అవిశ్వాస తీర్మానానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన కౌన్సిలర్లు

హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై అవిశ్వాసం కోసం బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు పట్టు వీడడం లేదు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ కు వెళ్తూ మార్గమధ్యలో కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. అవిశ్వానికి కట్టుబడి ఉండాలంటూ కౌన్సిలర్లు ఆలయంలో ప్రమాణం చేశారు. 22మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లేఖను ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆఫీసులో సమర్పించారు. అయితే .. అవిశ్వాస నోటీసుపై గందె రాధిక హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం స్టే ఇచ్చింది. 

మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్​ రాధిక ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రశ్నించిన సభ్యులను బెదిరిస్తూ బిల్లులను పాస్​ చేయించుకుంటున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. చైర్‌‌‌‌పర్సన్​ భర్త శ్రీనివాస్ అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ తమ బినామీలతో టెండర్లు వేయించి.. కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కౌన్సిలర్లు చైర్‌‌‌‌పర్సన్‌‌ రాధికకు వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడినా.. నాయకులు వారికి సర్ది చెప్పారు. కానీ, ఈసారి మాత్రం వారు తగ్గేదే లేదంటున్నారు. చైర్‌‌‌‌పర్సన్ భర్త తీరు వల్లే కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు విసిగిపోయినట్లు తెలుస్తోంది.