జమ్మికుంట బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు యూటర్న్.. మున్సిపల్​ చైర్మన్​పై అవిశ్వాసం

  • కలెక్టర్ కు తీర్మానం అందించిన 20 మంది కౌన్సిలర్లు– కాంగ్రెస్​లో చేరే ఆలోచనలో గులాబీ లీడర్లు
  • చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల గళం
  • కరీంనగర్ లోని హోటల్​లో చైర్మన్ కు, కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య మధ్య వాగ్వాదం 
  • క్యాంప్ నకు తరలిన కౌన్సిలర్లు 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు జెండా ఎగురేశారు. గత కొద్ది రోజులుగా చైర్మన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయ్యారు. జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా 20 మంది చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసులో సంతకాలు చేశారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కు చేరుకుని డీఆర్వోకు నోటీస్ అందజేశారు. 

వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కొందరు కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం కూడా అవిశ్వాసానికి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తమ పార్టీ కౌన్సిలర్లను వారించినప్పటికీ వారు వినిపించుకోలేదని తెలిసింది. ఇప్పటికే కొందరు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రిని కూడా కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు తమ సమ్మతిని తెలియజేసినట్లు సమాచారం. 

చైర్మన్ పై ఆరోపణలివే.. 

కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం లేకుండా చైర్మన్ ఎజెండా తయారు చేస్తున్నారని, ప్రతి ఎజెండాలో ముందస్తుగా చైర్మన్ ఆదేశానుసారం 70 శాతం నిధులు ఖర్చు పెట్టి కమిటీ ఆమోదం కోసం సమర్పిస్తున్నారని అసమ్మతి కౌన్సిలర్లు తమ నోటీసుల్లో ఆరోపించారు. అలాగే అడ్వాన్స్డ్ గా లక్షలాది రూపాయిలు డ్రా చేసి చేయని పనులకు బిల్లులు పెట్టి రికార్డు చేస్తున్నారని పేర్కొన్నారు. డీజిల్, బ్లీచింగ్ పౌడర్ ఖర్చు పేర, ఖర్చు కన్నా ఎక్కువగా బిల్లులు పెట్టి చైర్మన్ డ్రా చేశారని ఆరోపించారు. 

పట్టణ ప్రగతిలో చేయని పనులను చేసినట్లు చూపి బిల్లులు డ్రా చేశారని, సద్దుల బతుకమ్మ, దసరా, గణేశ్ నిమజ్జనం‌‌‌‌‌‌‌‌సందర్భంగా టెండర్లు లేకుండా చైర్మన్ పనులు చేసి రికార్డు చేయించుకొని లక్షలాది రూపాయలు డ్రా చేసుకున్నారని‌‌‌‌‌‌‌‌నోటీసులో వివరించారు. జనరల్ ఫండ్స్ ను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. 

చైర్మన్ రాజేశ్వర్ రావు, కౌన్సిలర్ మల్లయ్య మధ్య వాగ్వాదం

కౌన్సిలర్లు తనపై అవిశ్వాసం పెట్టేందుకు వచ్చారని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు హుటాహుటిన కరీంనగర్ చేరుకున్నారు. కౌన్సిలర్లు ఉన్న హోటల్ వద్దకు చేరుకుని కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. తన వెంట 15 మంది కౌన్సిలర్లు ఉన్నారని, తనకేం భయం లేదని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో క్యాంప్ ? 

అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్ కు నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లు హైదరాబాద్ కు బయల్దేరారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 23వ డివిజన్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఈ అసమ్మతి కౌన్సిలర్లకు నేతృత్వం వహిస్తున్నారు. క్యాంప్ నకు తరలివెళ్లినవారిలో మారెపల్లి బుచ్చయ్య, పిట్టల శ్వేత, మేడిపల్లి రవీందర్, బొంగోని వీరన్న, దేశిని రాధ, ఎలగందుల స్వరూప, శ్రీపతి నరేశ్​, కూతాటి రాజయ్య, రావికంటి రాజ్ కుమార్, బిట్ల కళావతి, పొనగంటి సారంగం, గుల్లి పూలమ్మ, పొనగంటి విజయలక్ష్మి, మద్ది లావణ్య, సాయిని రమ, దిడ్డి రాంమోహన్, పొనగంటి రాము, కల్వల దీప్తి, పొనగంటి శ్రీలత ఉన్నారు. 

వీరిలో సాయిని రమ కాంగ్రెస్ నుంచి గెలుపొందగా, మిగతావాళ్లంతా బీఆర్ఎస్ కౌన్సిలర్లే కావడం గమనార్హం. అవిశ్వాసానికి సంబంధించి బలనిరూపణకు అధికారులు సమావేశం ఏర్పాటు చేసేవరకు వీరంతా హైదరాబాద్ లోనే మకాం వేయనున్నట్లు తెలిసింది.