ్లు అయింది, డివిజన్లలో చేసిన పనులకు పైసలు రిలీజ్ చేస్తలేరు, పైసలు రాక కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరు.. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అత్యవసర పనులు చేయడానికి కూడా నిధులు ఇవ్వకుంటే ఎట్లా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించిన రూ.50 లక్షలకు సంబంధించిన పనులు, చెల్లింపులు పూర్తి కాలేదని, ప్రతి డివిజన్‌కు వెంటనే రూ.కోటి రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ అధికార పార్టీ కార్పొరేట్లరకు ఒక రకంగా, ప్రతిపక్షాలకు మరో రకంగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ఇలా అయితే తమ మ డివిజన్లలో ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. అభివృద్ధి చేయని పాలకమండలిని వెంటనే రద్దు చేయాలంటూ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో మేయర్ గుండు సుధారాణి సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. తర్వాత బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాలు ఎదుట బైఠాయించి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆఫీసర్లు స్పందించకపోగా, కౌన్సిల్ సభ్యులకు లంచ్ కోసం ఏర్పాట్లు చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు ఫుడ్ వెహికల్స్‌ను అడ్డుకున్నారు. మీటింగ్‌లో సమస్యలపై చర్చించకుండా టీ, స్నాక్స్, లంచ్ పేరుతో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ కార్పొరేటర్లు, నేతల అరెస్ట్
మేయర్ తీరును నిరసిస్తూ బీజేపీ కార్పొరేటర్లు సుమారు 2 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. దీంతో మట్వాడా పోలీసులు వచ్చి బీజేపీ కార్పొరేటర్లు, లీడర్లను అరెస్ట్ చేశారు. కార్పొరేటర్లు లావుడ్య రవినాయక్, చాడ స్వాతిరెడ్డి, గురుమూర్తి శివకుమార్, గుజ్జుల వసంత, అనిత, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పార్టీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కుసుమ సతీశ్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మహిళా కార్పొరేటర్లను సైతం మగ పోలీసులే పోలీస్ వెహికల్స్‌లో ఎక్కించి, తరలిస్తుండడంతో బీజేపీ నేతలు కిషన్, శ్రవణ్ పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ లీడర్ల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.