మున్సిపల్ చైర్ పర్సన్తో రాజీనామా చేయించిన కౌన్సిలర్లు

  • తెల్లాపూర్ కౌన్సిల్ మీటింగ్ను బాయ్కాట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
  • మీటింగ్ హాల్లోకి రాకుండా మున్సిపల్ చైర్ పర్సన్ అడ్డగింత
  • చివరికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్ చైర్ పర్సన్ లలిత 

రామచంద్రాపురం, వెలుగు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇచ్చిన మాట ప్రకారం పదవికి రాజీనామా చేయాలని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్​చైర్ పర్సన్ ​లలితను కాంగ్రెస్​కౌన్సిలర్లు నిలదీశారు. కౌన్సిల్​మీటింగుకు వచ్చిన ఆమెను హాల్​లోకి రానియ్యకుండా అడ్డుకున్నారు. చివరికి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లలిత ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. తెల్లాపూర్​మున్సిపాలిటీ కౌన్సిల్​మీటింగ్ శుక్రవారం జరగాల్సి ఉండగా కాంగ్రెస్ కౌన్సిలర్లు బాయ్ కాట్​చేసి మీటింగ్ ​హాల్​ ముందు నిరసన చేపట్టారు. 

మే రెండో వారంలోపు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన మున్సిపల్ ​చైర్​పర్సన్​ లలిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. తెల్లాపూర్ పరిధిలోని చెరువులన్నీ కలుషితం అవుతున్నా చర్యలు తీసుకోలేదన్నారు. విద్యుత్​నగర్ ఫైనల్ ​లేఅవుట్, ప్రజల అవసరాలకు10 ఎకరాల స్థలం కేటాయింపు ఇలా దేనినీ పట్టించుకోలేదన్నారు. చైర్​పర్సన్​ దంపతులు లలిత, మాజీ సర్పంచ్​సోమిరెడ్డి గెలిచినప్పటి నుంచి మాట మారుస్తూ వచ్చారని మండిపడ్డారు. 

గత కౌన్సిల్ మీటింగులో ప్రకటించిన ప్రకారం పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అంతలోకి అక్కడికి వచ్చిన చైర్​పర్సన్​ లలితను మీటింగ్​హాల్​లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి లలిత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీటింగ్ హాల్ బయటే రాజీనామా పత్రాన్ని మీడియాకు చూపించారు. సాయంత్రం లోపు జిల్లా కలెక్టర్​ను కలిసి అందజేస్తామని చెప్పారు. కాగా రాజీనామా పత్రాన్ని తెల్లాపూర్ మున్సిపల్ ​కమిషనర్​కు ఇచ్చినట్లు సమాచారం. మున్సిపల్​ చైర్​పర్సన్, కమిషనర్ ఇద్దరూ ఫోన్ ​స్విచ్చాఫ్ ​చేయడంతో రాజీనామా చేశారా లేదా అనే సమాచారం స్పష్టంగా తెలియలేదు. రాజీనామా ప్రకటన మాత్రం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

ఇవి కూడా చదవండి

మోడీ చెప్పిన మార్పూ అంత తేలిక్కాదు!

మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే 

కొనుగోలు సెంటర్లలోనే వడ్ల బస్తాలకు చెదలు

మీరు పార్లమెంట్‌ ను రద్దు చేస్తే.. మేం అసెంబ్లీని రద్దు చేయిస్తం