సమస్య వినకుండా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా?

  •     కొత్తగూడెం కౌన్సిల్​ మీటింగ్ లో ఆఫీసర్లపై కౌన్సిలర్ల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కౌన్సిల్​ మీటింగ్ ​అంటే ఆఫీసర్లకు చులకనగా మారిందని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చట్లు పెట్టుకునే ఆఫీసర్లు..  కౌన్సిలర్లు చెప్పే సమస్యలు ఎట్లా వింటారంటూ అసహనం వ్యక్తం చేశారు. కొత్తగూడెం మున్సిపల్​ కౌన్సిల్​ మీటింగ్​ చైర్​ పర్సన్​ కె. సీతాలక్ష్మి అధ్యక్షతన శనివారం మున్సిపల్​ ఆఫీస్​లో జరిగింది.

చైర్​ పర్సన్​పై 22 మంది కౌన్సిలర్లు నాలుగైదు రోజుల కిందట కలెక్టర్​కు అవిశ్వాసం లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో జరుగుతున్న కౌన్సిల్​ మీటింగ్​కు ప్రాధాన్యత ఏర్పడింది. మంచినీటి ఎద్దడి నివారణ కోసం వార్డుకు రూ. 2లక్షలు కేటాయించారని, ఫండ్స్​ మాత్రం ఇవ్వలేదని సభ్యులు ప్రశ్నించారు. కోతులు, కుక్కల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వాపోయారు. కరెంట్​ పోల్స్​ అవసరమని గతంలో కౌన్సిల్​లో తీర్మానం చేసినా పనులు మాత్రం ముందుకు పడలేదన్నారు.

పట్టణంలో పేదలకు డబుల్​ బెడ్​ రూం ఇండ్లను లాటరీ పద్ధతిలో ఎలాట్​ చేసినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అప్పగించలేదని తెలిపారు. మీటింగ్​లో మున్సిపల్ కమిషనర్​ రఘు, డీఈ రవికుమార్, మేనేజర్​ సత్యనారాయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అవిశ్వాసంపై సంతకాలు చేసిన వారిలో చాలా మంది కౌన్సిలర్లు కౌన్సిల్​ మీటింగ్​ మొదలైన కొద్ది సేపటి నుంచే ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోయారు.