వాటర్ ఎందుకు పెట్టట్లేదు?..లైన్‌‌మెన్‌‌పై కౌన్సిలర్‌‌ దాడి

వాటర్ ఎందుకు పెట్టట్లేదు?..లైన్‌‌మెన్‌‌పై కౌన్సిలర్‌‌ దాడి

గండిపేట, వెలుగు :  వాటర్​బోర్డు లైన్‌‌మెన్‌‌పై కౌన్సిలర్‌‌ దాడి చేసిన ఘటన నార్సింగి పీఎస్ పరిధిలో  చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కోకాపేట్‌‌ కు చెందిన పెసరి శ్రీధర్‌‌ మణికొండ డివిజన్‌‌ జీపీఈ వాటర్‌‌ సప్లై లైన్‌‌మెన్‌‌. సోమవారం తెల్లవారుజామున కోకాపేట్‌‌ సర్కిల్‌‌ వద్ద వాటర్‌‌ వాల్వ్ ఓపెన్‌‌ చేసేందుకు వెళ్తుండగా.. 5వ వార్డు కౌన్సిలర్‌‌ శివారెడ్డి అడ్డుకుని రాజీవ్‌‌గృహకల్పకు వాటర్‌‌ ఎందుకు సప్లై చేయడం లేదని ప్రశ్నించాడు. ఆ ఏరియా తన పరిధిలోకి రాదని,  మరో లైన్ మెన్ సుధాకర్‌‌ సప్లై చేస్తాడని చెప్పినా వినకుండా శ్రీధర్ ను బలవంతంగా తన వెహికల్ లో ఎక్కించేందుకు ప్రయత్నించాడు. లైన్ మెన్ ఎక్కకపోవడంతో అతడి చెంప పై కౌన్సిలర్ కొట్టాడు. అనంతరం తన అనుచరులకు ఫోన్‌‌ చేయగా 10 మంది బైక్‌‌లపై వచ్చి శ్రీధర్‌‌పై విచక్షణ రహితంగా దాడి చేయగా తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి పోలీసులు తెలిపారు.  

కౌన్సిలర్‌‌పై పీఎస్ లో కంప్లయింట్ 

వాటర్ బోర్డు లైన్‌‌మెన్‌‌పై దాడికి పాల్పడిన కౌన్సిలర్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వాటర్ బోర్డు ఎంప్లాయీస్‌‌ యూనియన్‌‌ అధ్యక్షుడు సతీశ్ డిమాండ్ చేశాడు. కౌన్సిలర్‌‌ శివారెడ్డి మద్యం మత్తులో శ్రీధర్‌‌పై దాడి చేశాడని ఆరోపించారు.   గిరిజన ఉద్యోగిపై తన అనుచరులతో దాడికి పాల్పడిన  కౌన్సిలర్‌‌ పై నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.