- ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌కు తరలిన 16 మంది కౌన్సిలర్లు
- 27న కలెక్టర్‌ను కలవనున్న భువనగిరి, ఆలేరు కౌన్సిలర్లు
యాదాద్రి, వెలుగు : భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీకి వెళ్లిన బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు క్యాంప్చేంజ్ చేశారు. ఏపీ నుంచి వచ్చినట్టే వచ్చి వెంటనే హైదరాబాద్‌కు తరలివెళ్లారు. 20 మంది బీఆర్ఎస్కు చెందిన 20 మంది కౌన్సిలర్లలో 16 మంది అసంతృప్త జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో 11 మంది కౌన్సిల్‌కు రాకుండా ఈ నెల 21న టూర్‌కు వెళ్లారు. నాలుగు రోజులుగా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తిరిగిన వీరు సోమవారం భువనగిరికి చేరుకున్నారు. ఆ వెంటనే స్థానికంగా ఓ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంట్లో భేటీ అయ్యారు.
కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై ఉండాలని, చైర్మన్, వైస్‌చైర్మన్‌పై మరోసారి అవిశ్వాస నోటీసు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నట్టు తెలిసింది. మంగళవారం సెలవు రోజు కాబట్టి ఈ నెల 27న (బుధవారం) కలెక్టర్‌ను కలువనున్నట్లు సమాచారం. స్థానికంగా ఉంటే బీఆర్ఎస్ పెద్ద లీడర్ల నుంచి ఒత్తిడి వస్తుందన్న ఉద్దేశంతో ఈసారి మరో ఐదుగురిని కలుపుకొని హైదరాబాద్‌కు వేర్వేరు వాహనాల్లో వెళ్లినట్టు తెలిసింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది.
27న కలెక్టర్ వద్దకు..
క్యాంపుకు వెళ్లిన కౌన్సిలర్లు బుధవారం తిరిగి భువనగిరి రానున్నారు. అదే రోజు కలెక్టర్ హనుమంతు జెండగేను కలిసి నోటీసు మరోసారి ఇస్తారని సమాచారం. ఇటు ఆలేరు మున్సిపాలిటీలోని 12 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు 10 మంది ఒక్కటయ్యారని తెలిసింది. తాము కూడా బుధవారం కలెక్టర్‌ను మరోసారి కలుస్తామని ఓ కౌన్సిలర్ తెలిపారు. అవసరమైతే మరోసారి అవిశ్వాసం నోటీసు ఇస్తామని చెప్పారు.