
- హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో 11 మంది కౌన్సిలర్లు
- నేడు కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇస్తామని ప్రకటన
వరంగల్/నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయ్యారు. గురువారం జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్‌కు 15 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు హాజరుకాలేదు. వీరిలో 11 మంది శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మకాం వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ తీరు వల్ల అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, వారిద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు స్పష్టం చేశారు. శనివారం ఉదయం వరంగల్‌కు వచ్చి కలెక్టర్‌ను కలిసి అవిశ్వాసం నోటీసు ఇస్తామని వెల్లడించారు.
తమకు 14 మంది కౌన్సిలర్ల మద్దతు ఉందని, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా ఉంటుందన్నారు. కాగా శుక్రవారం రాత్రే కౌన్సిలర్లంతా వరంగల్‌కు చేరుకున్నారు. అయితే అవిశ్వాసం పెట్టకుండా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తిరుగుబాటు చేసిన కౌన్సిలర్లను బుజ్జగించేందుకు కొందరు లీడర్లు రంగంలోకి దిగారు. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కౌన్సిలర్లను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.