- చల్లారని అసమ్మతి
- తెలంగాణ భవన్లో బుజ్జగించినా కనిపించని ఫలితం
వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై కౌన్సిలర్లు వెనక్కి తగ్గడం లేదు. అసంతృప్తి తొలగించేందుకు ఇటీవల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లోని తెలంగాణ భవన్ కు కౌన్సిలర్లను పిలిపించుకొని మాట్లాడారు.
ఒక్కో కౌన్సిలర్ అభిప్రాయం తీసుకుని సర్ది చెప్పి, సమస్య పరిష్కారం అయినట్లేనని ప్రకటించారు. అయితే అసమ్మతి కౌన్సిలర్లు మాత్రం అవిశ్వాసం పెట్టి చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ను పదవి నుంచి తప్పిస్తామని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అయోమయం నెలకొంది. ఈ నెల చివరి వారంలో వనపర్తి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇస్తామంటూ ప్రచారం జరుగుతోంది.
చైర్మన్ పై అవినీతి ఆరోపణలు!
వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. ఇందులో 24 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ, దాని మద్దతుదారులు గెలిచారు. ఆరింటిని కాంగ్రెస్, రెండింటిని బీజేపీ, ఒక స్థానంలో టీడీపీ గెలిచింది. మెజార్టీ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ గట్టు యాదవ్ ను చైర్మన్ గా, వాకిటి శ్రీధర్ ను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసింది. వీరిద్దరూ తమను ఏ మాత్రం పట్టించుకోలేదని, తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శిస్తున్నారు.
చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాలేదని మండిపడుతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, తమ స్వార్థం కోసమే పని చేశారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి ప్రధాన అనుచరుడైన గట్టు యాదవ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించటం వల్లే ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ఆ పార్టీ కౌన్సిలర్లు అంటున్నారు. నాలుగేండ్లుగా మున్సిపాలిటీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. నకిలీ రశీదులతో ఓ బిల్ కలెక్టర్ నల్లా బిల్లులు, ఇంటి టాక్స్ లు వసూలు చేసి స్వాహా చేయగా, రికవరీ చేయలేదని విమర్శిస్తున్నారు.
వనపర్తి సమీపంలో అగ్రిగోల్డ్ వెంచర్ లోని మున్సిపల్ ఖాళీ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నా పాలకవర్గం స్పందించలేదని, రాజనగరం బాయమ్మతోట సమీపంలోని వెంచర్లలో అక్రమాలు జరిగి స్థలాలను ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయడంపై కూడా ఫిర్యాదులు వచ్చినా స్పందించలేదని అంటున్నారు. శానిటేషన్ మెరుగుపరిచేందుకు తెప్పించిన రూ.40 లక్షల విలువ చేసే స్వీపింగ్ మిషన్ ఒక్క రోజు కూడా పని చేయకుండా మూలకు పడ్డ వ్యవహారంపై విచారణ చేపట్టకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
బిల్లుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డా, రికవరీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరితహారంలో భాగంగా మొక్కల కొనుగోలు, పంపిణీలో అవినీతికి పాల్పడ్డారని, ప్రధాన రహదారి పక్కన డబ్బాలు పెట్టుకున్న చిరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ నిధులు పక్కదారి పట్టించడం, ప్రతి పనికీ పర్సంటేజీలు తీసుకున్నారంటూ చైర్మన్ పై ఆరోపణలు చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేరుగా చైర్మన్, వైస్ చైర్మన్లను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు.
అయితే అవిశ్వాసం పెట్టవద్దని చైర్మన్ గట్టు యాదవ్ కోరుతున్నారు. తప్పులు సరి చేసుకుంటానంటూ వేడుకుంటున్నా కౌన్సిలర్లు మాత్రం ససేమిరా అంటున్నట్లు తెలిసింది. దీనికితోడు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు గట్టు యాదవ్ ను పదవి నుంచి దింపేందుకు సహకరిస్తామని చెప్పడంతో అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మున్సిపాలిటీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచులు ఎదురుచూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.