
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. సోమవారం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈదులపూసపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు సమావేశం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వైపు వార్డులకు రూ.కోటి రూపాయలు కేటాయించాలని కౌన్సిలర్లు అడుగుతుంటే , ఎమ్మెల్యే వార్డులతో సంబంధం లేని వ్యక్తులతో కలిసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.50 కోట్ల ఫండ్స్‌ను..అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పంచాల్సి ఉండగా ఎమ్మెల్యే ఒక్కడే ఈ నిధులను పనుల కోసం కేటాయిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, సీపీఐ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి రెడ్డి, సీపీఎం ఫ్లోర్ లీడర్ సర్ణపు సోమయ్య, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎడ్ల వేణు, బి.నీరజారెడ్డి, బుజ్జి వెంకన్న, బానోత్ హరిసింగ్, అరెంపుల విజయమ్మ, పోతు రాజు, కోడి నాగలక్ష్మి, బూక్యా శ్రీను, బూక్యా సునీత, రవికుమార్, తాళ్లపల్లి జగన్, నిమ్మల శ్రీను పాల్గొన్నారు.