- రూ.15 లక్షలు సుపారి ఇచ్చిన కౌన్సిలర్
- జీపుతో ఢీకొట్టి మర్డర్ చేసేందుకు యత్నించిన కిరాయి గూండాలు
- తప్పించుకున్న బాధితుడు
- నలుగురు అరెస్టు.. పరారీలో కౌన్సిలర్ దంపతులు
ఆదిలాబాద్, వెలుగు : తన కూతురిని ప్రేమించిన యువకుడిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు ఓ కౌన్సిలర్. మర్డర్లా కాకుండా యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనుకున్నాడు. కానీ ఆ ప్రమాదంలో ఆ యువకుడు గాయాలతో బయటపడ్డాడు. ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ శనివారం మావల పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఉష్కెం రఘుపతి కూతురికి, మావల గ్రామానికి చెందిన దళితుడు ఎంబడి వంశీ (25) తో రెండేండ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం రఘుపతికి తెలియడంతో వంశీని చంపేస్తానని గతంలో బెదిరించాడు.
ఆ తర్వాత కూడా వాళ్లిద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారని తెలుసుకున్న రఘుపతి.. వంశీని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 25న తన మిత్రుడు చౌహాన్ రవిని రఘుపతి కలిశాడు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన చౌహాన్ రవి గతంలో జైనథ్ తోపాటు, హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనం కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. వంశీని జీపుతో గుద్ది చంపాలని, అందుకు రూ.15 లక్షలు ఇస్తానని చెప్పాడు. అడ్వాన్సుగా రఘుపతి రూ.లక్ష ఇచ్చాడు. ఎన్నికల తర్వాత హత్య చేయాలని పథకం వేశారు.
రెక్కీ చేసి.. ఆ తర్వాత యాక్సిడెంట్
వంశీని చంపేందుకు చౌహాన్ రవి తన స్నేహితుడు అశోక్ సాయం కోరాడు. నవంబర్ 28న రఘుపతి ఆ ఇద్దరినీ తన కారులో తీసుకెళ్లి మావలలోని వంశీ ఇంటిని చూపించాడు. అక్కడ వారు రెక్కీ చేశారు. రఘుపతి భార్య అరుంధతి సైతం వంశీని చంపాలని ఆ ఇద్దరిని కోరింది. యాక్సిడెంట్ కోసం జీపు అవసరం కావడంతో అశోక్ తన స్నేహితుడైన ఖానాపూర్ కు చెందిన షేక్ దిల్హద్ ను సంప్రదించాడు. దీంతో వారు జైనథ్ మండలంలోని మేడిగూడకు చెందిన జీపు ఓనర్ రాజును సంప్రదించి విషయం చెప్పారు. రూ.20 వేలు చెల్లించి జీపును తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. డిసెంబర్ 17న జీపు తీసుకున్న రవి, అశోక్ అదే రోజు సాయంత్రం వంశీ ఇంటి వద్ద మరోసారి రెక్కీ నిర్వహించారు.
మరుసటి రోజు వంశీ ఉదయం 5 గంటలకు మణిపూర్ కాలనీలో ఉన్న తన మిల్క్ డెయిరీ ఫాంకు స్కూటీపై బయల్దేరాడు. కొత్తవాడ మూల మలుపు దగ్గర అప్పటికే జీపులో కాపుకాస్తున్న అశోక్, రవి.. వంశీని వెంబడించారు. 5:30 గంటల ప్రాంతంలో మావల శివారులోని శ్మశానవాటిక దగ్గర వంశీ స్కూటీని ఢీకొట్టారు. దీంతో వంశీ బైక్ పైనుంచి కింద పడ్డాడు. అతనిపై జీపును ఎక్కించి హత్య చేద్దామని భావించిన అశోక్, రవి.. వెహికల్‌ను రివర్స్ తీస్తుండగా వెనుక ఉన్న ఎలక్ట్రిక్ పోల్ కు తగిలింది. ఆ స్పీడుకు పోల్ విరిగి కింద పడడంతో భయంతో ఆ ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ప్రమాదంలో వంశీ గాయాలతో బయటపడ్డాడు.
రఘుపతిపై అనుమానం వ్యక్తం చేస్తూ వంశీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏ1గా కౌన్సిలర్ ఉష్కెం రఘుపతి, ఏ2గా ఆయన భార్య అరుంధతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. మిగతా నలుగురు నిందితులు చౌహాన్ రవి, అశోక్, షేక్ దిల్హద్, వి.రాజును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నుంచి రూ.18,500 నగదు, 4 మొబైల్స్, బైక్ లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.