జనగామ, వెలుగు : ‘జనగామ పట్టణంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నయ్, ఆఫీసర్లలో నిర్లక్ష్యం పెరిగింది, సమస్యలు చెబుదామంటే అందుబాటులో ఉండరు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవరు, గిట్లైతే వార్డుల్లో ఎట్లా తిరగాలె, జనాలకు ఏం సమాధానం చెప్పాలె’ అని మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్ పోకల జమున లింగయ్య అధ్యక్షతన శుక్రవారం జనగామ మున్సిపల్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ సుహాసిని హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా మాట్లాడుతూ పట్టణ ప్రజలు డెంగ్యూ, వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది
పడుతున్నారని స్పెషల్ డ్రైవ్ చేపట్టి బ్లీచింగ్, ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ బండ పద్మ మాట్లాడుతూ బస్టాండ్ ఏరియాలో రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీటింగ్ దృష్టికి తీసుకొచ్చారు. గుర్రం భూ లక్ష్మి మాట్లాడుతూ తన ఏరియాలో ఉన్న దోభీ ఘాట్‌ను మరో చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు. బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం వంగాల కళ్యాణి, మంత్రి సుమలత, ఊడుగుల శ్రీలత తమ వార్డుల్లోని సమస్యలను వివరించారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ కౌన్సిలర్లు చెప్పే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆఫీసర్లు జవాబుదారీగా వ్యవహరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం 12 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టగా నాలుగు అంశాలను వాయిదా వేసి మిగిలిన వాటిని ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రజిత, డీఈ చంద్రమౌళి, వైస్ చైర్మన్ రాంప్రసాద్, మేనేజర్ రాములు పాల్గొన్నారు.