- జనగామ మున్సిపల్ మీటింగ్‌లో కౌన్సిలర్ల ఆగ్రహం
జనగామ, వెలుగు :‘ఇష్టమున్నంత అంచనా వేస్తున్నరు.. అవసరం లేని వాటికి ఖర్చు చేస్తున్నరు.. అడ్డగోలుగా బిల్లులు పెడుతున్నరు.. అయినా అభివృద్ధి పనుల జాడే లేదు’ అంటూ జనగామ మున్సిపల్ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమున్నట్లు బిల్లులు పాస్ చేసుకునేందుకు మీటింగ్‌లు ఎందుకంటూ మండిపడ్డారు. జనగామలోని మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం చైర్‌పర్సన్ పోకల జమున లింగయ్య మీటింగ్ నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార, విపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. బీజేపీ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలకు సర్కారు నిధులిచ్చినా మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికే ఉత్సవాలకు కేటాయించిన రూ. 10 లక్షలు సరిపోలేదంటూ మళ్లీ బిల్లులు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలు, పాంప్లెంట్లు, మెమెంటోలు, శాలువాల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం సరికాదన్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ అధ్వానంగా మారిందని ఎంత మొత్తుకున్నా ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడడం లేదన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేశ్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇక్కడ పనిచేసే భిక్షపతిని మరో విభాగంలోకి మార్చాలని గత కౌన్సిల్ మీటింగ్‌లో తీర్మానం చేసినా ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు. మరో ఉద్యోగి యాదగిరి కూడా సరిగ్గా పనిచేయడం లేదని, వెంటనే ఇద్దరినీ మార్చాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో జక్కుల అనిత, బొట్ల శ్రీనివాస్, మారబోయిన పాండు, సుధా సుగుణాకర్‌రాజు, ఎండీ.సమద్, మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, డీఈ చంద్రమౌళి పాల్గొన్నారు.